వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకుతుందా అనే భయాలు చాలామందిలో ఉన్నాయి. అయితే టీకాతో వంద శాతం రక్షణ లభించదు అంటున్నారు వైద్యులు. వ్యాక్సిన్ తీసుకున్నా చాలామందిలో లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా సరే మాస్క్‌లు విధిగా ధరిస్తూ.. ఇతర అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఉస్మానియాలో పది మంది వైద్యులు రెండు డోసుల టీకా తీసుకున్నా కరోనా బారిన పడ్డారు. అయితే టీకా తీసుకున్న వారిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారు పెద్దగా ఇబ్బందులు పడలేదు. స్వల్ప లక్షణాలతో కరోనా తగ్గిపోయింది. యువత నిర్లక్ష్యంగా ఉంటోంది. ప్రస్తుతం వారికి ఎక్కువగా కరోనా సోకుతోంది. ముఖ్యంగా 22-45 సంవత్సరాల మధ్య వయస్కులు చాలామంది కరోనా బారిన పడుతున్నారు. కొందరు వెంటిలేటర్ వరకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు. పెద్దలే కాదు.. ఇప్పుడు యువతా జాగ్రత్తగా ఉండాలి.
-డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆసుపత్రి
టీకా ఇచ్చాక పెయిన్ కిల్లర్ వద్దు
టీకా తీసుకున్న వారిలో కొద్ది రోజుల పాటు వ్యాక్సిన్ వల్ల కరోనా పాజిటివ్ వస్తుందన్నది అపోహ మాత్రమే అంటున్నారు హైదరాబాద్ ఛాతి వైద్యశాల మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ శుభాకర్. టీకా తీసుకునే ముందే కొందరిలో కరోనా ఇన్‌ఫెక్షన్ ఉంటాయని.. అయితే లక్షణాలు కనిపించడానికి అయిదు రోజుల నుంచి 14 రోజులు పడుతుందని వివరించారు. అప్పటికే ఇన్‌ఫెక్షన్ ఉంటే వ్యాధి బయట పడుతుంది కానీ.. వ్యాక్సిన్‌తో దీనికి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారాయన.
టీకా తీసుకునే సమయంలో భౌతిక దూరం పాటించక పోవడం, మాస్క్‌లు ధరించక పోవడం వల్ల వైరస్ సోకి పాజిటివ్ రావొచ్చు. టీకా వల్ల పాజిటివ్ వస్తుందనే భావనలో శాస్త్రీయత లేదు. వ్యాక్సిన్ తీసుకున్నా ఇన్‌ఫెక్షన్ రావొచ్చు. అయితే ఎక్కువ సీరియస్ కాదు. మరణం వరకు వెళ్లడమన్నది చాలా తక్కువ. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వచ్చే ఒళ్లునొప్పులకు పారాసిట్మాల్ వాడాలి. ఎట్టి పరిస్థితిలోనూ పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. మధురైలో ఓ డాక్టర్ ఇలా వాడి రెండు గంటల్లో మృతి చెందారు. జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనాను అరికట్టవచ్చు. జూన్, జులై నాటికి వైరస్ ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. అప్పటికి కనీసం 30-40 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వగలిగితే మూడో విడత ప్రభావం ఉండకపోవచ్చు.
-డాక్టర్ శుభాకర్, మాజీ సూపరింటెండెంట్, ఛాతి వైద్యశాల
వీటికి దూరంగా ఉండండి
ధూమపానం, ఆల్కహాల్ శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తాయి. అందువల్ల టీకా తీసుకునే వారు సహజంగానే వీటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఇలాంటి వారు టీకా తీసుకున్నప్పటికీ శరీరంలో రక్షణ కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి.. టీకా వేసుకునేందుకు మూడు రోజుల ముందు, టీకా వేసుకున్న తరువాత వారం వరకు మద్యం తీసుకోవద్దంటున్నారు. అన్ని రకాల ఆహారాన్ని తీసుకోవచ్చని.. మధుమేహం, బీపీ ఉన్నవాళ్లు మందులు ఆపాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే వాల్వ్ రీప్లేస్‌మెంటు అయిన వారిలో వాడే బ్లడ్ థిన్నర్ల విషయంలో మాత్రం సంబంధిత కార్డియాలజిస్టును సంప్రదించాల్సిందిగా సలహా ఇస్తున్నారు.
నిర్ధరణ తర్వాత టీకా ఎప్పుడు?
వైరస్ తగ్గిన తర్వాత మూడు నెలలకు టీకా తీసుకోవాలి. కరోనా సోకి తగ్గిన రోగుల్లో యాంటీబాడీలు పెరిగి ఉంటాయి. ఇవి వ్యక్తుల శరీరతత్వాన్ని బట్టి రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఉండొచ్చు. ఆ తరువాత టీకా తీసుకోవచ్చు.
ఇవీ చదవండి: ఊపిరితిత్తులను బలోపేతం చేసే ఆసనాలు ఇవే..
కొవిడ్‌ను ఎదుర్కోవాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే..