లాక్డౌన్ అమల్లో ఉన్నన్ని రోజులు కరోనా కేసుల సంఖ్య తక్కువగానే పెరిగేది. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా ప్రజల గుండెల్లో గుబులు అంతకంతకూ పెరుగుతోంది. మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీని నుంచి బయటపడే మార్గాలను ఈటీవీ భారత్‌కు ఫోన్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు ప్రముఖ సైకాలజిస్ట్ జయంతి దత్తా.
మొదటగా కరోనా ప్రమాదం గురించి తెలియజేశారు దత్తా. వైరస్ లక్షణాలు స్పష్టంగా కనిపించటం లేదని... అందుకే ముందుగా జాగ్రత్త పడాలని సూచించారు.
వైరస్‌కు ఎవరూ అతీతులు కాదు..
పిల్లలపై వైరస్ ప్రభావం చూపదని మొదట్లో అందరూ భావించారు. అయితే పిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నారని ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు రుజువు చేస్తున్నాయి.
"కరోనా మనకు తెలియని శత్రువు. మనకు కనిపించదు. ఎటువైపు నుంచి మన మీద దాడి చేస్తుందో తెలియదు. కాబట్టి ఇది ప్రమాదకరమే. లక్షణాలు లేకుండా వ్యాపిస్తున్న వైరస్ ఇంకా ప్రమాదకరమైంది. ఒకసారి మీకు సోకితే... మీతో ఆగదు. మీ కుటుంబ సభ్యులకూ వ్యాపిస్తుంది. అందుకే వ్యాధి నయమయ్యేంత వరకు లేదా వైరస్‌కు మందు వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి."
-డాక్టర్ జయంతి దత్తా, సైకాలజిస్ట్
"కరోనా రోగులు తమకు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు, పొరుగువారికి వాకీ టాకీ బాంబులా మారతారు. కరోనా సోకిన వ్యక్తి మరణిస్తే... కనీసం కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు వచ్చి చూడటానికి అవకాశం ఉండదు. సంప్రదాయక దహనసంస్కారాలు చేయడానికి వీలుండదు.
ఇవన్నీ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తాయి. ఈ భయంతోనే ప్రశాంతంగా నిద్రించలేరు. అంతేకాదు ఈ భయం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. ఇది హృద్రోగాలకు దారితీస్తుంది. రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. చివరికి శరీరంలోని రోగనిరోధక శక్తిని దెబ్బ తీస్తుంది. తద్వారా మీరు ఇన్ఫెక్షన్ల బారినపడొచ్చు' అని అంటున్నారు జయంతి. అయితే ఇటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు దత్తా కొన్ని సూచనలు చేశారు. అవేంటో చూద్దాం...
మీ కుటుంబ రక్షణ కోసం ఇలా చేయండి...
మీ స్వీయ రక్షణ మరిచారో... మీతోపాటు కుటుంబ సభ్యులందురూ బలైపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రపరుచుకోవడం, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు పాటించే దినచర్యను ఇతర కుటుంబ సభ్యులు అనుసరించేలా చేయండి.
ధ్యానం..
యోగా చేయడం చాలా మంచిది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అనులోమ విలోమ పద్ధతిలో ప్రాణాయామం సహా భ్రమ్రీ, కాపలాభటి వంటివి సాధన చేయాలి. ఆసనాలు వేయాలి. భుజంగాసనం, సూర్య నమస్కారం, సేతుబంధ, పవన ముక్తాసనం లాంటివి ఇంటి పట్టునే ఉంటూ తప్పకుండా సాధన చేయాలి. ఇవి మీ శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడం సహా కండరాలు బలంగా తయారయ్యేందుకు, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు దోహదపడతాయి.
ప్రతికూల ఆలోచనలు మానుకోండి
బయటకు వెళ్లలేకపోతున్నాను, స్నేహితులను కలవలేకపోతున్నాను వంటి ప్రతికూల ఆలోచన ధోరణిని ప్రజలు మానుకోవాలి. ఇటువంటివి మీ మెదడులో ప్రతికూల ధోరణి పెరగడానికి దారితీస్తాయి.
గతంలో జరిగిన మంచి అనుభవాలను గుర్తు చేసుకొని, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇది ఉత్తమైన పని. పిల్లలకు నచ్చిన విషయాలను చెప్పేందుకు అవకాశమివ్వండి. వారు చెప్పేది సరిగ్గా విని, ప్రొత్సహించండి. మీ పిల్లలతో ఆటపాటల్లో పాల్గొనండి. అయితే వాటిని ఇంటి లోపలే నిర్వహించాలని గుర్తుంచుకోండి.
కొత్త ప్రయోగాలు చేయండి!
- కార్డ్స్, చెస్, లూడో, క్యారమ్, అంత్యాక్షరి వంటి ఇండోర్ ఆటలను ప్రొత్సహించండి.
- సానుకూల దృక్పథం సృష్టించడానికి, మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సంగీతం కూడా మంచిదే. అందరూ మెచ్చిన సంగీతాన్ని ప్లే చేయండి. ఫలితంగా, మీకు వైవిధ్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కుటుంబ సభ్యులూ సంతృప్తి చెందుతారు.
- పెద్దలపై పెత్తనం చెలాయించేలా పర్యవేక్షణ బాధ్యతలను చిన్నపిల్లలకు అప్పగించండి. వయోజన సభ్యులను పర్యవేక్షించడానికి వారికి అనుమతివ్వండి. కుటుంబ సభ్యులందరూ అప్రమత్తంగా ఉన్నారా, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, నిర్దేశించిన నిబంధనలు పాటిస్తున్నారా? సరిచూసే బాధ్యతలను అప్పజెప్పాలి. తద్వారా వారు సంతోషంగా ఉంటారు. కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.
- వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, మీ స్నేహితులతో చాట్ చేయండి. అయితే కరోనా గురించి మాత్రం మాట్లాడకండి.
ఇదీ చూడండి: '3టీ వ్యూహంతోనే వైరస్‌పై విజయం'