కొవిడ్ సోకిన వారికి చికిత్సతో పాటు వారు తీసుకునే ఆహారం కూడా దోహదం చేస్తుంది. కరోనా నుంచి కోలుకున్న తరువాత (14 రోజుల తరువాత) కొన్ని ఆహార పదార్ధాలను వర్జించి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే యథాస్థితికి చేరుకోవచ్చు. ఆహారం రోగ నిరోధక శక్తిని పెంచేలా ఉండాలి. సాధారణ జ్వరం కలిగినపుడు ఆకలి తగ్గినట్టుగానే కొవిడ్ సమయంలోనూ ఆకలి తగ్గిపోతుంది. అందువల్ల విటమిన్లు, కొన్ని సూక్ష్మపోషకాలు, ముఖ్యంగా విటమిన్ సి, డి, జింక్ లాంటివి ద్రవ రూపంలో లేదా మాత్రల రూపంలో తీసుకోవచ్చు. ఈ పోషకాలు లభ్యమయ్యే దినుసులను కూడా ఆహారంగా తీసుకోవచ్చు.
కొవిడ్ సమయంలో ఆహారం:
వ్యాధి సమయంలో ద్రవాహారం చాలా మంచిది. కిచిడి, రోటి లేదా చపాతీ, సొరకాయ లేదా బీరకాయ లాంటి కూరగాయలు, పెసలు, కందిపప్పు లాంటి ధాన్యాలతో చేసిన సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. కొబ్బరినీళ్లు, పండ్లు ఇవ్వవచ్చు. తాజాగా తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవాలి. ఉడికించని కూరగాయలు, స్వీట్లు ఈ సమయంలో మంచిది కాదు. తియ్యటి పదార్ధాలను తినాలని అనిపించినా చాలా పరిమితంగా తీసుకోవాలి. మీ వైద్యున్ని కానీ, ఆహార నిపుణులను కానీ సంప్రదించి వారిచ్చిన సూచనలను పాటించవచ్చు.
కొవిడ్ నుంచి కోలుకున్న తరువాత:
రెండు వారాల సమయం గడవగానే కొవిడ్ లక్షణాలు పూర్తిగా తగ్గిపోయి ఆకలి అమాంతంగా పెరుగుతుంది. ఒక వారం లేదా 10 రోజుల పాటు ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఈ సమయంలో మాంసకృత్తులు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం చాలా అవసరం. శాకాహారులు పాలు, పాల పదార్ధాలైన పనీర్, పుట్టగొడుగులు, ఎండు ఫలాలు, సోయా లాంటివి తీసుకోవచ్చు. మాంసాహారులు గుడ్లు, మాంసం తరచూ తీసుకోవచ్చు. అధిక మాంసకృత్తుల లభ్యతతో శరీరం బాగా కోలుకుంటుంది. శ్వాసకోశాలు తిరిగి శక్తిని పొందుతాయి.
ఇతర అంశాలు:
కొవిడ్ తగ్గిన తరువాత కొన్ని రోజుల పాటు బలహీనత వెంటాడుతుంది. అందువల్ల శరీరానికి ఎక్కువ కష్టం కలిగించే పనులు చేయరాదు. శారీరక వ్యాయామం మంచిదే కానీ క్యాలస్థినిక్స్ లాంటి సులభమైన శరీర కదలికలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. శ్వాస కోశాలకు బలం కలిగించే ప్రాణాయామం లాంటి వాటిని సాధనం చేయవచ్చు.
కూరగాయలు, పండ్లు అధిక మోతాదులో తీసుకోవాలి. ఇవి ప్రతిరోజు 400 గ్రా. వరకు ఉండవచ్చు. శీతలీకరించిన (ఫ్రోజెన్ ఫుడ్స్) ఆహార పదార్ధాలు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న తినుబండారాలు, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం మంచిది కాదు. ప్రత్యేకంగా ఉప్పు, చక్కెర తగ్గించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం మన రోజువారీ క్యాలరీలలో 5 శాతానికి మించకుండా స్వీట్ల నుంచి పొందవచ్చు. స్వీట్ తినాలనిపించినపుడు ఒక పండు తినటం మంచిది. మన ఆహారంలో కావలసినంత పీచు పదార్ధం కూడా ఉండాలి. పీచు జీర్ణమండలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహారాన్ని అధిక మోతాదులో తీసుకోనివ్వదు. పీచు పదార్ధం ఎక్కువగా కూరగాయలు, పండ్లు, ధాన్యం మొదలైన వాటిలో ఉంటుంది. ఓట్స్, గోధుమ రంగు పాస్తా, కినోవా, ముడి బియ్యం, జల్లెడ పట్టని పిండితో చేసిన రొట్టెలు తినటం శ్రేష్టం.
ఆహారంతో పాటు రోజులో సరిపడా నీరు తాగాలి. కొవిడ్ సమయంలోనూ, ఆ తరువాత కూడా శరీరంలో నీటికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. శీతల పానీయాలు కాకుండా కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవటం ఉత్తమం. ఇటువంటి ఆహార జాగ్రత్తలు తీసుకుంటే చాలా వేగంగా కొవిడ్ లక్షణాల నుంచి బయటపడి మెరుగైన ఆరోగ్య స్థితికి చేరుకోవచ్చు.