మీకు తెలుసా, నోటి దుర్వాసన కొన్ని జబ్బులకు హెచ్చరిక సంకేతం లాంటిది. దుర్వాసన రావడానికి గల కారణాలు, దాన్ని నివారించడానికి మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.
నోటి దుర్వాసనకు కారణాలు:
చాలా సందర్భాల్లో నోరు పరిశుభ్రంగా లేకపోతే దుర్వాసన వస్తుందని వైద్యులు చెబుతారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇతర శారీరక వ్యాధులకు సంకేతం కావచ్చు.
నోటి దుర్వాసనకు కొన్ని కారణాలు:
పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార ముక్కలు:
ఆహారం తిన్న తర్వాత, నీటితో పుక్కిలించకపోతే చిన్న చిన్న తునకలు లాంటి ఆహారపు ముక్కలు దంతాలలో ఉండి, నోటిలో కొన్ని గంటల తర్వాత దుర్వాసన కలిగిస్తాయి. అంతే కాకుండా, పచ్చి ఉల్లిపాయ, వెల్లుల్లి ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు కూడా చాలాసేపు నోటి నుంచి అటువంటి వాసన వస్తుంది.
దంత సమస్యలు:
దంతాల పరిశుభ్రత గురించి సరిగా పట్టించుకోకపోతే ఈ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. సరిగా పళ్లు తోమనప్పుడు దంతాలలో చిక్కుకున్న ఆహార ముక్కలు పళ్ల వెనుక ఉండి పాచిలా మారవచ్చు. నోటిలోని బ్యాక్టీరియా ఆ ముక్కలను జీర్ణించుకుని హైడ్రోజన్ సల్ఫైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది దుర్వాసన గల వాయువు. ఆపై పళ్లపై పచ్చటి పాచి పేరుకుంటుంది. చిగుళ్లలో శోథ కలిగి వాసన రావచ్చు.
నోరు ఎండిపోయినపుడు:
లాలాజలం నోటిలో తేమను కాపాడుతూ, నోరు శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ కొన్నిసార్లు, నోటిలో లాలాజల ఉత్పత్తి తగ్గడం వల్ల, మృతకణాలు నాలుక, చిగుళ్లు, బుగ్గల కింద పేరుకుని దుర్వాసన కలిగిస్తాయి. ఈ సమస్య సాధారణంగా నిద్రలో వస్తుంది.
వ్యాధుల తీవ్రత:
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల నోటి దుర్వాసన రావచ్చు. జీర్ణ సమస్యలు, క్యాన్సర్, శరీరంలోని ఇతర జీవక్రియల్లో అవాంతరాలు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. ధూమపానం, డైటింగ్, ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం, నోటి పూత, చిగుళ్లలో రక్తస్రావం, నోటిలో పుండ్లు, గవద బిళ్లలు, శరీరంలో జింక్ తగ్గడం వంటివి కూడా నోటి దుర్వాసనకు దారితీస్తాయి. సమస్య అలాగే కొనసాగుతుంటే, వైద్యుడిని సంప్రదించాలి.
నోటి దుర్వాసన పోగొట్టడానికి 10 చిట్కాలు:
- గ్రీన్ టీ: దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ రసాయనాలు నోటి వాసనను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
- అతిమధురం (యష్టిమధు): అతిమధురం రోజూ కొద్దిగా నమలడం ద్వారా నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- లవంగం: నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లవంగం అద్భుతమైన మూలిక. లవంగాన్ని నిదానంగా నమలడం, చప్పరించటం ద్వారా దుర్వాసన సమస్యను పరిష్కరించవచ్చు.
- పిప్పరమెంటు: రోజూ ఒక పుదీనా ఆకును నమలవచ్చు. లేదా పుదీనా నీటితో నోటిని శుభ్ర పరుచుకోవడం ద్వారా నోటి దుర్వాసన పోగొట్టుకోవచ్చు.
- సోంపు గింజలు: ఈ మౌత్ ఫ్రెషనర్ జీర్ణక్రియను పెంచడమే కాక, నోటి నుంచి వాసనను రాకుండా కాపాడుతుంది.
- ధనియాలు: సోంపు గింజల మాదిరిగానే, ధనియాలను ఉత్తమ మౌత్ ఫ్రెషనర్‌గా పరిగణిస్తారు. దీనిని నమలడం ద్వారా నోటి నుంచి వచ్చే దుర్వాసన తగ్గించుకోవచ్చు.
- తులసి: రోజూ తులసి ఆకు నమలడం వల్ల నోటి నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది.
- ఉప్పునీరు: ఉప్పు కలిపిన వెచ్చని నీటితో పుక్కిలి పట్టడం వల్ల దుర్వాసన తగ్గుతుంది. అంతేకాకుండా గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం నుంచి కూడా కాపాడుకోవచ్చు.
- జామ ఆకులు: జామ ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వాటిని నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది, నోటి పూతల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- దానిమ్మ తొక్క: దానిమ్మ తొక్కలను నీటిలో వేసి కాసేపు ఉడకబెట్టాలి. నీరు చల్లారిన తర్వాత పుక్కిలించి నోటిని శుభ్రం చేసుకోవాలి.