ఒంటరితనం వల్ల మధ్యవయసు పురుషులలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్లాండ్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 1980లలో ఈ అధ్యయనాన్ని ప్రారంభించారు. 2570 మంది పురుషులు ఇందులో పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వీరి ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి ఈ అభిప్రాయానికి వచ్చారు పరిశోధకులు.
అధ్యయనంలో పాల్గొన్న 649(25 శాతం) మందికి క్యాన్సర్ సోకగా... 283(11 శాతం) మంది మరణించారు. ఈ పరిశోధన ప్రకారం ఒంటరితనం క్యాన్సర్ ముప్పును 10 శాతం మేర పెంచింది. సామాజిక- ఆర్థిక పరిస్థితి, జీవనవిధానం, నిద్ర నాణ్యత, ఒత్తిడి, బాడీ మాస్ ఇండెక్స్, గుండె వ్యాధులు వంటి కారణాలతో సంబంధం లేకుండానే ఒంటరితనం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని తేలింది. పెళ్లికానివారు, విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నవారిలో క్యాన్సర్ మరణాల రేటు కూడా అధికంగా ఉంటోంది.
పొగతాగడం, అధిక బరువు ఉండటం మన ఆరోగ్యానికి ఎంత హానికరమో ఒంటరిగా ఉండటం కూడా అంతేనని పరిశోధకుల్లో ఒకరైన సిరి లిసి క్రావ్ పేర్కొన్నారు. ఈ విషయంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి- క్యాన్సర్‌పై అపోహలు తొలగిద్దాం