జీవనశైలి మార్పుతో చాలామంది డయాబెటిక్(world diabetes day 2021) బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. కరోనా తర్వాత బాధితుల సంఖ్య మరింత పెరిగిందని అంటున్నారు. కరోనా తగ్గటానికి చాలామందికి స్టిరాయిడ్ల చికిత్స అందించారు. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. తాత్కాలికంగా మధుమేహం బారిన పడతారు. ఇలాంటి వారికి గోళీలు లేదంటే ఇన్సులిన్ ఇస్తారు. స్టిరాయిడ్లు వాడటం ఆపేసిన తర్వాత మధుమేహం కూడా నియంత్రణలోకి వస్తుంది. అయితే అప్పటికే మధుమేహ వ్యాధికి సమీపంలో(బోర్డర్) ఉన్నవారికి మాత్రం స్టిరాయిడ్లు ఆపినా సరే మధుమేహం కొనసాగే వీలుందని వైద్యులు పేర్కొంటున్నారు. కరోనా తర్వాత ఇలాంటి వారి సంఖ్య పెరిగింది. కొంతమంది యువతలో బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) 25 కంటే ఎక్కువగా ఉంటోంది. వయసు, ఎత్తుకు మించి బరువు ఉంటున్నారు. ఇది కూడా అధిక రక్తపోటు, మధుమేహానికి(world diabetes day 2021) దారి తీస్తోంది. కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటుకు 90శాతంపైనే దూరంగా ఉండొచ్చునని సూచిస్తున్నారు.
వ్యాధిగ్రస్థుల్లో కిడ్నీ సమస్యలు...
నిమ్స్‌కు వచ్చే కిడ్నీ బాధితుల్లో 45 ఏళ్ల లోపల ఉన్న వారు 40 శాతం కంటే ఎక్కువే ఉంటున్నారు. జీవనశైలిలో వస్తున్న మార్పులు ప్రధాన కారణం. కొందరైతే రోజుకు 500 అడుగులు కూడా నడవడం లేదు. గతంలో 5-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలు, కళాశాలలకు బరువుతో కూడిన పుస్తకాల బ్యాగ్‌తో నడిచి, లేదా సైకిళ్లపై వెళ్లేవారు. అదో వ్యాయామంగా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. పిల్లలు ఆటలకు దూరంగా ఉంటున్నారు. జంక్‌ఫుడ్స్ తినడం ఎక్కువైంది. డయాబెటిక్ సోకిన తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే 4-5 ఏళ్లలోనే కిడ్నీల సమస్య ఎదురవుతుంది. ప్రతిరోజు గంటపాటు శారీరక వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నడక, ఈత, బ్యాడ్మింటన్ లాంటి క్రీడలు ఆడవచ్చు. ఎక్కువ ఆకలి, నీరసం, దాహం లాంటి లక్షణాలు వేధిస్తుంటే పరీక్షలు చేయించుకోవాలి.
-డాక్టర్ శ్రీభూషణ్‌రాజు, నెఫ్రాలజిస్టు, నిమ్స్
కాలుష్యం కూడా దెబ్బ తీస్తోంది
యువతలో మధుమేహానికి జీవనశైలి మార్పు ఒక్కటే కాదు. కాలుష్యం కూడా దెబ్బతీస్తోంది. గర్భంలో శిశువు ఉన్నప్పుడు ప్లాస్టిక్ కాలుష్యం బారిన పడితే పుట్టే పిల్లల్లో థైరాయిడ్, మధుమేహ ముప్పు ఉంటుంది. పరిశ్రమల కాలుష్యం వల్ల పిల్లల్లో డయాబెటిక్ ముప్పు ఉంటుంది. పొలాల్లో వాడే ఎలుకల మందుల వల్ల కూడా ఈ సమస్య పెరుగుతుంది. వచ్చే మూడేళ్లు ‘మధుమేహానికి చికిత్స...ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’ అన్న థీమ్ ప్రచారంలోకి వచ్చింది. అందరికి ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చినప్పుడే మధుమేహాన్ని నియంత్రణలో పెట్టగలం.
-డాక్టర్ పి.వి.రావు, ప్రముఖ మధుమేహ వ్యాధి నిపుణులు
వరల్డ్ డయాబెటిస్ డే(world diabetes day 2021) సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో మోహన్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో డయాబెటిక్ వాక్‌ను నిర్వహించారు. రోజూ నడక సాగిస్తే మధుమేహం అదుపులో ఉంటుందని వైద్యులు డాక్టర్ శాస్త్రి తెలిపారు. ఈ ఏడాది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన పిలుపుమేరకు(యాక్సిస్ టు కేర్) అందరికీ డయాబెటిక్ పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంతో అవగాహన కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: మధుమేహం.. నివారణే నిజమైన పరిష్కారం