కొబ్బరి నీళ్లలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, కాల్షియం, విటమిన్-సి లాంటి బోలెడు పోషకాలుంటాయి. అలాగే తక్కువ మొత్తంలో పిండిపదార్థాలు, పీచూ కూడా. ఈ నీళ్లను తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటాన్ని తగ్గించుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. తాజా కొబ్బరినీళ్లను తరచూ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
ఆరోగ్యానికి ఐదు లాభాలు..
* వ్యాయామం చేసిన తర్వాత తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తితోపాటు పోషకాలూ అందుతాయి. ఎండాకాలం అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం కోల్పోయిన నీటిని కొబ్బరి బొండం రూపంలో అందిస్తే డీహైడ్రేషన్ సమస్య ఉండదు.
* బరువు తగ్గాలనుకునేవారికి ఈ నీళ్లు చక్కటి ఎంపిక. ఈ నీటిలో చక్కెరలు, కెలొరీలు తక్కువ కాబట్టి తాగినా బరువు పెరగరు.
* ఈ నీటిని తాగడం వల్ల కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. ఇందులోని పీచు బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
* ఈ నీళ్లలోని పోషకాలు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రిస్తాయి. తరచూ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* వాంతులు, విరోచనాలు అవుతున్నప్పుడు కొబ్బరినీళ్లు తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది. ఈ నీటిని తరచూ తీసుకుంటే మూత్ర సంబంధ సమస్యలు తగ్గిపోతాయి.