Child Headache Treatment In Telugu : తలనొప్పి ఏ వయసు వారికైనా రావొచ్చు. పిల్లలు స్కూలుకు వెళ్లకుండా మారాం చేసేందుకు తలనొప్పి అంటూ సాకు చెబుతున్నారని చాలా మంది తల్లిదండ్రులు లైట్ తీసుకుంటుంటారు. కానీ, పిల్లలు అలా చెప్పడానికి అసలు కారణాలు కూడా తెలుసుకోవాలి. చక్కగా ఆడుకునే వయసులో తలనొప్పి అని కూలబడితే ఆలోచించాల్సిందే. చాలాసార్లు పిల్లల్లో తలనొప్పి మామూలుగా ఉండొచ్చు. కొన్నిసార్లు దీర్ఘకాలమూ తలనొప్పితో అవస్థ పడొచ్చు. ఒక్కోసారి హఠాత్తుగా మొదలవ్వచ్చు. మరికొన్నిసార్లు తీవ్ర సమస్యలకు సంకేతం కావొచ్చు. కారణమేదైనా పిల్లలు తలనొప్పి అంటే సమస్యకు మూలమేంటో తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాలి.
తలనొప్పి అనగానే పిల్లలకు తలనొప్పి ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తుంటారు, ఆలోచిస్తుంటారు. అలసట, ఆకలి, టెన్షన్, ఆందోళన, సరిగా నిద్రపోకపోవడం, జలుబు ఉన్నప్పుడు చాలా మందికి తలనొప్పి వస్తుంది. ఇందుకు పిల్లలు ఏమీ మినహాయింపు కాదు. తలనొప్పి ఏ వయసులో ఉన్న వారికైనా రావొచ్చు. నాడీ సమస్యలతో ఆసుపత్రికి వచ్చే పిల్లల్లో 7 నుంచి 10 శాతం మంది తలనొప్పితో బాధపడేవారే ఉంటున్నారు. చిన్న పిల్లలు స్పష్టంగా చెప్పలేకపోవటం వల్ల పెద్దవాళ్లు అంతగా పట్టించుకోరు. చాలాసార్లు తలనొప్పి దానంతటదే తగ్గుతుండటం వల్ల అదొక సమస్య కాదనే భావిస్తుంటారు. నిజమే. తలనొప్పి ప్రత్యేకించి జబ్బు కాకపోవచ్చు. కానీ ఏదో ఒక సమస్యకు అది సంకేతమనే విషయాన్ని గ్రహించాలి. తాత్సారం చేయకుండా డాక్టర్‌కు చూపించడం మంచిది. ఇక ఒంట్లో నీటిశాతం తగ్గినప్పుడు మెదడుకు తగినంత రక్తం సరఫరా కాదు. ఇది తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి తగినంత నీరు తాగేలా చూడాలి. తరచూ కెఫిన్‌తో కూడిన చాక్లెట్లు, పానీయాలు తీసుకోవటమూ తలనొప్పికి దారితీయొచ్చు.
తలనొప్పి మూడు రకాలు
తలనొప్పిని మూడు రకాలుగా విభంజిచొచ్చు. మొదటిది అక్యూట్. అంటే హఠాత్తుగా వచ్చేది. ఎక్కువగా కాకపోయినా కొందరు పిల్లల్లో సడన్‌గా తలనొప్పి మొదలవుతుంటుంది. ఇది అత్యవసరమైన సమస్య. రక్తనాళాలు చిట్లి రక్తం స్రవించటం, మెదడు పొరల్లో ఇన్‌ఫెక్షన్, మెదడులో కణితి, అధిక రక్తపోటు వంటివి కారణాలతో తలనొప్పి వస్తుంటుంది. అందువల్ల హఠాత్తుగా వచ్చే తలనొప్పిని నిర్లక్ష్యం చేయరాదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. రెండోది స్వల్పకాల నొప్పి దీన్ని సబ్ అక్యూట్ అంటారు. కొద్ది రోజులుగా తలనొప్పి వస్తుంటే సబ్ అక్యూట్‌గా వ్యవహరిస్తారు. ఇందులో నొప్పి ఎక్కువగా ఏమీ ఉండదు. కానీ ఇబ్బంది పెడుతుంది. క్షయ కారక బ్యాక్టీరియా మెదడుకు చేరుకొని పొరలు ఉబ్బటం, మెదడులో ద్రవం పోగుపడటం, కణితులు ఏర్పడటం వల్ల తలనొప్పి వస్తుంటుంది. అంతేకాకుండా మెదడు ఒత్తిడికి లోనైనప్పుడు తలనొప్పి రావొచ్చు. ఊబకాయం ఉన్న పిల్లల్లోనూ ఇలాంటి రకం నొప్పి రావొచ్చు. ఇక మూడోది దీర్ఘకాల నొప్పి క్రానిక్ అంటుంటారు. కొన్నిసార్లు తలనొప్పి నెలల తరబడి వేధిస్తుండొచ్చు. కొందరికి రెండు, మూడేళ్లయినా తగ్గకపోవచ్చు. దీర్ఘకాల నొప్పిలో ప్రధానమైనవి పార్శ్వనొప్పి, ఒత్తిడి, ఆందోళనతో ముడిపడిన తలనొప్పి. పిల్లల్లో ఎక్కువగా కనిపించేవి ఇలాంటి నొప్పులే.
తలనొప్పి ప్రమాదకరమా?
తలనొప్పితో పాటు నడవటానికి ఇబ్బంది పడటం, తూలిపోవటం, శరీరంలో ఒకవైపు భాగం బలహీనంగా మారటం, ఎప్పటికప్పుడు వాంతులు, నడవడిక మారటం, చూపు తేడా రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయరాదు. మెదడులో కణితులు, ద్రవం పోగుపడటం, రక్తనాళాల లోపాలుతో వచ్చే తలనొప్పి తీవ్ర సమస్యలకు సంకేతం కావొచ్చు. చిన్న పిల్లలు అంటే మూడేళ్ల లోపు వయసు పిల్లలు తలనొప్పి గురించి చెప్పలేరు. అందుకే తల్లిదండ్రులే గుర్తించాలి. పిల్లలు అదేపనిగా ఏడుస్తుంటే తలనొప్పి వేస్తుందని అనుమానించాలి.
నివారణ మార్గాలు
కొన్ని జీవనశైలి మార్పులతో తలనొప్పిని నివారించుకునే అవకాశం లేకపోలేదు. అధిక బరువు గలవారికి తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి బరువును అదుపు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వారానికి కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలి. ఆటలతోనూ మంచి వ్యాయామం లభిస్తుంది. యోగాసనాలూ మేలు చేస్తాయి. ఉదయం, సాయంత్రం వేళలో కాసేపు ఒంటికి ఎండ తగిలేలా ఆరుబయటకు తీసుకెళ్లాలి. రక్తంలో గ్లూకోజు మోతాదు తగ్గినా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల పిల్లలు వేళకు భోజనం చేసేలా చూసుకోవాలి. ఏవైనా పదార్థాలు తిన్నప్పుడు తలనొప్పి వస్తున్నట్టు గమనిస్తే వాటికి దూరంగా ఉంచాలి.
తలనొప్పి పరీక్షలు
పిల్లల్లో తలనొప్పికి అరుదుగానే పరీక్షలు అవసరమవుతాయి. ముందుగా చూడాల్సింది రక్తపోటు, బరువు. ఎందుకంటే అధిక రక్తపోటు, ఊబకాయ పిల్లలకు తలనొప్పి ముప్పు ఎక్కువ. తలసైజునూ పరీక్షించాలి. నాడీ, చూపు సమస్యలేవైనా ఉన్నాయా? అనేదీ తెలుసుకోవాలి. మెదడులో ఒత్తిడి పెరిగితే ఆరో కపాలనాడి పక్షవాతం రావొచ్చు. దీంతో కన్ను పక్క వైపునకు తిరగదు. ఫలితంగా చూపు కేంద్రీకృతం కాక ఒకటికి రెండు వస్తువులు కనిపిస్తుంటాయి. పీయూష గ్రంథి వద్ద కణితి వల్ల చూపు మందగిస్తుంది. దీనికి విజువల్ ఫీల్డ్ పరీక్ష చేస్తే వెంటనే తెలుస్తుంది. ఫండస్‌స్కోప్‌తో కంటిలోపల వెనకాల ఉండే డిస్క్ ఉబ్బిందేమో చూడటమూ ముఖ్యమే. జన్యుపరంగా వచ్చే న్యూరోకుటేనియస్ జబ్బు గలవారికి చర్మం మీద మచ్చలు ఏర్పడుతుంటాయి. వీరికి మెదడులో కణితులు ఏర్పడే అవకాశముది. ఇలాంటి మార్పులు, సమస్యలు ఉన్నట్టయితే మెదడు స్కాన్ అవసరం. హఠాత్తుగా, తీవ్రంగా తలనొప్పి వచ్చినప్పుడు మెదడు ఎంఆర్‌ఐ వీనోగ్రామ్ చేస్తారు. ఇందులో కణితులు, మెదడు చుట్టూ నీరు ఎక్కువగా ఉండటం, సిరలు ఎక్కడైనా పూడుకుపోయాయా? అనేవి తెలుస్తాయి.
పార్శ్వనొప్పి ప్రధానం
మెదడు, మెదడు వెలుపలి సమస్యలతో సంబంధం లేని తలనొప్పిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పార్శ్వనొప్పి. సాధారణంగా ఇది సాయంత్రం వేళలో వస్తుంటుంది. ఎక్కువసేపు ఎండలో ఉండటం, సమయానికి తినకపోవటం, తగినంత నీరు తాగకపోవటం వల్ల పార్శనొప్పి వస్తుంటుంది. చాక్లెట్లు ఎక్కువగా తిన్న పిల్లలకు ఈ సమస్య మొదలవ్వచ్చు. చాలావరకు తలకు ఒకవైపునే నొప్పి ఉంటుంది. సాధారణంగా కళ్ల మీద, కంటి వెనకాల నొప్పి వస్తుంటుంది. ఇది ఎక్కువసేపు ఉంటుంది. సుమారు 4 గంటల నుంచి 72 గంటల వరకు వేధించొచ్చు. తలలో ఏదో బాదుతున్నట్టు నొప్పి వస్తుంది. ఒకవైపు చూపు మసకబారటం, వికారం వంటివీ ఉంటాయి. నొప్పి వచ్చినప్పుడు పిల్లలు పడుకోవాలని చూస్తుంటారు. ఏమాత్రం చప్పుడు, వెలుతురు భరించలేరు. పార్శ్వనొప్పి కొందరికి నెలకు ఒకసారి రావొచ్చు. కొందరికి రెండు, మూడు నెలలకు ఒకసారి రావొచ్చు. కొందరికి నెలలోనే చాలాసార్లు రావొచ్చు. తల్లిదండ్రులకు పార్శ్వనొప్పి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ. పార్శనొప్పితో బాధపడే పిల్లల్లో 80 శాతం మంది ఇలాంటి వారే.
లక్షణాలతోనే నిర్ధరణ
పార్శ్వనొప్పి నిర్ధరణకు ఎలాంటి పరీక్షలు లేవు. లక్షణాలే కీలకం. ముందుగా నాడీ సమస్యలు, అధిక రక్తపోటు, చూపు సమస్యలు, ముక్కుచుట్టూరా ఉండే గాలి గదుల్లో వాపు సైనసైటిస్, పిప్పి పళ్ల వంటివేవైనా ఉన్నాయా? అనేవి చూడాల్సి ఉంటుంది. గాలి గదులకు, దంతాలకు సంబంధించిన నాడులు పుర్రెలో కొంత భాగానికీ సమాచారాన్ని చేరవేస్తాయి. అందువల్ల వీటిల్లో తలెత్తే సమస్యలూ తలనొప్పికి దారితీయొచ్చు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇలాంటి ఇతర సమస్యలు బయటపడుతుంటాయి.