జుట్టు పలచబడటం.. ఆడ, మగ తేడా లేకుండా అందరినీ కలవర పెట్టే సమస్య. వెంట్రుకలు రాలకుండా చూసుకోవటానికి ఏవేవో చిట్కాలు, తైలాలు వాడటం చూస్తూనే ఉంటాం. ఇప్పటికీ దీనికి సమర్థమైన చికిత్సలు అంతగా అందుబాటులో లేకపోవటం ఆశ్చర్యకరం. ఈ నేపథ్యంలో క్లీవ్‌లాండ్ క్లినిక్ శాస్త్రవేత్తల వినూత్న చికిత్స కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
మాడు పైపొరను దాటుకొని లోపలికి చొచ్చుకెళ్లే గుణాన్ని పెంపొందించే ప్రిక్టోన్ ఒలమైన్, జింక్ పైరిథియాన్, జింక్ కార్బొనేట్, నియాసినమైడ్, పాంథెనాల్, కెఫీన్ వంటి కారకాలతో పాటు ఒక యాంటీఆక్సిడెంట్ దీనిలోని కీలకాంశాలు. మందుతో కూడిన షాంపూతో పాటు ఈ చికిత్సను కొనసాగించిన వారిలో జుట్టు తక్కువగా ఊడుతున్నట్టు తేలటం గమనార్హం. యాంటీఆక్సిడెంట్లు, విశృంఖల కణాల మధ్య సమతుల్యత దెబ్బతింటే చర్మం త్వరగా దెబ్బతింటుంది. ఇది మాడుకూ వర్తిస్తుంది కదా. ఈ భావనతోనే శాస్త్రవేత్తలు కొత్త చికిత్సతో అధ్యయనం నిర్వహించారు. ఇది మంచి ఫలితం కనబరుస్తుండటం విశేషం.
ఏకాగ్రతకూ పండ్లు, కూరగాయలు: ఏకాగ్రతను దెబ్బతీసే అతిచురుకుదనం (ఏడీహెచ్‌డీ) సమస్య పిల్లలకు చాలా చిక్కులు తెచ్చిపెడుతుంది. వీరు కుదురుగా ఒకచోట ఉండలేరు. దేని మీదా ఎక్కువ సేపు ధ్యాస పెట్టలేరు. విషయాలను గుర్తుంచుకోవటమూ తక్కువే. కోపం వంటి భావోద్వేగాలనూ నియంత్రించుకోలేరు. ఇలాంటివారికి పండ్లు, కూరగాయలు ఎంతో మేలు చేస్తున్నట్టు అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. వీటితో ఏడీహెచ్‌డీ లక్షణాలు తగ్గుముఖం పడుతున్నట్టు కనుగొన్నారు. మెదడులో కొన్ని నాడీ సమాచార వాహకాల మోతాదులు తగ్గటానికీ ఏడీహెచ్‌డీకీ సంబంధం ఉంటున్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు.
ఈ నాడీ సమాచార వాహకాల తయారీలో, మొత్తంగా మెదడు పనితీరులో విటమిన్లు, ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆకలితో ఉన్నప్పుడు ఎవరికైనా చికాకు కలుగుతుంది. ఏడీహెచ్‌డీ పిల్లలూ దీనికి మినహాయింపు కాదు. తగినంత ఆహారం తినకపోతే లక్షణాలు మరింత తీవ్రం కావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పిల్లలకు తగినంత తిండి ఇవ్వలేని సందర్భాల్లో తల్లిదండ్రుల్లో తలెత్తే ఒత్తిడి కుటుంబంలో గొడవలకు దారితీస్తోందని, ఇదీ పిల్లల్లో ఏకాగ్రత లోపించటం వంటి లక్షణాలు తీవ్రమయ్యేలా చేస్తోందనీ వివరిస్తున్నారు. సాధారణంగా ఏడీహెచ్‌డీ లక్షణాలు ఎక్కువైనప్పుడు డాక్టర్లు మందుల మోతాదు పెంచుతుంటారు. మందులు వేసుకోనివారికైతే చికిత్స ఆరంభిస్తారు. దీనికన్నా ముందు పిల్లలకు తగినంత ఆహారం అందుబాటులో ఉంటోందా? ఎంత మంచి ఆహారం తింటున్నారు? అనేవి పరిశీలించటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: నైట్ షిఫ్ట్ చేసే మగవారికి ఈ వైద్య పరీక్షలు తప్పనిసరి!