మండే ఎండల్లో కాసేపు బయటకు వెళ్లినా మన శరీరానికి చాలా సమస్యలు వస్తుంటాయి. మరీ ముఖ్యంగా విపరీతమైన దాహం వేస్తుంటుంది. చెమటల కారణంగా శరీరం ఎక్కువ శాతం నీటిని కోల్పోతుంది. దీంతో శరీరంలో నీటి మోతాదు తగ్గి డీహైడ్రేషన్ అవుతుంది. ఇలా ఎండాకాలంలో వచ్చే డీహైడ్రేషన్ సమస్యతో పాటు స్కిన్ ట్యాన్ అవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చర్చిద్దాం.
వేసవి కాలంలో ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎండాకాలంలో ఉండే వేడి వాతావరణానికి తగ్గట్టుగా మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండాకాలంలో జీలకర్ర వాడకాన్ని పెంచడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. మజ్జిగలో జీలకర్ర పొడిని కలుపుకొని తాగితే జీర్ణ సమస్యలు తొలగిపోవడంతో పాటు శరీరం చల్లబడుతుంది.
ఎండాకాలంలో ఉష్ణోగ్రతలను మన శరీరం తట్టుకోవడం కోసం చెమటను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటుంది. దీని వల్ల శరీరంలో మనం వివిధ రూపాల్లో తీసుకునే నీటి శాతంలో అధిక భాగం చమటను ఉత్పత్తి చేయడానికి ఖర్చు అవుతుంది. ఫలితంగా డీహైడ్రేషన్ అవుతుంది. ఇలాంటి సమస్య నుంచి బయటపడటానికి మెంతులను నీటిలో నానబెట్టి, ఆ నీటిని తాగితే డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు.
అలాగే శరీరానికి నీరు ఎక్కువగా అందేలా జాగ్రత్తపడాలి. నేరుగా నీటిని తీసుకోవడమే కాకుండా.. వివిధ పండ్లు, కూరగాయలు, జ్యూసుల రూపంలో నీటిని శరీరానికి అందేలా చూసుకోవాలి. వేసవిలో పుచ్చకాయను తరుచూ తీసుకోవాలి. అలాగే బత్తాయి పండ్లు, కీరా, దోసలను తింటూ ఉండాలి. సొరకాయ, బీరకాయలాంటి కూరగాయలను ఎక్కువగా తింటే డీహైడ్రేషన్ నుంచి రక్షణ లభిస్తుంది.
ట్యాన్ కాకుండా ఉండాలంటే..?
ఎండాకాలంలో వచ్చే మరో సమస్య ట్యానింగ్. ఎండకు వెళితే చాలామంది చర్మం ట్యాన్ అవుతుంటుంది. అంటే చర్మం రంగు మారుతుంటుంది. దీనికి కారణం చర్మంలో ఉండే మెలనిన్ అనే పదార్థం. ఎండ తగిలినప్పుడు మెలనిన్ బ్రౌన్ కలర్ లోకి మారి సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఎక్కువగా ఎండలో తిరిగితే స్కిన్ ట్యాన్ అవుతుంటుంది. దీనిని నివారించాలంటే సన్ స్క్రీన్లను వాడటం, బయటకు వెళ్లేటప్పుడు కళ్లకు అద్దాలు, తలకు టోపీ వాడటం లాంటివి చేయాలి.
చుండ్రు సమస్యా?
చుండ్రు అనేది చాలా మందికి ఉండే సాధారణ సమస్య. ఈ సమస్య వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. భుజాల మీద చుండ్రు రాలడం, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యల వల్ల.. బయటకు వెళ్లినప్పుడు ఆత్మన్యూనతా భావం కలుగుతుంది. అయితే, చుండ్రు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా చుండ్రు వస్తుంటుంది. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.