Metabolism Boosting Foods : జీవక్రియ సక్రమంగా జరిగితేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు సమస్య లేకుండా రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అందుకే వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు జీవక్రియపై శ్రద్ధ వహించడం తప్పనిసరి. శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చడాన్నే జీవక్రియ అంటారు. ఆహారాన్ని జీర్ణం చేయడానికి, రక్త ప్రసరణ కోసం, శ్వాస, హార్మోన్ల సమతుల్యత వంటి పనుల కోసం, శరీరానికి ఆహారం నుంచి లభించే శక్తి అవసరం. ఈ శక్తి జీవక్రియ నుంచి వస్తుంది. అందుకే శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగాలంటే పలు ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
గుడ్లు
గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని శాస్త్రీయంగా పలు అధ్యయనాల్లో తేలింది. గుడ్డులో ఉండే విటమిన్ బి2.. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడేందుకు తోడ్పడుతుంది. గుడ్డులో సుమారు ఆరు గ్రాముల వరకు ప్రోటీన్లు ఉంటాయి. వీటిలో క్యాలరీలు తక్కువ.. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గుడ్లు జీవక్రియను మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.
మిర్చి
మిర్చి మన శరీరానికి కావలసిన ఉష్ణాన్ని పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శరీరంలో ఉన్న కొవ్వును కరిగించేందుకు ఈ ఉష్ణం తోడ్పడుతుంది. మిరపలో ఉండే ఎ, సి విటమిన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నవారికి బరువు తగ్గించడంలో ఎంతగానో మిర్చి ఉపయోగపడుతుంది. మిర్చిలో క్యాన్సర్‌ను నిరోధించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గేందుకు దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. ఇన్సులిన్‌ను పెంచడంలో ఉపయోగపడుతుంది.
నెయ్యి
ఆవు నెయ్యి మన మెటబాలిజంను పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నెయ్యిలో కాంజుగేటెడ్ లినోలెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మన శరీరంలోని ఫ్యాట్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. నెయ్యిలో ఎ, డి, ఇ, కె వంటి కొవ్వును కరిగించే విటమిన్లు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే మీరు తీసుకునే ఆహారంలో నెయ్యి ఉంటే మంచిది.
పుల్లని పండ్లు
నిమ్మ, కివీ పండ్లు, పైనాఫిల్ లాంటి పండ్లు మన జీవక్రియ సక్రమంగా జరిగేందుకు చాలా ఉపయోగపడతాయి. పుల్లని పండ్లలో వ్యాధినిరోధకశక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మన ఆహారంలో పుల్లని పండ్లను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలని అంటున్నారు నిపుణులు.
ఈ పండ్లను కలిపి తింటే యమ డేంజర్.. అస్సలు తినకూడని కాంబినేషన్లు ఇవే!
Eggs For Weight Loss : వేగంగా బరువు తగ్గాలా?.. కోడి గుడ్లను ఇలా తిని చూడండి!