కరోనా కాలంలో టెలిమెడిసిన్ ఏ విధంగా ఉపయోగపడింది?
టెలిమెడిసిన్ ప్రపంచానికి కొత్తేమీ కాదు. దాదాపు ఇరవై, ఇరవై ఐదేళ్ల నుంచి సుపరిచితమే. కానీ మన దేశంలో వైద్యులు సంప్రదాయ విధానాలకే ఎక్కువగా అలవాటుపడ్డారు. టెలిమెడిసిన్‌ను ప్రత్యామ్నాయంగా ఎప్పుడూ భావించలేదు. అడపాదడపానే వాడుతూ వస్తున్నారు. అయితే కరోనా సంక్షోభంలో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు, వైద్యులు ఈ విధానం ద్వారా సేవలందించారు. బీపీ, షుగర్ వంటి చిన్న ఆరోగ్య సమస్యలకు వైద్య సలహాలు ఇచ్చారు. కొన్ని చోట్ల అద్భుతమైన ఫలితాలు కనిపించాయి.
భవిష్యత్తులో టెలిమెడిసిన్‌ను పూర్తిస్థాయిలో కొనసాగించే అవకాశాలున్నాయా?
టెలిమెడిసిన్ అన్ని చోట్లా ఉపయోగపడదు. క్లినికల్ ప్రాక్టీస్ తీరును 5 నుంచి 10శాతమే మార్చగలుగుతుంది. సెకండ్ ఒపీనియన్, ఫాలో అప్‌లకు వాడుకోవచ్చు. సాధారణ జలుబు, జ్వరం, దగ్గు, విరేచనాలు, బీపీ, మధుమేహం నియంత్రణ వంటి వాటికి టెలిమెడిసిన్ ఉపయోగపడవచ్చు. కొందరు వైద్యులు కూడా ఉన్నపళంగా ముందుకు రాకపోవచ్చు.
టెలిమెడిసిన్‌పై ప్రభుత్వం మార్గదర్శకాలేంటి?
టెలిమెడిసిన్‌పై భారత వైద్య మండలి మార్గదర్శకాలు జారీ చేసింది. ఏఏ సందర్భంలో టెలి మెడిసిన్ వాడవచ్చునో స్పష్టం చేసింది. వీడియో, ఆడియో, టెక్ట్స్ ద్వారా వైద్య సేవలు అందించడానికి ఎంసీఐ అవకాశం కల్పించింది. అయితే మార్గదర్శకాలను మూడేళ్ల వరకు మాత్రమే పాటించవచ్చునని తెలిపింది. ఆ తర్వాత కూడా టెలిమెడిసిన్ కొనసాగించాలంటే.. ఎంసీఐ నిర్వహించబోయే కోర్సు పూర్తి చేసి.. ఉత్తీర్ణులు కావల్సి ఉంటుంది.
టెలి మెడిసిన్ సేవల కోసం వైద్యులు, పేషంట్లు ఎలా సమాయత్తం కావాలి?
సంప్రదాయమైనా, టెలి మెడిసిన్ అయినా.. వైద్యులు నైతిక విలువలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఏఏ వీడియో, ఆడియో సదుపాయాలు బాగుంటాయనేది వైద్యులే అన్వేషించుకోవాలి. అయితే టెలి మెడిసిన్ కోసం వైద్యులు కమ్యునికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి. పేషంట్లు కూడా ఏ సలహా కోసం ఏ వైద్యుడిని ఎంచుకోవాలో అవగాహన పెంచుకోవాలి. వైద్యులకు, పేషంట్లకు మధ్య స్పష్టమైన అవగాహన ఉండాలి.
పేషంట్‌ను వ్యక్తిగతంగా పరీక్షించకుండా.. వ్యాధి నిర్ధారణ చేయడం సాధ్యమేనా?
బీపీ, షుగర్, బరువు వంటివి ఇంట్లో ఎవరికి వారే చూసుకొని.. వైద్యులకు వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా పంపించవచ్చు. ల్యాబ్‌లో చేయించిన పరీక్షల నివేదికలను కూడా అలాగే పంపించవచ్చు. వైద్యులు వాట్సాప్, మెయిల్ ద్వారా రిపోర్టులు పరిశీలించి.. సలహా ఇవ్వగలుగుతారు. అయితే పరీక్షలు చేయించిన ల్యాబ్ సామర్థ్యం, ప్రమాణాల విషయంలో పేషంట్లే జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తప్పుడు రిపోర్టు ఆధారంగా తప్పుడు సలహాలే వస్తాయి. అయితే పేషంట్‌ను నేరుగా పరీక్ష చేయాల్సిన అవసరం లేని వాటికే టెలి మెడిసిన్ ఉపయోగించాలి. ఉదాహరణకు సర్జరీ అవసరమని టెలి మెడిసిన్ ద్వారా సలహా ఇవ్వవచ్చు. కానీ సర్జరీ కోసం ఆస్పత్రికి వెళ్లాల్సిందే.
రోగుల వ్యక్తిగత, ఆరోగ్య సమాచార గోప్యత ఉంటుందా?
ప్రస్తుతం సమాజంలో నెలకొన్న ధోరణులను బట్టి ఇలాంటి అనుమానాలు రావడం సహజమే. సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వైద్యులు కచ్చితంగా రోగుల సమాచార గోప్యతకు ప్రాధాన్యమివ్వాల్సిందే. ఈ విషయంలో వైద్యులు, పేషంట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్పత్రులు సాఫ్ట్‌వేర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా.. టెలిమెడిసిన్ విధానంపైనే తప్పుడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉంది.
టెలిమెడిసిన్‌తో వైద్యం ఖర్చు తగ్గుతుందా?
టెలి మెడిసిన్‌తో ఖర్చు పరంగా పెద్దగా తేడా ఉండకపోవచ్చు. కానీ ప్రయాణ భారం తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది. ఒక్కో సారి ఐదు నిమిషాల కన్సల్టేషన్ కోసం ఐదారు గంటలు సమయం వెచ్చిచ్చాల్సి వస్తోంది. అలాంటి ఇబ్బందులు తగ్గుతాయి. చిన్న చిన్న వైద్య సేవలకు ఖర్చు కూడా తగ్గొచ్చు. ఏ కొత్త అంశం అందుబాటులోకి వచ్చినా.. దాన్ని లాభాసాటిగా ఏ విధంగా మార్చుకోవాలని ప్రైవేట్ వ్యవస్థలు ఆలోచిస్తాయి. దాన్ని తప్పుబట్టలేం కూడా. మన దేశంలో సుమారు 80 నుంచి 85 శాతం మంది వైద్యం కోసం జేబులోంచి ఖర్చు చేస్తున్నారు. ఐదు నుంచి 7 శాతం మంది ఆరోగ్య బీమా వినియోగిస్తున్నారు. మరో 10 నుంచి 12 మంది ప్రభుత్వాలకు సంబంధించి బీమా సేవలు వాడుతున్నారు.
భవిష్యత్తులో టెలి మెడిసిన్‌కు బీమా వర్తించే అవకాశం ఉందా?
టెలి మెడిసిన్‌కు బీమా కల్పించేందుకు బీమా కంపెనీలు ఒప్పుకునే పరిస్థితి ఇప్పుడైతే లేదు. ఇన్ పేషంట్లకు మాత్రమే బీమా ఇస్తున్నాయి. కానీ కొందరు ప్రముఖ వైద్యుల కన్సల్టేషన్ కోసం కూడా వేల రూపాయలు ఫీజు ఉంటుంది. దాన్ని భరించడం కొంచెం కష్టమే. టెలి మెడిసిన్ ద్వారా ఇచ్చే సలహా ఆధారంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తే.. వాటికి రీఎంబర్స్‌మెంటు రాకపోవచ్చు. అయితే ప్రస్తుతం కరోనా సమయంలో జరుగుతున్న టెలిమెడిసిన్ సేవలకు బీమా వర్తించేలా నిర్ణయాలు రావచ్చు.
ఇదీ చదవండి: గొర్రెకుంటలో మరోమారు నమూనాలు సేకరణ