కొవిడ్-19 బారినపడకూడదని భావిస్తున్నారా? ఒకవేళ వచ్చినా తీవ్రంగా మారకూడదని అనుకుంటున్నారా? అయితే నోటిని శుభ్రంగా ఉంచుకోండి. చిగుళ్ల వాపు (పెరియోడాంటైటిస్), నోటి అపరిశుభ్రత(bad mouth hygiene)తో కొవిడ్ తీవ్రమయ్యే ముప్పు పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది మరి. మధుమేహం, గుండె జబ్బు, కిడ్నీ సమస్యల వంటివి కొవిడ్-19 తీవ్రరూపం దాల్చటానికి దారితీస్తున్న సంగతి తెలిసిందే. వీటికిప్పుడు నోటి సమస్యలూ తోడయ్యాయి.
కొవిడ్ తీవ్రతకు చిగుళ్లవాపునకు గణనీయమైన సంబంధమే ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కొవిడ్ బాధితుల్లో చిగుళ్ల నుంచి రక్తం కారటం, పళ్లకు గార పట్టటం ఎక్కువగానే ఉంటున్నట్టు కనుగొన్నారు. కరోనా జబ్బు నివారణకు, దీని దుష్ప్రభావాలను తగ్గించుకోవటానికి, చికిత్సకు నోటి శుభ్రత అత్యవసరమని అధ్యయన ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి.
కొవిడ్-19 కారక సార్స్-కొవీ-2 నోట్లో తిష్ఠ వేసుకోవటానికి చిగుళ్ల వాపు, దీనికి దారితీసే బ్యాక్టీరియా దోహదం చేస్తుండటం గమనార్హం. ఇలా మన నోరు వైరస్‌కు రిజర్వాయర్ మాదిరిగా ఉపయోగపడుతోందన్నమాట. చిగుళ్లవాపుతో ఒంట్లో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) ప్రేరేపితమవుతుంది. దీంతో మధుమేహం, గుండె జబ్బు, న్యుమోనియా, సీవోపీడీ వంటి జబ్బుల ముప్పు పెరుగుతున్నట్టు గత అధ్యయనాలు వివరిస్తున్నాయి. ఇప్పుడిది కొవిడ్-19లోనూ విపరీత ప్రభావం చూపుతున్నట్టు తేలటం ఆందోళనకరం.