Dates Benefits in Winter in Telugu: చలికాలంలో సాధ్యమైనంతవరకూ బలవర్ధకమైన ఆహారమే తినాలి. ఎందుకంటే శీతాకాలం వచ్చిందంటే చాలు ఇమ్యూనిటీ పడిపోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందుకే పౌష్ఠిక పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీనికోసం సరైన ప్రత్యామ్నాయం ఖర్జూరం. శరీరానికి అత్యవసరమైన విటమిన్లు, ఖనిజాలు, క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలు ఇందులో దండిగా ఉంటాయి. ఇవన్నీ తక్షణ సత్తువను ప్రసాదిస్తూనే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే చలికాలంలో ఖర్జూరాలు తినడం వల్ల పలు లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..
శరీరం వెచ్చగా: చలికాలంలో శరీరం వెచ్చగా ఉండటానికి అవసరమైన వేడిని ఖర్జూరం అందిస్తుంది. సహజ చక్కెర రూపంలో దీన్ని చాలా పదార్థాలు, పానీయాల్లో ఉపయోగించుకోవచ్చు. దీంతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమూ సొంతమవుతాయి.
ఉల్లిపాయలు ఇలా తీసుకుంటే- డయాబెటిస్‌కు చెక్!
జలుబును తగ్గించడానికి: మీరు జలుబుతో బాధపడుతుంటే.. రెండు గ్లాసులు నీళ్లల్లో 2-3 ఖర్జూరాలు, కొన్ని మిరియాలు, 1-2 యాలకులు తీసుకొని వాటిని ఉడకబెట్టండి. పడుకునే ముందు దీన్ని తాగండి. ఇది జలుబును తగ్గించడానికి సహాయపడుతుంది.
ఆస్తమాను తగ్గించడానికి: చలికాలంలో వచ్చే సాధారణ సమస్యలలో ఆస్తమా ఒకటి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 1-2 ఖర్జూరాలు తీసుకోవడం వల్ల ఆస్తమా సమస్య తగ్గుతుంది.
హుషారు కోసం: రాత్రిపూట బాగా నిద్రపోయినా ఉదయం లేవగానే అలసటగా, నిస్సత్తువగా, మందకొడితనంగా అనిపిస్తోందా? అయితే రెండు, మూడు ఖర్జారాలు తిని చూడండి. వీటిల్లోని తేలికైన పిండి పదార్థాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అందుకే ఇవి వ్యాయామాలకు ముందు చిరుతిండిగానూ బాగా ఉపయోగపడతాయి. ఎక్కువసేపు వ్యాయామాలు చేస్తున్నట్టయితే ఖర్జూరంతో పాటు బాదం, జీడిపప్పు వంటి గింజపప్పులనూ కాసిన్ని తినటం మంచిది. ఇవి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తూ త్వరగా అలసిపోకుండా కాపాడతాయి.
అలర్ట్- ఈ లక్షణాలు ఉన్నాయా? మీ కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే!
మలబద్ధకం సమస్యలు నయమవడానికి: ఖర్జూరంలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. చలికాలంలో జీవక్రియలు మందగించే తరుణంలో ఇదెంతో మేలు చేస్తుంది. జీర్ణకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి, మలబద్ధకం దరిజేరకుండా ఉండటానికి తోడ్పడుతుంది. ఇలా పెద్దపేగు క్యాన్సర్ ముప్పునూ తగ్గిస్తుంది. తిన్న ఆహారం సరిగా ఒంట పట్టటానికి తోడ్పడే జీర్ణ రసాలు ఉత్పత్తయ్యేలానూ ఖర్జూరం ప్రేరేపిస్తుంది. కొన్ని ఖర్జూరాలను తీసుకుని వాటిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి.
గుండె పదిలం: చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి. దీంతో గుండెపోటు ముప్పూ పెరుగుతుంటుంది. ఖర్జూరం తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది హృదయ స్పందన రేటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా గుండెపోటు, అధిక రక్తపోటు ముప్పులూ తగ్గుముఖం పడతాయి.
కీళ్లనొప్పులకు మంచిది: చలికాలంలో నొప్పులు, బాధలు ఎక్కువవుతుంటాయి. కీళ్లనొప్పులతో బాధపడేవారికిది ఏటా అనుభవమే. ఖర్జూరంలోని నొప్పి నివారణ గుణాలు వీటిని కొంతవరకు తగ్గిస్తాయి. మెగ్నీషియం సైతం నొప్పులు, బాధలు తగ్గటానికి తోడ్పడుతుంది. రోజు కొన్ని ఖర్జూరాలు తినాలి.
రక్తహీనత తగ్గుముఖం: ఖర్జూరంలో ఐరన్ దండిగా ఉంటుంది. దీంతో హిమోగ్లోబిన్ స్థాయులు మెరుగవుతాయి. రక్తహీనత తగ్గుముఖం పడుతుంది. మహిళల్లో ఐరన్ లోపం తరచూ చూసేదే. దీంతో నిస్సత్తువ, హార్మోన్ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గటం, జుట్టు రాలటం, చర్మం పాలిపోవటం, గర్భిణుల్లో గర్భస్రావం కావటం వంటి ఇబ్బందులెన్నో చుట్టుముడతాయి. వీటి నివారణకు ఖర్జూరం ఎంతగానో ఉపయోగపడుతుంది. గర్భిణుల్లో ఐరన్ లోపం తలెత్తకుండా ఖర్జూరం తినాలని సూచిస్తుంటారు. ఇది పిండం ఎదుగుదలకూ తోడ్పడుతుంది. శరీరం ఐరన్‌ను గ్రహించుకోవటానికి సాయం చేసే రాగి సైతం ఖర్జూరంలో దండిగా ఉంటుంది.
మహిళలు ఈ 5 ఆహార పదార్థాలు తిన్నారంటే - ఆరోగ్య సమస్యలన్నీ పారిపోతాయి!
ఎముక పుష్టి: ఎముక ఆరోగ్యానికి విటమిన్ డి కీలకం. చలికాలంలో శరీరానికి తగినంత ఎండ తగలక పోవటం వల్ల ఇది లోపించే అవకాశముంది. ఫలితంగా ఎముకల ఆరోగ్యమూ దెబ్బతినొచ్చు. క్యాల్షియంతో నిండిన ఖర్జూరంతో దీన్ని నివారించుకోవచ్చు. ఎముకలు, దంతాలు బలంగా ఉండేలా చూసుకోవచ్చు. పొటాషియం, ఫాస్ఫరస్, రాగి, మెగ్నీషియం వంటివి ఎముకలు గుల్లబారటం, కీళ్లు అరగటం వంటి ఎముక సమస్యల నివారణకూ ఉపయోగపడతాయి.
చలికాలంలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లండి - ప్రమాదకరం కావొచ్చు!
కండరాల నొప్పులు బాధిస్తున్నాయా? ఉల్లిపొట్టుతో చెక్ పెట్టండి!