Parents Avoid These Mistakes make with Teenagers : పిల్లలను పెంచి పెద్ద చేసి వారిని భవిష్యత్తులో ఒక మంచి పోజిషన్‌కు తీసుకురావడంలో తల్లిదండ్రుల పాత్ర ఎనలేనిదని చెప్పుకోవచ్చు. అయితే కాలం మారుతున్న కొద్దీ పిల్లల పెంపకం విషయంలో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా టీనేజ్ పిల్లల విషయం కొంతమంది పేరెంట్స్‌కు సవాల్‌గా మారుతోంది. ఎందుకంటే ఈ ఏజ్‌లో పిల్లలు వాళ్లంతట వాళ్లే నిర్ణయాలు తీసుకుంటారు. అది తల్లిదండ్రులకు నచ్చకపోవచ్చు. దాంతో వారి మధ్య గొడవలు మొదలవుతాయి.. పేరెంట్స్ చెప్పే విషయాలు నచ్చక.. వాళ్లకి దూరంగా వెళ్లాలనుకుంటారు టీనేజర్స్. కాబట్టి టీనేజ్ పిల్లల్లో ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే.. తల్లిదండ్రులు వారితో ప్రవర్తించే విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు సైకాలజీ నిపుణులు. ముఖ్యంగా ఈ పొరపాట్లను చేయొద్దంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
అతిగా పర్యవేక్షించడం : టీనేజ్‌లో పిల్లలను అతిగా పర్యవేక్షించడాన్ని కొందరు తమకు తాము గొప్పగా ఫీలవుతారు. కానీ వారికి ఈ వయసులో కొంత స్వేచ్ఛ ఇవ్వాలంటున్నారు నిపుణులు. అయితే కొన్ని ఆసక్తులు, అభిరుచులు లేదా ఫ్యాషన్ ఎంపికలను పంచుకోవడం మంచిదైనప్పటికీ కొన్ని విషయాలలో వారికి ఫ్రీడమ్ ఇవ్వాలంటున్నారు. ఎందుకంటే వారు టీనేజ్‌లో సొంత నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. అలాగని అన్ని విషయాలల్లో ఫ్రీడమ్ ఇవ్వకూడదు. వారుచేసే పనులపై ఓ లుక్కేస్తూనే.. తప్పుదారిలో వెళ్తున్నట్లనిపిస్తే జోక్యం చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు..
నిబంధనలు విధించడం : కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కొన్ని విషయాలలో కఠిన నిబంధనలు విధిస్తుంటారు. అయితే టీనేజ్ వారి విషయంలో అది మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే అవి పిల్లలకు గుర్తింపు, స్వేచ్ఛను కలిగి ఉండటాన్ని కష్టతరం చేస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు వారి పిల్లల వయసు, సామర్థ్యాలకు అనుగుణంగా నిబంధనలను సర్దుబాటు చేయాలంటున్నారు.
మద్దతు ఇవ్వకపోవడం : యుక్త వయసు పిల్లలు తరచుగా జీవితంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. ముఖ్యంగా కొందరు పేరెంట్స్ వారి టీనేజ్ చర్యల ఆధారంగా పిల్లల భవిష్యత్తును అంచనా వేస్తుంటారు. అది పిల్లల్లో అనవసరమైన ఆందోళన, ఒత్తిడికి దారితీయవచ్చు. కాబట్టి దానికి బదులుగా వారు ఎదుర్కొనే సవాళ్ల ద్వారా వారికి మార్గనిర్దేశం చేయడంపై దృష్టి పెట్టండి. నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే నిర్ణయాలు తీసుకునే విషయంలో వారికి సహాయపడుతూ పేరెంట్స్‌గా మద్దతు ఇవ్వండి.
కమ్యూనికేషన్ కొరవడడం : చాలా మంది తల్లిదండ్రులు చేసే మరో పొరపాటు ఏంటంటే.. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తారు. అది కూడా టీనేజ్ పిల్లలు.. పేరెంట్స్‌పై అసహ్యం పెంచుకోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి అలాకాకుండా ఉండాలంటే ఇద్దరి మధ్య ఓపెన్ కమ్యూనికేషన్ చాలా అవసరం.
మీ పిల్లలు నిత్యం నవ్వుతూ ఉండాలా? - అయితే ఈ 5 విషయాలు చెప్పండి!
వారి మాటలు వినకపోవడం : తల్లిదండ్రులు చేసే ముఖ్యమైన తప్పులలో మరొకటి పిల్లలు చెప్పేది వినకపోవడం. కొందరు పేరెంట్స్ పిల్లలు మాట్లాడుతుంటే వారు చెప్పేవి వినకుండా లైట్ తీసుకుంటారు. కాబట్టి అలాకాకుండా వారు ఏదైనా చెబుతున్నప్పుడు ఫోన్ యూజ్ చేయడం, టీవీ చూడడం లాంటివి చేయకుండా వాళ్లు చెప్పాలనుకున్నదని చెప్పడానికి కొంత టైమ్ ఇవ్వాలి.
వారి భావాలను విస్మరించడం : చాలా మంది తల్లిదండ్రులు.. టీనేజ్ పిల్లల భావోద్వోగాలను అర్థం చేసుకోరు. అది కూడా ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు వారి భావోద్వేగాలను గుర్తించి మీ నుంచి తగిన మద్దతు ఇవ్వండి. బాధలో ఉన్నప్పుడు ఓదర్చడం, ఏమైనా గెలిచినప్పుడు ప్రోత్సహించడం.. లాంటివి చేయడం ద్వారా వారి మానసిక శ్రేయస్సు మరింత బలపడుతుంది.
వారిని విమర్శించడం : తల్లిదండ్రులు పిల్లలను విమర్శిస్తే.. వారి పేరెంట్స్ నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి అలా చేయకుండా పేరెంట్స్ నిర్మాణాత్మక ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంపై దృష్టి పెట్టాలి.
ఇతరులతో పోల్చడం మానుకోండి : ఇక చివరగా ఎక్కువ మంది పేరెంట్స్ టీనేజ్ పిల్లల విషయంలో చేసే పెద్ద పొరపాటు ఏంటంటే.. ఇతరులతో పోల్చడం. ఇలా చేయడం ద్వారా పిల్లల్లో అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. తాము ఏం చేసినా పేరెంట్స్‌కు నచ్చదనే భావనలో ఉంటారు. కాబట్టి మీ పిల్లల విషయంలో ఈ మిస్టేక్ చేయకండి.