ప్ర: హలో మేడమ్.. నాకు ఇద్దరు పిల్లలు. బాబుకు నాలుగున్నరేళ్లు. పాపకు రెండున్నరేళ్లు. పాపకు పాలిచ్చినన్ని రోజులు నా వక్షోజాలు మంచి ఆకృతిలో, బిగుతుగా ఉండేవి. కానీ పాలు మానేసిన తర్వాత వదులుగా, తేలికగా మారిపోయాయి. అలాగే నేను బరువు కూడా బాగా తగ్గిపోయాను. పాప పుట్టినప్పుడు 53 కిలోలుండేదాన్ని.. ఇప్పుడు 40 కిలోలున్నాను. బరువు తగ్గడానికి, వక్షోజాల పరిమాణం తగ్గడానికి ఏమైనా సంబంధముందా? అవి తిరిగి బిగుతుగా, మంచి ఆకృతిలో మారాలంటే ఏం చేయాలో తెలుపగలరు. - ఓ సోదరి
జ: మీరు రాసిన విషయం సర్వసాధారణంగా జరిగేదే! ఎందుకంటే పాలిచ్చేటప్పుడు పాల గ్రంథుల పరిమాణం పెరుగుతుంది. పాలతో నిండి ఉన్నప్పుడు వక్షోజాలు బిగుతుగా, పెద్దగా ఉంటాయి. పాలివ్వడం ఆపేసిన తర్వాత పాల గ్రంథుల పరిమాణం తగ్గుతుంది.. దానికి తోడు మీరు 13 కిలోలు తగ్గేటప్పటికి వక్షోజాల్లో ఉండే 50 శాతం కొవ్వు పదార్థం కూడా తగ్గిపోయి ఒకేసారి మీకు వక్షోజాలు వదులైపోయినట్లు, చిన్నవైపోయినట్లుగా అనిపిస్తోంది. అయితే మీరు చేయగలిగింది.. బరువు తిరిగి పెరిగి 53 కిలోలకు రావడం. తద్వారా రొమ్ముల్లో కొవ్వు పెరిగి వక్షోజాల పరిమాణం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండోది - వక్షోజాల కింద ఉండే కండరాలు (Pectoral Muscles) దృఢం కావడానికి వ్యాయామాలు చేయడం. ఏదేమైనా గర్భవతి కాకముందు ఉన్నట్లుగా వక్షోజాల ఆకృతి రావడం కష్టం. ఒకవేళ ఇవేవీ పనిచేయకపోతే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మామో ప్లాస్టీ చేయించుకోవడం ఒక్కటే మార్గం.
-వై.సవితాదేవి, గైనకాలజిస్ట్
ఇదీ చూడండి: ఎలాంటి చెడు అలవాట్లు లేవు.. నాకేంటి క్యాన్సర్ అనుకున్నా..