oral cancer test: దేశంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న క్యాన్సర్లలో నోటి క్యాన్సర్ మూడో స్థానంలో ఉంది. తొలినాళ్లలో దీనిని గుర్తించటం ద్వారా మహమ్మారి నుంచి బాధితులను కాపాడుకునే అవకాశం ఉన్నా... సరైన అవగాహన, వైద్య పరీక్షలు అందుబాటులో లేక అనేక మందిలో నోటి క్యాన్సర్ చివరిదశలో వెలుగు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నోటి క్యాన్సర్‌ని ముందస్తుగా గుర్తించాల్సిన అవసరం ఉందని భావించిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్... ఐఐఐటీ హైదరాబాద్, బయోకాన్ ఫౌండేషన్‌తో కలిసి మొబైల్ యాప్ రూపకల్పనకు నడుంబిగించింది.
ఇందులో భాగంగా నోటిలోని కణతులను సెల్ఫోన్లో ఫోటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే.. అది నేరుగా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ డేటాబేస్‌కి చేరుతుంది. ఆ చిత్రాలను పరిశీలించి ఇది క్యాన్సర్‌గా మారే అవకాశం ఉందా లేదా అన్న విషయాలను విశ్లేషించేలా ఈ యాప్‌ని రూపకల్పన చేయనున్నారు. ఈ మేరకు అవసరమైన డేటాను గతేడాది నవంబర్ నుంచి సేకరిస్తున్నట్టు ఐఐఐటీ హైదరాబాద్ ప్రకటించింది. సరైన పద్ధతిలో నోటిలోని కణతులను ఫోటో తీసేలా ఫ్రంట్ లైన్ వర్కర్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతున్నట్లు తెలిపింది. అన్ని దశలలో ఈయాప్... మంచి ఫలితాలనిస్తే భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్‌ని తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించేందుకు మార్గం సుగమమవుతుందని ఐఐఐటీ హైదరాబాద్ పేర్కొంది.
ఇదీ చూడండి: High Court about Corona : పిల్లల కోసం వైద్య సదుపాయాలు మరింత పెంచాలి: హైకోర్టు