Is Watching Porn Bad : ఈ ఆధునిక కాలంలో చాలా మంది యువతీ, యువకులు పోర్నోగ్రఫీ వలలో చిక్కుకుంటున్నారు. బ్లూ ఫిల్మ్స్ ఎక్కువగా చూస్తూ వాటికి బానిసలుగా మారుతున్నారు. వాటిని చూడనిదే రోజు గడవని స్థితికి చేరుకుంటున్నారు. మన దేశంలోనూ ఈ పోర్న్ వీడియోలు చూసే వారి సంఖ్య అధికంగానే ఉంది. అయితే అతిగా ఈ పోర్న్ వీడియోలు చూడటం వల్ల అనేక మానసిక, ఆరోగ్య దుష్ప్రభావాలు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వ్యసనంగా మారుతోంది!
యువతకు పోర్న్ వీడియోలు చూడటం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. అరచేతిలో ఫోన్ ఉండటం, ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉండటంతో ఎప్పుడు పడితే అప్పుడు ఈ సెక్స్ వీడియోలు చూస్తున్నారు. కొంతమంది పరిమిత సమయాన్ని మాత్రమే వీటికి కేటాయిస్తే- మరికొందరు రోజులో అధిక శాతం వీటినే చూస్తూ బానిసలుగా మారిపోతున్నారు. ఫలితంగా రకరకాలుగా ఇబ్బందుల పాలవుతున్నారు.
"పోర్న్ వీడియోలు చూడటం వల్ల చెడిపోయేవారి శాతం తక్కువ. ప్రవర్తన విషయంలో భారీ మార్పులు వస్తే అలాంటి వారిని చెడిపోయినట్లుగా పరిగణించవచ్చు. ఆ వ్యక్తి ఇతరులతో అసభ్యంగా ప్రవర్తిస్తే, మానభంగానికి పాల్పడటం లాంటివి చూస్తే ప్రమాదకరం. అంతేకానీ ఒంటరిగా వాటిని చూడటం తప్పేమీ కాదు. ఇతర వీడియోలలాగే వీటిని కూడా వీక్షిస్తారు. సాధారణంగా చూసే వారికి ఏం కాదు కానీ ఎవరైతే వీటికి అలవాటు పడతారో, వారి జీవితం నాశనమవుతుంది. వారి ప్రవర్తనలో మార్పు రావడమే కాకుండా మానవ సంబంధాలు సైతం దెబ్బతింటాయి."
- డాక్టర్. సమరం, ప్రముఖ సెక్సాలజిస్టు
థ్రిల్స్ కోసం
కొంత మంది వీటిని బానిసైపోతారు. కేవలం వాటిని చూస్తేనే వారికి థ్రిల్ కలుగుతుంది. అవి చూస్తేనే నిద్రపడుతుంది. ఇది ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం వారి జీవితం నాశనమయ్యే అవకాశముంది. ఎందుకంటే వారికి ఇతర పనులపై ధ్యాస ఉండదు. కాబట్టి పనులు, ఉద్యోగం లాంటివి మానేస్తారు. అందుకే ఇలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి. వైద్యులను సంప్రదించి వెంటనే ఈ ఊబిలోంచి బయటపడేందుకు కృషి చేయాలి.
సంసారంలో గొడవలు తప్పవు
పోర్న్ వీడియోలు చూసి ఆ నటుల్లాగే హావభావాలు ఇవ్వాలని పురుషులు అనుకుంటారు. తమ భాగస్వామి సైతం అలాగే చేయాలని కోరుకుంటారు. కానీ నిజ జీవితంలో అది జరగదు. ఎందుకంటే ఆ వీడియోల్లో ఉన్నదంతా నటనే. తమ భాగస్వామి నుంచి అలాంటివి రాకపోయే సరికి గొడవలు పెట్టుకోవడం ప్రారంభిస్తారు. ఫలితంగా దంపతుల మధ్య గొడవలు జరిగి, సంసార జీవితం దెబ్బతింటుంది. నిజాన్ని అంగీకరించి భార్యతో మంచిగా ప్రవర్తించాలి. పోర్న్ వీడియోలు చూడటం మానేసి, వాటి నుంచి దృష్టి మరల్చే పనులు చేసుకోవాలి.
వీర్యం కోల్పోతే బలహీనమవుతారా? అపోహలు, వాస్తవాలు!
సెక్స్ తర్వాత అలాగే పడుకుంటున్నారా ? కచ్చితంగా చేయాల్సినవి ఇవే!