ఆరోగ్యంగా ఉండటం కోసం సరైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. అదే ఆరోగ్యం కోసం ఉపవాసం చేయడం కూడా మంచిదే. చాలా మతాల ఆచారాల్లోనూ ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అనేక మందిలో ఉపవాసం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయి? ఉపవాసం ఎవరు చేయవచ్చు? ఉపవాసం ఫలితాలు ఎలా ఉంటాయనే ప్రశ్నలు తలెత్తుతాయి. వీటి గురించి తెలుసుకుందాం.
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారాన్ని, మోతాదులో తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు శరీరానికి కావాల్సిన పోషకాలు అంది, ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అయితే ఆరోగ్యం కోసం, భక్తి పేరుతో లేదంటే బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఉపవాసం చేస్తుంటారు. కొంతమంది ఉపవాసం చేసేటప్పుడు ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు, కానీ కొంతమంది మాత్రం టీ లేదంటే కాఫీ, పాలు లాంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. ఉపవాసం వల్ల శరీరానికి మేలు కలుగుతుందనే వాదన ముందు నుంచి ఉండగా.. చాలామంది రోజుల పాటు మరికొందరు.. గంటల పాటు ఉపవాసం చేస్తుంటారు. సాధారణంగా 12 గంటల నుంచి 24గంటల వరకు ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు. అయితే ఉపవాసం చేయడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గడం, ఇన్సులిన్ పనితీరు మెరుగుపడటం, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయని పరిశోధనల్లో తేలింది. కొంతమంది ఉపవాసాన్ని డైటింగ్‌తో పోలుస్తుంటారు. కానీ ఈ రెండింటికి తేడా ఉంది. కొంత సమయం వరకు పూర్తిగా ఆహారం తీసుకోకపోవడం ఉపవాసం. తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం, క్యాలరీలను తగ్గించుకోవడం డైటింగ్ అవుతుంది. ఉపవాసం, డైటింగ్ వల్ల శరీరానికి మేలు కలుగుతుంది.
"ఉపవాసం చేయడం మంచిదే, అయితే వరుసగా ఎక్కువ రోజులు లేదంటే ఎక్కువ గంటలు చేయడం శరీరానికి ఇబ్బందికరంగా మారవచ్చు. తీసుకునే ఆహారాన్ని తగ్గించి, కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకుంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 14గంటలు, 16గంటలు, 20 గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉండే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాంటివి చేయకపోవడం మంచిది. ఇలా చేయడం వల్ల శరీరానికి అందాల్సిన గ్లూకోస్ స్థాయిలు అంతకంతకు తగ్గిపోతాయి. వారానికి ఒకసారి లేదంటే రెండుసార్లు చేయడం మంచిది. దీని వల్ల శరీరంలో ఉన్న అధిక కొవ్వు తగ్గడమే కాకుండా మెటబాలిజం కూడా సరిగ్గా ఉంటుంది. బరువు తగ్గడం కోసం ఉపవాసాలు చేయడం మంచిది కాదు. 10-16గంటల పాటు ఏమీ తినకుండా ఉండి, కొద్ది గంటలు మాత్రమే ఆహారాన్ని తీసుకోవడానిన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఇది కొంతమందికి ఉపయోగం కాదు. హైపర్ టెన్షన్, థైరాయిడ్, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సరికాదు."
-శ్రావ్య, డైటీషియన్
ఉపవాసం వల్ల ఎక్కువ లాభం కలగాలంటే పండ్లు, ముడిధాన్యాలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఉపవాసం తర్వాత సాధ్యమైనంత వరకు పోషకాలు ఉన్న నాణ్యమైన ఆహారం తీసుకోవడం మంచిది. ఉపవాసం తర్వాత సాధారణంగా తీసుకునే ఆహారాన్ని తీసుకుంటే ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుందని, ఆరోగ్య లాభాలు ఉన్నాయని, ఆకలి నియంతరణలో ఉండి, బరువు తగ్గే అవకాశం పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది.
రాత్రి 8గంటలకు ఆహారం తీసుకొని, ఉదయం 8గంటలకు టిఫిన్ చేయడం వల్ల 12గంటల పాటు ఉపవాసం చేసినట్లు అవుతుంది. వారంలో రెండు రోజులు తక్కువ తిని, మిగిలిన 5 రోజులు సాధారణంగా తినడం కూడా ఒకరకమైన ఉపవాసం కిందకు వస్తుంది. వ్యక్తుల వయసు, బరువు, ఆరోగ్య పరిస్థితి, శారీరక శ్రమ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఉపవాసం చేయాలి.
ఇవీ చదవండి : మొలకెత్తిన బంగాళదుంపలు తింటున్నారా..? అయితే జాగ్రత్త!
ఎండాకాలంలో స్కిన్ ట్యాన్ అవకుండా ఏం చేయాలి? డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవడమెలా?