ఈ సృష్టిలో నిద్రకు ప్రత్యేక స్థానం ఉంది. మనుషుల నుంచి మొదలు జంతువుల వరకు అన్ని జీవులు నిద్రిస్తాయి. ముఖ్యంగా మనుషుల జీవన చక్రానికి, నిద్రకు విడదీయలేని సంబంధం ఉంది. మనం రాత్రి పడుకున్నప్పుడే మన జీవ క్రియ దాని పనులు అది చేసుకుంటుంది. ఆ సమయంలో మనకు కావాల్సిన విశ్రాంతితో పాటు ఒక రకంగా మన శరీరాన్ని పునరుత్తేజపరుస్తుంది.
సాధారణంగా రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుకోవాలని నిపుణులు చెబుతారు. నిద్ర నాణ్యత గురించి తెలుసుకోవడానికి అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ కార్డియాలజీ సంయుక్తంగా ఒక వార్షిక సెషన్‌ను నిర్వహించారు. ఇందులో నిద్ర నాణ్యతను పరీక్షించడానికి 1,72,000 మందిపై నాలుగేళ్ల పాటు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో పరిశోధకులు 5 అంశాలను పరిశీలించారు. అవి..
- నిద్ర పోయే సమయం (వ్యవధి).
- వారానికి రెండు సార్లు మించకుండా నిద్రపోవడం కష్టంగా ఉండటం.
- వారానికి రెండు సార్లు మించకుండా నిద్రపోవడం సమస్యగా మారటం.
- నిద్ర పోవడానికి మందులు అవసరం లేదు.
- నిద్ర లేచిన తర్వాత విశ్రాంతి తీసుకున్నట్లు అనిపించడం.
ఈ అయిదు అంశాల్లో ఒక్కటైనా లేదా ఏమీ లేకపోయిన వారితో పోలిస్తే సానుకూలంగా ఉన్న పురుషులు సగటున 4.7 సంవత్సరాల పాటు ఎక్కువ జీవిత కాలాన్ని కలిగి ఉంటారని పరిశోధనలో తేలింది. అదే మహిళల విషయంలో సగటున 2 నుంచి 4 ఏళ్ల ఆయుష్షు పెరుగుతుందని వెల్లడైంది.
నిద్రను మెరుగుపర్చుకోవడానికి ఈ పనులు చేస్తే నాణ్యత, ఆయుష్షు రెండూ పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
- తగినంత సేపు నిద్ర పోవడం. రోజుకు 7 నుంచి 9 గంటలు పడుకోవాలి.
- బాగా నిద్రపోవడానికి రోజూ ఒకే సమయంలో నిద్రించడం, మేలుకోవడం చేయాలి. దీనికోసం పడుకునే ముందు కొన్ని పనులు చేయాలి. అవి.. కంప్యూటర్, సెల్ ఫోన్ స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్‌ను చూడటం ఆపేయాలి. అంటే పడుకునే ముందు వాటిని ఉపయోగించడం మానేయాలి. అంతేకాకుండా కెఫీన్ శాతం ఎక్కువగా ఉండే టీ, కాఫీ వంటి వాటిని మధ్యాహ్నం తర్వాత తాగకూడదు. ఉదయాన్నే ఎండలో కాసేపు నిలబడాలి. దీనివల్ల మన శరీరానికి విటమిన్-డి దొరుకుతుంది. ఇది మంచి నిద్రకు దోహదపడుతుంది.
- నిద్రపోకుండా అర్ధరాత్రి వరకు మిమ్మల్ని మేల్కొని ఉంచే అలవాట్లు, వ్యసనాలకు దూరంగా ఉండండి. వాటిని వదిలించుకోవడానికి మీ వంతు కృషి చేయండి. దీనికోసం గదిని చీకటిగా ఉంచుకోండి. బ్లాక్ కర్టెన్లు వాడండి. మీ ఎలక్ట్రానిక్ పరికరాలను సైలెంట్ మోడ్‌లో పెట్టుకోండి.
- నిద్రపోవడానికి మందులు వాడకండి. ఇలా చేస్తే అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
- రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపిస్తే గనుక వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం.
ఇక చివరగా మీ నిద్రవస్థలను అంచనా వేయడానికి, తెలుసుకోవడానికి స్లీప్ ట్రాకర్‌ను వాడండి.