Mother Worries about Daughter Drinking Problem : మారుతోన్న జీవనశైలిలో సోషలైజేషన్ పేరుతో అమ్మాయిలు పబ్‌లకు వెళ్లడం, మద్యం సేవించడం వంటివి జరుగుతున్నాయి. తను సొంతంగా సంపాదించడం, బాధ్యతలు లేకపోవడం వంటివి కూడా దీనికి కారణం కావచ్చు. ఈ రకమైన పద్ధతి మంచిదా కాదా అన్నది పక్కన పెడితే- యువత విషయంలో ఇది కొన్ని అవాంఛనీయ ధోరణులకు దారితీస్తోందని చాలా సందర్భాల్లో రుజువవుతోంది.
అయితే నేటి తరం యువతీ యువకుల్లో చాలామందికి పెద్దవాళ్లు చెప్పే నీతి వాక్యాలు రుచించడం లేదు. కాబట్టి ఈ సమస్యను ఇతర మార్గాల్లో పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ప్రత్యేకించి యుక్త వయసు వచ్చిన పిల్లలతో ఎంత స్నేహంగా ఉంటే అంత మంచిది. మీరు కూడా ఈ మార్గాన్ని అనుసరించండి. మీ అమ్మాయితో ఒక స్నేహితురాలిగా మెలగండి.
ఇలా చేయడం వల్ల తన కష్టసుఖాలను మీతో పంచుకోవడంతో పాటు మీ మాటకు విలువిచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికీ మీ మాట వినకపోతే తన సన్నిహితులతో కానీ, దగ్గరి బంధువులతో కానీ చెప్పించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో- పబ్‌లకు వెళ్లడం, పార్టీల పేరుతో తరచుగా మద్యం సేవించడం.. మొదలైన వాటివల్ల కలిగే లాభనష్టాలను ఒక పేపర్ పైన రాయమనండి.
సాధారణంగా ఇలాంటి అంశాల్లో నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ విషయం తన మనసుకు ఎప్పుడైతే స్పష్టంగా ఎక్కుతుందో అప్పుడు తను ఆ అలవాట్లకు దూరం జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే- సాధారణంగా ఒక అలవాటును మాన్పించడానికి మరొక అలవాటును పరిచయం చేస్తే సత్ఫలితాలు పొందచ్చు.
ఈ క్రమంలో మీ అమ్మాయిని కూడా తనకు నచ్చిన వ్యాపకం మీద దృష్టి కేంద్రీకరించేలా చేయండి. ఈ ప్రయత్నంలో తనకు కావాల్సిన సహాయం అందిస్తూ ప్రోత్సహించండి. క్రమంగా దానిపై మక్కువ పెంచుకుని చెడు అలవాట్లకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. అప్పటికీ ఆశించిన ఫలితం రాకపోతే మంచి సైకాలజిస్టును సంప్రదించండి. వారు ఆ అమ్మాయితో మాట్లాడి సరైన కౌన్సెలింగ్ అందించే అవకాశం ఉంటుంది.
ఇవీ చదవండి: