మసాజ్.. శారీరక నొప్పుల నుండి ఉపశమనం కలిగించడంతో పాటు మానసికంగా సాంత్వన చేకూర్చుతుందీ ప్రక్రియ. ఈ కరోనా కాలంలోనూ ఇంటి నుంచి పనిచేయాల్సి రావడంతో అటు ఇంటి పని, ఇటు ఆఫీసు పనితో సతమతమవుతున్నారు చాలామంది. తద్వారా శారీరక నొప్పులు, మానసిక ఒత్తిడి రెట్టింపవుతున్నాయి. ఇక వీటి నుంచి బయటపడటానికి స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్లకు వెళ్లి మసాజ్ చేయించుకుందామంటే ఈ కరోనా కాలంలో అవి కూడా మూతపడ్డాయి. అలాగని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎవరికి వారే సొంతంగా మసాజ్ చేసుకుంటే ఈ సమస్యలకు సత్వరమే ఫుల్‌స్టాప్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. అయితే అదంతా ఎలా సాధ్యం అంటారా.. అందుకు మన చేతుల్లోనే ఉంది మ్యాజిక్ అంతా..! ఇందుకోసం మనం చేయాల్సిందల్లా మన బిజీ లైఫ్‌స్టైల్‌లో మసాజ్ కోసం కాస్త సమయం కేటాయించడమే!
మెడనొప్పి మాయం..
సాధారణంగా కంప్యూటర్ మన కంటికి సమాంతరంగా ఉండాలి. ఈ సౌకర్యం ఆఫీస్‌లో ఉంటుంది.. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే సమయంలో ఉండకపోవచ్చు. బెడ్ మీద, నేలపై ల్యాప్‌టాప్స్ పెట్టుకుని పనిచేయడం వల్ల మెడను పదే పదే వంచాల్సి వస్తుంది. తద్వారా మెడనొప్పి వచ్చే ఆస్కారం ఎక్కువ. ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేసే వారిలో చాలామంది మెడనొప్పితో ఇబ్బందిపడుతున్నారు. దీన్నుంచి బయటపడడానికి మందుల కంటే సెల్ఫ్ మసాజ్ ప్రక్రియ చక్కగా తోడ్పడుతుంది.
ఇందుకోసం మెడను నిటారుగా పెట్టి ముందుకు.. వెనక్కి అనాలి. తద్వారా నొప్పిగా ఉన్న ప్రదేశమేదో తెలుస్తుంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో మరీ బలంగా కాకుండా సున్నితంగా చేతి మునివేళ్లతో గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేయాలి. ఆపై వ్యతిరేక దిశలో వేళ్లని గుండ్రంగా తిప్పుతూ మరోసారి మసాజ్ చేయాలి. ఇలా రోజుకోసారి కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి క్రమంగా ఉపశమనం పొందచ్చు.
తలనొప్పితోపాటు ఒత్తిడికీ చెక్..
రోజులో పని ఒత్తిడి పెరిగినా తలనొప్పి అంటూ చాలామంది తల పట్టుకుంటారు. ఇక ఈ కరోనా సమయంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనల వల్ల ఈ నొప్పి మరింత తీవ్రమవుతోంది. అంతేకాదు.. నిరంతరాయంగా కంప్యూటర్ తెరను తదేకంగా చూడడం వల్ల.. పని వేళలు ఎక్కువవడం వల్ల కూడా బాగా ఒత్తిడికి గురై తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు కాస్త సమయాన్ని కేటాయించుకుని ఎవరికి వారే స్వయంగా మసాజ్ చేసుకోవడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందడంతోపాటు.. మానసిక ప్రశాంతత కూడా సొంతమవుతుంది.
ఇందుకోసం ముందుగా చేతి బొటన వేళ్లను చెవులపై ఉంచి.. మునివేళ్లతో కంటి చివర్ల వద్ద గుండ్రంగా, మృదువుగా మర్దన చేయాలి. ఆపై కాస్త ఒత్తిడిని పెంచుతూ మునివేళ్లతో గుండ్రంగా మసాజ్ చేస్తూ హెయిర్ లైన్ నుంచి నుదురు భాగం వరకు తీసుకురావాలి. అలాగే మసాజ్ చేసుకుంటూ తిరిగి రెండు చేతుల మునివేళ్లను పూర్వస్థితికి తీసుకెళ్లాలి. ఇలా కాసేపు మర్దన చేసుకోవడం వల్ల తలనొప్పి తగ్గడంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.. చాలా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది.
వెన్నునొప్పిని దూరం చేసుకోండిలా..
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు చాలామంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్య వెన్ను నొప్పి. చాలాసేపు కదలకుండా కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయాల్సి రావడమే ఈ నొప్పికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అలాగే గంటల తరబడి ఒకే దగ్గర కూర్చొని టీవీ చూడడం, మొబైల్ ఉపయోగించడం.. వంటివి కూడా వెన్ను నొప్పికి కారణమవుతున్నాయి. అలాంటి వారి కోసమే ఈ సింపుల్ మసాజ్ టెక్నిక్.
ఇందుకోసం నేలపై పద్మాసనం వేసుకుని.. వెన్ను నిటారుగా ఉండేలా కూర్చోవాలి. ఇలా కూర్చున్న తర్వాత వెన్నెముకకు ఇరువైపులా ఉన్న కండరాలపై బొటన వేలిని ఉంచి కాస్త ఒత్తిడితో పైకి, కిందికి అనాలి. ఇలా పది నిమిషాల పాటు మసాజ్ చేయడం వల్ల వెన్ను నొప్పి తగ్గడంతోపాటు వీపు భాగానికి చక్కటి మసాజ్ అందుతుంది. ఇక ఈ క్రమంలో నిటారుగా కూర్చోవడం వల్ల భుజాలు, మెడ భాగం కూడా రిలాక్సవుతాయి.
అరికాళ్లకు మసాజ్..
బయటకు వెళ్లే పని ఉంటే కొద్ది దూరమైనా నడుస్తాం.. దాని వల్ల కాళ్లకు వ్యాయామం లభిస్తుంది. ఈ లాక్‌డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి కాళ్లకు అంతగా వ్యాయామం లేదనే చెప్పాలి. తద్వారా కాళ్లు పట్టేయడం, అరికాళ్లు తిమ్మిర్లు రావడం.. వంటివి జరుగుతుంటాయి. ఇలా జరగకూడదంటే అరికాళ్లకు మసాజ్ చేయాల్సిందే!
ఇందుకోసం టెన్నిస్ బాల్ తీసుకొని దాన్ని అరికాలి కింద ఉంచి.. కాలును నెమ్మదిగా ముందుకూ-వెనక్కి జరుపుతుండాలి. ఇలా మీరు సోఫా లేదంటే కుర్చీలో కూర్చొని రెండు కాళ్లకు మసాజ్ చేసుకోవచ్చు. ఇలా మర్దన చేయడం వల్ల అరికాళ్లకు రక్తప్రసరణ సవ్యంగా జరిగి అవి తిమ్మిరెక్కడం వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.
మణికట్టు నొప్పికి గుడ్‌బై!
ఇప్పుడంతా కంప్యూటర్‌తో పని చేయాల్సి రావడం వల్ల అందరికీ కీ-బోర్డ్, మౌస్‌తో ఎక్కువగా పని ఉంటుంది. కీస్ నిరంతరం ఉపయోగిస్తుండడం, మౌస్‌ను అటూ ఇటూ కదిలించడం వల్ల వేళ్లతో పాటు మణికట్టు ప్రాంతంలో కూడా నొప్పి వస్తుంటుంది. అయితే చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇదిలాగే కొనసాగితే చేయి పట్టు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు. అందుకే మణికట్టు భాగంలో స్వీయ మసాజ్ చేసుకోమంటున్నారు.
ఇందుకోసం ఇంట్లో ఉండే టెన్నిస్ బాల్ లేదంటే ఏ ఇతర బాలైనా సరే.. దాన్ని రెండు అరచేతుల మధ్య ఉంచుకుని చపాతీ పిండిని ముద్దలా చేసినట్లు గుండ్రంగా తిప్పుతుండాలి. అలాగే ఇంట్లో ఉండే స్పాంజ్ లేదా మెత్తటి బాల్ తీసుకొని దాన్ని నొక్కుతూ, వదులుతూ ఉండాలి. ఇలా కొన్ని నిమిషాల పాటు చేయడం వల్ల అరచేతులకు చక్కటి వ్యాయామం అందడంతో పాటు మణికట్టు నొప్పి కూడా మటుమాయం అవుతుంది.
గమనిక: ఇవన్నీ చాలా సింపుల్ మసాజ్ టెక్నిక్సే అయినప్పటికీ నొప్పి త్వరగా తగ్గాలని ఆయా భాగాల్లో బలంగా ప్రెస్ చేస్తూ మసాజ్ చేయకూడదు. అలా చేస్తే నొప్పి తగ్గడమేమోగానీ మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏ భాగాన్నైనా సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. అలాగే ఈ క్రమంలో నొప్పి తగ్గించే నూనెలు కూడా కొన్ని ఉంటాయి. మసాజ్ చేసే క్రమంలో వాటిని కూడా ఉపయోగించచ్చు. ఇంకేవైనా సందేహాలుంటే సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోవడం మాత్రం మరవద్దు.
ఇదీ చదవండి: 'సొరకాయ' బరువు తగ్గిస్తుంది.. కరోనాను తరుముతుంది!