'బ్రిటన్లో ఓ కరోనా వేరియంట్.. దక్షిణాఫ్రికాలో మరో వేరియంట్.. భారత్లో ఇంకొక వేరియంట్...' ఇలా కరోనా మహమ్మారి రూపాంతంరం చేందుతూ వస్తోంది. అదే కాకుండా.. సాధారణ కరోనా లక్షణాలు(Covid-19 symptoms) కూడా మారుతున్నట్టు ఇటీవలే తేలింది. ముఖ్యంగా ప్రమాదకరంగా మారుతున్న డెల్టా వేరియంట్ లక్షణాలు(Delta variant symptoms).. సాధారణ కరోనా లక్షణాల్లో ఎక్కువగా కనపడలేదని ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది.
మార్పులు ఎందుకు?
18నెలలుగా ప్రపంచం కరోనాతో విలవిలలాడుతోంది. అప్పటి నుంచి కరోనా రూపాంతరం చెందుతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే లక్షణాలు కూడా మారుతున్నాయి. కరోనా తొలి నాళ్లలో జ్వరం, జలుబు, తలనొప్పిని వైరస్ సాధారణ లక్షణాలుగా భావించారు. కానీ ఇప్పుడు వాటిల్లోనూ మార్పులు వచ్చాయి.
కారణాలేంటి?
సాధారణ లక్షణాల్లో మార్పులు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వైరస్ వ్యాప్తి వేగం, వ్యాప్తి చెందుతున్న తీరు మనుషుల అనారోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. వయస్సు, లింగం, వ్యాయామం, ఆరోగ్యం, ఒత్తిడి, తీసుకునే మందులు, చేసే భోజనం.. ఇలా మనుషుల్లో ఎన్నో తేడాలు ఉంటాయి. వృద్ధుల్లో, యుక్త వయస్సు వారిలో రోగనిరోధక శక్తి వేరువేరుగా ఉంటుంది. ఇవన్నీ లక్షణాలను ప్రభావితం చేసే అంశాలే.
మరి 'డెల్టా వేరియంట్' సాధారణ లక్షణాలేంటి?
బ్రిటన్లో డెల్టా వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దాని లక్షణాలను అధ్యయనం చేసేందుకు స్వీయ రిపోర్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సాధారణ కరోనా లక్షణాలు, డెల్టా వేరియంట్ లక్షణాల మధ్య వ్యత్యాసం ఉన్నట్టు దీని వల్ల తేలింది.
జలుబును కరోనా లక్షణాలుగా ఇప్పటివరకు పరిగణించారు. ముక్కు కారడం రోగుల్లో పెద్దగా కనపడలేదు. కానీ, డెల్టా వేరియంట్ బాధితుల్లో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తున్నట్లు అధ్యయనంలో లేతంది. అందువల్ల దానిని కూడా నిర్లక్షం చేయకూడదు. ముక్కు కారడంతో పాటు గొంతు నొప్పి కూడా ఉంటే దానిని సాధారణ జలుబుగా కాకుండా కొవిడ్ లక్షణాలుగా పరిగణించాల్సి ఉంది.
అయితే ఈ అధ్యయనం పూర్తిగా జరగలేదని, డేటాలో లోపాలు ఉన్నాయేమో పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాక్సిన్లతో లాభముందా?
కొత్తగా పుట్టుకొచ్చే వైరస్ వేరియంట్ల వల్ల వ్యాక్సిన్ల ప్రభావం తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలు డెల్టాపైనా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తేలింది.
ఇదీ చూడండి:- లంగ్స్పై డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభావమెంత?