పిల్లల స్థాయినీ, పరిణతినీ దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించాలి. ముందుగా కొంత సమయాన్ని కేటాయించుకుని మరో మూడు, నాలుగు నెలల్లో ప్రారంభమవబోతున్న పరీక్షలకు ఇప్పటి నుంచే తగిన ప్రణాళిక సిద్ధం చేయండి. కచ్చితమైన సమయం, లక్ష్యాలను వాస్తవిక అంచనాల ద్వారా ఏర్పాటు చేయడం వల్ల వారు పూర్తిగా ఆయా అంశాలపై దృష్టిపెట్టేందుకు అవకాశం కలుగుతుంది. వారు చదువుల్లో వెనకబడకుండా ఉండగలుగుతారు.
ఇంటిపనీ, పిల్లల చదువుల కోసం వెచ్చించాల్సిన సమయాన్ని చక్కగా విభజించుకోండి. మీరు సాయంత్రం ఇంటికొచ్చాక వంటపనో, మరొకటో చేసుకుంటున్నప్పుడు పిల్లలు సులువుగా పూర్తిచేసే హోమ్‌వర్క్‌ని చేసుకోమనాలి. తరవాత మీరు దగ్గరుండి చదివించవచ్చు. వారికి విరామం ఇచ్చిన సమయంలో మిగిలిన ఇంటిపనినీ పూర్తి చేసుకోవడం వల్ల కొంతవరకూ సమన్వయాన్ని సాధించవచ్చు.
ప్రతిరోజూ కాసేపైనా పిల్లలతో గడిపేలా తీరిక చేసుకోవాలి. దీనితో పాటూ వారిని ముస్తాబు చేస్తున్నప్పుడూ, అంతా కలిసి భోంచేస్తున్నప్పుడూ కబుర్లు చెబుతుండాలి. వాళ్లకెదురయ్యే ఇబ్బందులూ, చేరుకున్న లక్ష్యం తాలూకు వివరాలను అడిగి తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇలా అడగడం వల్ల వాళ్లకి ఆయా అంశాలపై శ్రద్ధ పెరుగుతుంది. ప్రతిదీ మీతో చెప్పడం అలవాటవుతుంది. పిల్లలు తమ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు ఆశ్చర్యపరిచే బహుమతులను ఇవ్వడం ద్వారా వారిలో ఉత్సాహాన్ని నింపొచ్చు. మాటల్లో కాకుండా చేతల్లో వాళ్లు ఏ స్థాయిలో ఉన్నారని తెలుసుకోవడానికి అప్పుడప్పుడూ పాఠ్యాంశాలకి సంబంధించి చిన్న చిన్న పరీక్షలు పెట్టాలి. తగిన సూచనలు చేయాలి. దీనివల్ల పరీక్షల సమయానికి వారు సిద్ధంగా ఉండగలుగుతారు.
ఇదీ చూడండి: నిద్ర తక్కువైనా, ఎక్కువైనా ముప్పే!