Kidney Disease Detection Test: దీర్ఘకాల కిడ్నీజబ్బు(సీకేడీ)ను తొలిదశలోనే గుర్తించటానికి జపాన్ శాస్త్రవేత్తలు వినూత్న మూత్ర పరీక్షను రూపొందించారు. మూత్రంలో అతి సూక్ష్మ కణభాగాలను విశ్లేషించటం దీనిలోని కీలకాంశం. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఇది ముందుగానే కిడ్నీలో తలెత్తే మార్పులను గుర్తిస్తుండటం, కిడ్నీ సామర్థ్యం క్షీణించటాన్ని అంచనా వేస్తుండటం విశేషం.
కిడ్నీల్లో లక్షలాది వడపోత విభాగాలు (నెఫ్రాన్లు) ఉంటాయి. ఇవి నిరంతరం రక్తాన్ని శుద్ధి చేస్తూ, వ్యర్థాలను వడపోస్తుంటాయి. నెఫ్రాన్లు దెబ్బతినటం మూలంగానే కిడ్నీ జబ్బు తలెత్తుతుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 9% మంది దీర్ఘకాల కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారని అంచనా. నెఫ్రాన్లు దెబ్బతిన్నా తొలిదశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. చాలామంది లక్షణాలు తీవ్రమయ్యాకే డాక్టర్‌ను సంప్రదిస్తుంటారు. అప్పటికే సమస్య తీవ్రమై ఉంటుంది.
ఒకసారి నెఫ్రాన్లు దెబ్బతింటే కోలుకోవటం కష్టం. మూత్ర లేదా రక్త పరీక్షలతో కిడ్నీ దెబ్బతిన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. అయితే ఇవి తొలిదశలో సమస్యను గుర్తించలేవు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ టోక్యో శాస్త్రవేత్తలు కిడ్నీ జబ్బు తొలిదశ సంకేతాల మీద.. ప్రత్యేకించి పిల్లల్లో కిడ్నీ జబ్బును గుర్తించటంపై దృష్టి సారించారు.
జీవక్రియల్లో భాగంగా కణాల నుంచి వెలువడే సూక్ష్మ భాగాలను (యూఈవీఎస్) మూత్ర నమూనా ద్వారా విశ్లేషించే పరీక్షను రూపొందించారు. ఈ భాగాల్లో నెఫ్రాన్ల నుంచి వెలువడే ప్రొటీన్లు ఉంటాయి. కిడ్నీ ఎంత ఎక్కువగా దెబ్బతింటే మూత్రంలో వీటి మోతాదులూ అంత ఎక్కువగా ఉండటం గమనార్హం. వీటి ద్వారా కిడ్నీ వైఫల్యాన్నీ అంచనా వేయొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు.