ETV Bharat / sukhibhava

Blood Pressure: శరీరంలో రక్తం పోటెత్తుతోంది.. నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం అల్లకల్లోలం - Blood Pressure prevention in telugu

తెల్లారి లేస్తే మనకి లెక్కలతోనే పని. డబ్బు లెక్కలు తప్పామంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు తారుమారైపోతాయి. అదే మన శరీరం కొన్ని లెక్కలు తప్పిందంటే ఏకంగా ఆరోగ్యమే తలకిందులైపోతుంది. అందుకు నిదర్శనం- తాజాగా ప్రభుత్వం వెలువరించిన లెక్కలు.. తెలంగాణలో 56 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 32 శాతం మరణాలకు రక్తప్రసరణ వ్యవస్థలో లోపాలే కారణమట. మరో పక్క ప్రపంచవ్యాప్తంగానూ అధిక రక్తపోటు సమస్య లక్షలాది ప్రాణాలను హరిస్తోందని ఇటీవలే లాన్సెట్‌లో ప్రచురితమైన అధ్యయనమూ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో రక్తపోటు   లెక్కల కథేమిటో చూద్దాం!

Blood Pressure
Blood Pressure
author img

By

Published : Sep 19, 2021, 12:31 PM IST

సముద్రం పోటు మీద ఉందన్న మాట తీరప్రాంత ప్రజలకు సుపరిచితమే. అది వాతావరణం అల్లకల్లోలంగా ఉందన్న విషయాన్ని సూచిస్తుంది. తీరం వైపు వెళ్లడం ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరిస్తుంది. మన శరీరంలో రక్తమూ అప్పుడప్పుడూ పోటెత్తుతుంది. దాన్ని తెలుసుకుని వెంటనే చికిత్స పొందకపోతే అది ఆరోగ్యాన్ని అల్లకల్లోలం చేసి ప్రాణాపాయానికే దారితీయవచ్చు.

గత మూడు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా రక్తపోటుతో జీవిస్తున్నవారి సంఖ్య రెట్టింపు అయిందనీ, అందులో సగం మంది ఏ చికిత్సా తీసుకోవడం లేదనీ అంటోంది లాన్సెట్‌ పత్రికలో వెలువడిన ఓ అధ్యయనం. పేద దేశాల్లో ఈ పెరుగుదల ఎక్కువగా ఉందట. మన దేశంలోనూ స్త్రీలలో 28 నుంచి 29 శాతానికి పెరిగితే, పురుషుల్లో 32 నుంచి 38 శాతానికి పెరిగింది. అంటే ప్రతి ముగ్గురిలోనూ ఒకరికి కచ్చితంగా బీపీ సమస్య ఉన్నట్లే.

రక్తపోటు సమస్యను కనిపెట్టడం తేలికే అయినా, మందులతో నయమయ్యేదే అయినా - బీపీతో బాధపడుతున్నవారిలో 41 శాతం మహిళలూ 51 శాతం పురుషులూ అసలు తమకు సమస్య ఉందని తెలియకుండానే గడిపేస్తున్నారు. తెలిసినవారిలోనూ సగానికి పైగా చికిత్స తీసుకోవడం లేదట. మొత్తమ్మీద బాధితుల్లో ప్రతి నలుగురు మహిళల్లోనూ ఒకరు, ప్రతి ఐదుగురు పురుషుల్లోనూ ఒకరు మాత్రమే రక్తపోటుకు చికిత్స పొందుతున్నారని తేల్చింది ఈఅధ్యయనం. ఫలితంగా- ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవించే 85 లక్షల మరణాలకు అధిక రక్తపోటే కారణమవుతోంది. పక్షవాతం (బీపీ ఎక్కువవడం వల్ల మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరా ఆగిపోయి కణాలకు ఆక్సిజన్‌, పోషకాలూ అందకపోవడంతో తలెత్తే సమస్య), గుండెపోటు(గుండెకు ఆక్సిజన్‌ను తీసుకెళ్లే కరోనరీ ధమనులకు రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల), ఇతర రక్తనాళ సమస్యలు, కిడ్నీ సంబంధిత సమస్యలు... మరణాలకు దారితీస్తున్నాయి. బీపీని నియంత్రించగలిగితే పక్షవాతం కేసుల్లో 40 శాతం, గుండెపోటు 25 శాతం, గుండె వైఫల్యానికి సంబంధించిన కేసుల్లో 50 శాతం తగ్గిపోతాయట. హైబీపీ సమస్యని గుర్తించి, చికిత్స చేయడంలో నాణ్యమైన విధానాలను అమలు చేస్తే అన్ని దేశాల్లోనూ లక్షలాది మరణాలను నివారించవచ్చని వారు సూచిస్తున్నారు.

...

తెలియదు

కోపం వచ్చినా ఆందోళనగా ఉన్నా బీపీ పెరిగిపోతోంది... అంటుంటాం కానీ నిజానికి అసలు బీపీ నార్మల్‌గా ఉన్నదీ, పెరిగిందీ మనకి తెలిసే అవకాశమే లేదట. బీపీ పరికరంతో కొలిచి చూస్తేనే ఆ మార్పు తెలుస్తుంది. బీపీ పెరిగితే కోపం వస్తుందనీ, కళ్లూ ముఖం ఎర్రబడిపోతాయనీ..అనుకునేవన్నీ అపోహలే. బీపీ ఎక్కువగా ఉన్నా పైకి అసలు ఎలాంటి లక్షణాలూ కన్పించవు. చాలా సందర్భాల్లో అంతా మామూలుగానే ఉండవచ్చు. నిజానికి బీపీ పెరగడానికి కారణాలేంటన్నది కూడా కచ్చితంగా తెలియదు. జన్యుపరంగా, వంశపారంపర్యంగానూ అది రావచ్చు. కొద్దిమందిలో మాత్రం కిడ్నీ వ్యాధుల్లాంటివి బీపీ పెరగడానికీ కారణమవుతాయి. ఆ వ్యాధులకు చికిత్స పొందితే ఆటోమేటిగ్గా బీపీ కూడా నార్మల్‌ అవుతుంది. కానీ హైబీపీ బారిన పడేవాళ్లలో నూటికి 95 మందికి స్పష్టమైన కారణమేమీ కనిపించదు. అందుకే దీన్ని ‘సైలెంట్‌ కిల్లర్‌’ అంటున్నారు. సాధారణంగా వయసు, ఊబకాయం, శారీరక శ్రమ చేయకపోవడం, కొన్ని వ్యసనాలూ... హైబీపీ వచ్చే అవకాశాల్ని పెంచుతున్నాయంటారు వైద్యులు. జీవనశైలికి సంబంధించిన కొన్ని అలవాట్లు కూడా బీపీ పెరగడానికి దోహదం చేస్తున్నాయని అధ్యయనాల్లో తేలింది.

  • తరచుగా శీతల పానీయాలు తాగేవారిలో అందులోని తీపి వల్ల బీపీ 15 పాయింట్లు పెరుగుతుందట.
  • ఏళ్లతరబడి ఒంటరిగా నివసిస్తున్న కొందరిని పరీక్షించగా వారిలో క్రమంగా బీపీ పెరగడాన్ని గుర్తించారు.
  • స్థూలకాయం వల్ల నిద్ర పట్టని సమస్య(స్లీప్‌ అప్నియా) ఉన్నవారిలోనూ బీపీ, దాంతోపాటు గుండె సంబంధిత సమస్యలూ పెరుగుతున్నాయి.
  • తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నా, థైరాయిడ్‌ సమస్యలున్నా, కుంగుబాటు లాంటి కొన్ని రకాల సమస్యలకి మందులు వాడుతున్నా, హెర్బల్‌ సప్లిమెంట్లు తీసుకుంటున్నా... బీపీ పెరుగుతుంది.

అసలేమిటీ బీపీ..!

బీపీ గురించి తెలుసుకోవాలంటే ముందుగా గుండె పనిచేసే విధానం తెలియాలి. మన గుండెలో ప్రధానంగా నాలుగు(కుడివైపు రెండు, ఎడమవైపు రెండు) గదులుంటాయని చదువుకున్నాం కదా. శరీరంలోని అన్ని భాగాల నుంచి చెడు రక్తం(ఆక్సిజన్‌ లేని) రక్తనాళాల ద్వారా వచ్చి గుండెలోని కుడివైపు పై గదిలోకీ అక్కడినుంచి కింది గదిలోకీ వెళ్తుంది. ఆ రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి పంపడం కిందివైపు గది పని అన్నమాట. ఊపిరితిత్తుల్లో ప్రాణవాయువుని నింపుకుని శుభ్రమైన రక్తం తిరిగి గుండెలోని ఎడమవైపు పై గదిలోకీ అక్కడినుంచి కింది గదిలోకీ వస్తుంది. ఎడమవైపు కింద ఉన్న గది గుండె మొత్తానికీ బలమైన భాగమన్నమాట. ఎందుకంటే అక్కడినుంచే మొత్తం శరీరానికి ప్రాణవాయువుతో కూడిన రక్తం సరఫరా అవుతుంది. గుండె గోడల సంకోచవ్యాకోచాల ద్వారా రక్తం ఇలా ఒక గది నుంచి మరో గదిలోకీ అక్కడినుంచీ రక్తనాళాల్లోకీ ప్రవహిస్తుంది. పై గదుల్లోనుంచి రక్తం కింది గదుల్లోకి చేరడాన్ని ‘డయాస్టోల్‌’ అనీ, కింది గదుల్లోనుంచి రక్తనాళాల్లోకి వెళ్లడాన్ని ‘సిస్టోల్‌’ అనీ అంటారు. ఈ మొత్తం ప్రక్రియ సుమారుగా సెకనుకి ఒకసారి చొప్పున నిరంతరం జరుగుతుంటుంది. ఇలా గుండె నుంచి రక్తనాళాల్లోకి రక్తం ప్రవహించేటప్పుడు ఆ వేగానికి రక్తనాళాల గోడల మీద పడే ఒత్తిడినే రక్తపోటు లేదా బీపీ అంటాం. ఇందులో రెండు రకాలు ఉంటాయి. గుండె కొట్టుకుంటున్నప్పుడు రక్తనాళాల మీద పడే ఒత్తిడిని సిస్టోలిక్‌ అనీ, గుండె విశ్రాంతిగా (రెండు హార్ట్‌బీట్స్‌ మధ్య) ఉన్నప్పుడు రక్తనాళాల మీద పడే ఒత్తిడిని డయాస్టోలిక్‌ అనీ అంటారు. అందుకే బీపీని 120/80 అని రెండు సంఖ్యల్లో చూపిస్తారు. పైది సిస్టోలిక్‌ అయితే కిందిది డయాస్టోలిక్‌.

సాధారణం(120/80) కన్నా ఎక్కువ ఉంటే అది హైబీపీ అవుతుంది. వేర్వేరు కారణాలవల్ల బీపీ పెరుగుతుంది. శారీరక శ్రమ, వ్యాయామం లాంటివి చేసేటప్పుడూ, ఒత్తిడికి గురైనా, రాత్రిపూట సరిగా నిద్రపోకపోయినా, సిగరెట్లు కాల్చినప్పుడూ, కాఫీ టీలు తాగినప్పుడూ ఒక అరగంటపాటు రక్తపోటు పెరుగుతుంది. కాసేపటికి తగ్గిపోతుంది కాబట్టి దానివల్ల ఇబ్బంది లేదు.

...

ఇబ్బంది ఎప్పుడంటే..

క్రమంగా పెరిగి సాధారణం కన్నా ఎక్కువై కొన్ని రోజుల పాటు అలాగే ఉన్నా, ఉన్నట్టుండి ఒకేసారి ఎక్కువగా పెరిగినా... చికిత్స అవసరమవుతుంది. మామూలుగా పై సంఖ్యకి ఇరవై, కింది దానికి పదీ చేర్చుకుంటూ 140/90, 160/100, 180/110... ఇలా రక్తపోటు తీవ్రతను లెక్కించి దాన్ని బట్టి ప్రమాదాన్ని అంచనా వేస్తారు. బీపీ పెరిగే కొద్దీ సమస్యలు మొదలవుతాయి. బీపీ చూసేటప్పుడు కింది సంఖ్యకన్నా పై సంఖ్యకి ఎందుకు ప్రాధాన్యమిస్తారంటే దాని వల్ల ప్రమాదం ఎక్కువ కాబట్టి. అది ఒక్క యూనిట్‌ (20ఎంఎం)పెరిగితే కార్డియో వాస్క్యులర్‌ జబ్బుల ప్రమాదం 18 శాతం పెరుగుతుందనీ అదే కిందిది ఒక యూనిట్‌ పెరిగితే గుండెజబ్బులూ పక్షవాతం లాంటి సమస్యల ప్రమాదం 6 శాతం పెరుగుతుందనీ ఇటీవల జరిగిన అధ్యయనంలో తేలింది. పై సంఖ్య 200 మించితే ఏకంగా రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం ఉంది. ముక్కులో రక్తనాళాలు చిట్లితే ముక్కు నుంచి రక్తం వస్తుంది. వెంటనే చికిత్స తీసుకోవచ్చు. కానీ మెదడులో రక్తనాళాలు చిట్లితే పక్షవాతం వస్తుంది. కొందరికి బీపీ తక్కువయ్యే హైపోటెన్షన్‌ సమస్య ఉంటుంది. అది కాస్త తగ్గితే పర్వాలేదు కానీ 90/60 కన్నా తగ్గితే సమస్యలు వస్తాయి. విపరీతమైన నీరసం, కళ్లు తిరగడం, చూపు మసకబారడం, స్పృహతప్పడం లాంటి లక్షణాలు కన్పిస్తాయి. తరచుగా నీళ్లు తాగుతూ ఉండడం, సమతులాహారం తీసుకోవడం ద్వారా బీపీ తగ్గకుండా చూసుకోవచ్చు.

తెలిసేదెలా?

మనం అనుకున్నట్లు కోపం వచ్చినప్పుడు బీపీ కొద్దిగా పెరిగినా అది తాత్కాలికమే. ఒత్తిడి హార్మోన్లు విడుదలవడం వల్ల అలా పెరుగుతుంది. తర్వాత మామూలైపోతుంది. అదే హైబీపీ సమస్య ఉంటే మన ప్రవర్తనలో తేడా రావచ్చు. ఎందుకంటే రక్తపోటు పెరిగినప్పుడు సాధారణంగా- తలనొప్పి, చూపు మందగించడం, ఆయాసం, మూత్రంలో రక్తం పడడం, కళ్లు తిరుగుతున్నట్లు ఉండడం, ఛాతీనొప్పి, ముక్కు నుంచి రక్తం కారడం... లాంటి లక్షణాలు కన్పిస్తాయి. వాటి ప్రభావం వల్ల అసహనం పెరిగి అది కోపంగానో మరో రూపంలోనో బయటపడవచ్చు. అయితే సాధారణంగా కనిపించే బీపీ లక్షణాలకు వేరే కారణాలను ఆపాదించడం వల్ల చాలామంది బీపీ పెరుగుతోందని తెలుసుకోలేకపోతున్నారు. ఏ సమస్యతో ఆస్పత్రికి వెళ్లినా ముందుగా బీపీ పరీక్ష చేసేది అందుకే. వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కుటుంబంలో ఎవరికైనా బీపీ ఉన్నా, లక్షణాలు ఏవైనా కన్పించినా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. స్వయంగా పరీక్షించుకునే పరికరాలూ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే పరీక్షించుకోవచ్చు. ఏ పనీ చేయకుండా ఒక అరగంట పాటు ప్రశాంతంగా కూర్చుని అప్పుడు బీపీ పరీక్షించుకోవాలి. మూడు నిమిషాల వ్యవధిలో మూడుసార్లు పరీక్షించి వాటి సగటు లెక్కవేసి పుస్తకంలో రాసుకోవాలి. వారంపాటు పొద్దునా, సాయంత్రం ఒకే సమయంలో పరీక్షించుకుని ఆ లెక్కల్లో తేడాలుంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. రక్తపోటుని గమనించుకుంటూ ఉండడం ఎందుకు ముఖ్యం అంటే- మన శరీర ఆరోగ్యం అంతా దానిమీదే ఆధారపడివుంటుంది. రక్తపోటు ఒకసారి వచ్చిందంటే దీర్ఘకాలం వేధిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే తీవ్రపరిణామాలకు దారితీస్తుంది.

....

ప్రాణాంతకం

  1. హైబీపీని చాలాకాలంపాటు అశ్రద్ధ చేస్తే అన్నీ ప్రాణాంతక సమస్యలే ఎదురవుతాయి.
  2. గుండె సైజు పెరగడం, గుండెపోటు, గుండె వైఫల్యం... లాంటి సమస్యలు రావచ్చు.
  3. మెదడులోని రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడి రక్తనాళాలు చిట్లితే పక్షవాతం వస్తుంది. మాట పడిపోవడం, స్పృహతప్పడం, ఫిట్స్‌ రావడం వంటివి జరుగుతాయి. కొందరిలో మతిమరపు వస్తుంది.
  4. రక్తం ఎప్పుడూ అధిక ఒత్తిడితో లోపలికి రావడం వల్ల సున్నితమైన వడపోత యంత్రాంగం దెబ్బతిని మూత్రపిండాలు పాడైపోతాయి. దాంతోపాటే మిగతా వ్యవస్థలన్నీ ప్రభావితమవుతాయి.
  5. కాళ్లలోని రక్తనాళాలు దెబ్బతిని, కింది భాగానికి రక్తప్రవాహం తగ్గిపోతుంది. దాంతో నడిచేటప్పుడు కండరాల నొప్పి, కాళ్లలో నీరు చేరడం, రక్తనాళాలు ఉబ్బడం, పాదాల మీద పుండ్లు పడడం లాంటి సమస్యలు తలెత్తవచ్చు.
  6. రెటీనాలో ఉండే సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటే కంటిచూపు మందగిస్తుంది.
  7. అధిక రక్తపోటు స్త్రీపురుషులిరువురిలోనూ లైంగిక ఆసక్తిని తగ్గించి, సామర్థ్యం సన్నగిల్లేలా చేస్తుంది.
  8. రక్తపోటుని అదుపులో ఉంచుకోవటమే తప్ప పూర్తిగా నయమవ్వడం అంటూ ఉండదు. అందుకే ఒకసారి బీపీ పెరగడం మొదలుపెడితే వెంటనే దాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అవసరమైతే మందులు వాడాలి. ఇప్పటివరకూ సమస్య లేదూ అంటే- అదృష్టవంతులే! దాన్ని నిలబెట్టుకోడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలి. ఎందుకంటే... బీపీ అనేది వట్టి ఊతపదం కాదు, చాపకింద నీరులా తెలియకుండా ముంచేసే పెద్ద ముప్పు. దాని నుంచి ముందు జాగ్రత్తే... మనకు రక్ష!

ఈ లెక్కలు మరవొద్దు!

....

రక్తపోటుకి సంబంధించి ఈ లెక్కలు చాలా ముఖ్యం. సాధారణంగా ఉండాల్సిన రక్తపోటు- 120/80. అది కాస్త పెరిగి 140/90 లోపల ఉంటే ఎలివేటెడ్‌ లేదా ప్రి హైపర్‌టెన్షన్‌ దశ అంటారు. అక్కడివరకూ మందులు లేకుండా జీవనశైలి మార్పులతో నియంత్రించుకోవడం సాధ్యమే. 140 దాటితే మాత్రం మందులు తప్పనిసరి. 160/100 దాకా అధిక రక్తపోటు మొదటి దశగానూ, 180/110 వరకూ రెండో దశగానూ, 200/120 వరకు అత్యంత తీవ్రమైన మూడో దశగానూ పరిగణిస్తారు. కొందరికి బీపీ తక్కువగా కూడా ఉంటుంది. 120/80 కన్నా కాస్త తక్కువుంటే పర్వాలేదు కానీ 90/60కన్నా తగ్గితే దాన్ని లోబీపీ(హైపోటెన్షన్‌) అంటారు.

మన చేతిలోనే..!

ఉండాల్సిన దానికన్నా రక్తపోటు కాస్త ఎక్కువగా ఉంటే జీవనశైలి మార్పుల ద్వారా అదుపులోకి తెచ్చుకోవచ్చు. మరీ ఎక్కువగా ఉంటే మార్పులతో పాటు మందులతో చికిత్సా తప్పనిసరి.

ఉప్పు: రోజు మొత్తమ్మీద ఆరు గ్రాములు మించకూడదు. కూరల్లోనే కాదు, పచ్చళ్లూ వడియాలూ చిరుతిళ్లలాంటి వాటిల్లోనూ ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి తినాలి. ఉప్పు ఒంట్లో నీటిని ఎక్కువ నిలవుండేలా చేస్తుంది. దాంతో ఆయా కణజాలం నుంచి ద్రవాలు రక్తంలో కలిసి దాని పరిమాణాన్ని పెంచడంతో ధమనులపై రక్తపోటు పెరుగుతుంది. రెడీమేడ్‌ చిరుతిళ్లు కొన్నప్పుడు ఆ పాకెట్‌ మీద సోడియం ఎంత ఉందో చూడండి. అది ఒక్క గ్రాము అంటే రెండున్నర గ్రాముల ఉప్పుతో సమానం. అవే కాదు, సాస్‌లు, కెచప్‌లు, మసాలా పొడులు అన్నిట్లోనూ ఉప్పు ఉంటుంది. వాటి బదులు నిమ్మరసం, అల్లం లాంటివి కలుపుకోవడం మంచిది.

వ్యాయామం: నిత్యం నడక చాలా మంచిది. ఇతర వ్యాయామాలు కూడా తప్పనిసరిగా చేయాలి. వ్యాయామం వల్ల గుండె సమర్థంగా పనిచేస్తుంది. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండి రక్తపోటు సాధారణంగా ఉండేందుకు తోడ్పడతాయి. హైబీపీ ఉన్నవాళ్లు నిపుణుల సలహాతో గుండెకూ, రక్తనాళాలకూ మేలు చేసే ఏరోబిక్‌ తరహా వ్యాయామాలను ఎంచుకుని చేయాలి.

పండ్లూ కూరగాయలూ: రోజూ ఆహారంలో కనీసం 400 గ్రాముల పండ్లూ కూరగాయలూ తీసుకోవాలి. బంగాళాదుంప, చిలగడదుంప లాంటివాటిని ఈ లెక్కలో కలపకూడదు. రక్తంలో ద్రవాలు సరైన పాళ్లలో ఉండాలంటే కిడ్నీలకు సోడియం, పొటాషియం తగుపాళ్లలో అందాలి. అవి సహజంగా అందేది పండ్లూ కూరగాయలతోనే. అందుకని వాటిని ఎక్కువగా తీసుకుంటూ నూనె పదార్థాల్నీ ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌నీ తగ్గించాలి.

బరువు: బరువు పెరగకుండా చూసుకోవాలి. ఊబకాయుల్లో శరీరానికంతా రక్తాన్ని పంపించడానికి గుండె బలంగా పని చేయాల్సివస్తుంది. దాంతో దానిమీద భారం పడి బీపీ కూడా పెరుగుతుంది. అందుకే బరువుని నియంత్రించుకోవాలి. ఏ పనిచేసేవారైనా గంటకోసారి లేచి నాలుగడుగులు వేయాలి. దగ్గరి దూరాలకు నడిచివెళ్లడం, రోజుకు ఒకసారైనా లిఫ్ట్‌ బదులు మెట్లెక్కడం చేయాలి. అలా చేయటం వల్ల అన్ని భాగాలకూ రక్తసరఫరా సాధారణంగా ఉంటుంది.

తగ్గించాలి: కాఫీ, టీలలోని కెఫీన్‌ రక్తనాళాలకు అవరోధంగా మారుతుంది కాబట్టి వాటిని రోజుకు రెండు కప్పులకు మించనివ్వకూడదు. అలాగే మద్యం బరువుని పెంచుతుంది, శరీరంలో పొటాషియం, మెగ్నీషియం స్థాయుల్ని తగ్గిస్తుంది, దాంతో ఒత్తిడి పెరిగి రక్తపోటు ఎక్కువవుతుంది. పొగ తాగే అలవాటేమో రక్తనాళాల గోడల్ని మందంగా మారుస్తుంది. ఫలితంగా నాళాలు ఇరుకై రక్తపోటు పెరుగుతుంది.

నీరు: తరచుగా నీరు తాగుతుండాలి. ఎక్కువసేపు దాహంతో ఉన్నప్పుడు శరీరం ఒత్తిడి హార్మోన్లను విడుదల చేయడం వల్ల రక్తపోటు పెరుగుతోందని 2015లో జరిగిన ఒక అధ్యయనంలో తేలింది.

ధ్యానం: నిరంతరం మానసిక ఒత్తిడీ ఆందోళనలతో గడిపేవారిలో తరచుగా ఒత్తిడి హార్మోన్లు విడుదలై రక్తపోటు మీద ప్రభావం చూపుతాయి. వాటిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండడానికి ధ్యానం తోడ్పడుతుంది.

మధుమేహం: మధుమేహం ఉన్నవారికి అధిక రక్తపోటు కూడా తోడైతే అగ్నికి ఆజ్యం తోడైనట్టే. షుగర్‌ పేషంట్లకు రక్తపోటు ముప్పు రెండు రెట్లు ఎక్కువ. అందుకని వారు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.

మాత్రలు: వైద్యులు మాత్రలు సూచిస్తే వాటిని వేళ తప్పకుండా వాడాలి. కొన్నాళ్లు వాడి మానకూడదు. ఇతర అనారోగ్యాలకు మాత్రలు ఏవైనా వాడాల్సి వస్తే ఆ విషయం వైద్యులకు తెలియజేయాలి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.