రోజురోజుకు కొవిడ్ రోగుల సంఖ్యతోపాటు ఆక్సిజన్ కొరత కూడా పెరుగుతోంది. అన్ని ఆస్పత్రుల్లోనూ ప్రాణవాయువు నిల్వలు తగ్గిపోయి రోగులు మృత్యువాత పడుతున్నారు. రక్తంలో ఆమ్లజని శాతం 92 కన్నా తగ్గితే ఊపిరందక రోగికి ఆక్సిజన్‌ను కృత్రిమంగా అందించాల్సి ఉంటుంది.
'ఆరోగ్య' ఆమ్లజని
వాతావరణంలోని గాలిలో చాలా వాయువులు ఉంటాయి. అందులో ఉన్న దుమ్ము, తేమ మొదలైనవి వడగట్టి మన శ్వాస వ్యవస్థ ఊపిరితిత్తుల్లోకి స్వచ్ఛమైన గాలిని చేర్చుతుంది. దానిలో నుంచి ఆమ్లజనిని మాత్రమే మన శరీరం గ్రహిస్తుంది. శ్వాసకోస వ్యాధులతో బాధ పడుతున్న వారిలో సరిపడా ఆమ్లజని రక్తంలో కలవలేదు. ఇటువంటి సందర్భంలోనే ఆమ్లజనిని అదనంగా అందించాల్సి ఉంటుంది. ఈ విధంగా సిలెండర్ ద్వారా అందచేసే గాలిలో 98% ఆమ్లజని ఉంటుంది. ఇందులో ఎటువంటి మలినాలు, ఇతర వాయువులు, తేమ ఉండవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటుంవంటి ఆమ్లజనిని కూడా అత్యవసరమైన ఔషధాల జాబితాలోకి చేర్చింది.
ఆరోగ్య ఆమ్లజనిని ఎలా తయారు చేస్తారు?
ఆమ్లజని వాతావరణమంతా వ్యాపించి ఉంటుంది. బయటి గాలిలో 78% నత్రజని, 21% ఆమ్లజని, మిగతా 1% ఉదజని (హైడ్రోజన్), నియాన్, హీలియమ్, కార్బన్ డై ఆక్సైడ్ మొదలైనవి ఉంటాయి. నీటిలోనూ కొంత శాతం ఆమ్లజని కరిగి ఉంటుంది. ఆస్పత్రులకు అవసరమైన ఆమ్లజనిని కర్మాగారంలో తయారుచేస్తారు. మొదటిగా వాతావరణంలోని గాలిని సంగ్రహించి అందులోని మలినాలను జల్లెడ (మైక్రో ఫిల్టర్) ద్వారా తొలగిస్తారు. ఆ తరువాత భాష్పీకరణ పద్ధతి ద్వారా ఆమ్లజనిని ద్రవ రూపంలో వేరుచేస్తారు. ద్రవ రూపంలో ఉన్న ఆమ్లజనిని భారీ కంటైనర్లలో నిల్వ చేసి రవాణా చేస్తారు. ఇందుకోసం ఉష్ణోగ్రతను -1830 వద్ద ఉంచాలి. ఆ తరువాత చిన్న సిలెండర్లలోకి నింపుతారు.
వ్యాక్యూమ్ స్వింగ్ ఎడ్జార్ప్షన్ అనే పద్దతి ద్వారా కూడా ఆమ్లజనిని తయారుచేస్తారు. అలాగే ఎలక్ట్రోలైసిస్ అనే పద్దతిని వాడుతున్నారు. ఇందులో నీటిలోకి విద్యత్‌ను ప్రసరింపచేసి ఆమ్లజనిని వేరు చేస్తారు. నీటి అణువులలో ఉదజని, ఆమ్లజని వేరుపడగా ఈ రెండు వాయువులను వేరువేరుగా సంగ్రహిస్తారు.
ఆమ్లజని లోటుతో ఆరోగ్య సమస్యలు:
ఏప్రిల్ మాసంలో కొవిడ్ రోగుల సంఖ్య అనూహ్యంగా పెరిగి 4795 మెట్రిక్ టన్నుల ఆమ్లజని అవసరమైంది. ఒక్కసారిగా పెరిగిన డిమాండ్‌ను తట్టుకోవటం కష్టమైంది. పనిచేస్తున్న కర్మగారాల ఉత్పత్తిని పెంచటమే కాక కొత్త ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో నెలకొల్పుతున్నారు. గతంలో మూసివేసిన ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలనూ తెరుస్తున్నారు.
త్వరలోనే అవసరమైనంత ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలమని వైద్యులు, ఇతర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఇతర దేశాల వారూ భారత్‌కు సహాయం చేస్తున్నారు. అధిక ధరలకు ఆక్సిజన్ సిలెండర్లను సరఫరా చేసే దుర్విధానం త్వరలోనే సమసిపోతుంది.