మొక్కై వంగనిది మానై వంగదు అనేది పాత సామెతే... కానీ, ఈ కాలంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించుకునేందుకు తెగ తాపత్రయ పడుతున్నవారికి ఇది సరిగ్గా సరిపోతుంది. బాల్యంలో మనం తీసుకునే ఆహారం పెద్దయ్యాక మన ఆహార అలవాట్లపై ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనంలో తేలింది. పసి వయసులో పండ్ల రసాలు తాగిన పిల్లలు కౌమార వయసు వచ్చే సరికి.. పండ్ల రసాలు తాగని పిల్లలకంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారని పరిశోధనలో స్పష్టమైంది.
బోస్టన్ వర్సిటీ చేపట్టిన ఓ అధ్యయనంలో మూడు నుంచి ఆరేళ్ల వయసులో ఉన్న వంద మంది బాలలు పాల్గొన్నారు. దాదాపు పదేళ్ల పాటు కొనసాగిన ఈ పరిశోధనలో.. బాల్యంలో ప్రతిరోజూ ఒకటిన్నర కప్పు తాజా పండ్ల రసాన్ని తాగిన పిల్లలు... రోజుకు సగం కప్పు పండ్ల రసం తాగిన పిల్లల కంటే ఆరోగ్యంగా ఉన్నారని తేలింది. అంతే కాదు, వయసు పెరిగే కొద్దీ వారి ఆహార నియమాలూ ఆరోగ్యంగా మారుతున్నాయట. పైగా స్థూలకాయం బారిన పడట్లేదు.
అధ్యయనంలో తేలిన మరిన్ని అంశాలు..
- బాల్యంలో పండ్ల రసాలు రోజూ తీసుకునే పిల్లలు.. 14-17 ఏళ్ల వయసు వచ్చే సరికి పచ్చి పండ్లను అధికంగా తినగలుగుతున్నారు. పండ్లలోని పోషకాలు అంది వారి జీవన శైలి ఆరోగ్యంగా మారతుంది.
- పండ్ల రసం తాగే పిల్లలు...తాగనివారికంటే నాలుగు రెట్లు అధికంగా ఆరోగ్యకర ఆహార నియమాలకు అలవాటు పడుతున్నారు.
- పండ్ల రసం సేవించడం.. శరీర ద్రవ్యరాశి సూచికలో లేదు. అయితే, ఓ పండు మొత్తాన్ని తినడం వల్ల శరీరానికి శక్తి సరిపడా లభిస్తుంది. అనవసరపు ఆహారంపై దృష్టి తగ్గుతుంది. దీంతో శరీర బరువు అదుపులో ఉంటుంది.
- ఆరేళ్లలోపు పండ్ల రసాలు తాగని వారిలో... వయసు పెరిగే కొద్ది ఆరోగ్యం దెబ్బతినడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెరుగుదల వేగం తగ్గుతుంది.
ఇదీ చదవండి: హెర్బల్ చాయ్.. ఆరోగ్యానికి ఎంతో హాయ్!