ETV Bharat / sukhibhava

పక్షవాతంతో మెదడులో కల్లోలం! - paralysis problems

కరవు వస్తే అల్లాడిపోతాం. వరదలు వచ్చినా విలవిల్లాడతాం. మన మెదడు కూడా అంతే! ఉన్నట్టుండి రక్తనాళాలు పూడుకుపోయి కొంత భాగానికి రక్తం కరవైతే.. అది చచ్చుబడిపోతుంది. అలాగే ఎక్కడన్నా రక్తనాళం చిట్లిపోయి రక్తం వరదపోటెత్తినా.. దెబ్బతినిపోతుంది. ఈ రెంటిలో ఏ వైపరీత్యం సంభవించినా... అంతిమ ఫలితం మాత్రం... పక్షవాతం! చెట్టంత మనిషిని హఠాత్తుగా నిర్వీర్యుణ్ణి చేసే.. అతిపెద్ద వైపరీత్యం ఇది! అందుకే మనలో ప్రతి ఒక్కరూ పక్షవాతంపై అవగాహన పెంచుకోవటం తప్పనిసరి.

Brian problems with paralysis
పక్షవాతంతో మెదడులో కల్లోలం!
author img

By

Published : Nov 17, 2020, 11:01 AM IST

పక్షవాతం.. మామూలు మాటల్లో చెప్పాలంటే మన ఇళ్లలోని 'నీళ్ల పైపుల్లో' తలెత్తే సమస్య లాంటిదే! ఇళ్లలో నీళ్ల గొట్టాల్లానే.. మన మెదడులో రక్తనాళాలుంటాయి. ఇంటి గొట్టాల్లో నీళ్లు ప్రవహిస్తుంటే.. ఈ మెదడులోని నాళాల్లో రక్తం ప్రవహిస్తుంటుంది. ఇవి కీలక మెదడు భాగాలకు నిరంతరం రక్తం అందిస్తుంటాయి. ఈ రక్తనాళాలు ఎక్కడన్నా పూడుకు పోయినా... లేక ఇవి ఎక్కడన్నా పగిలిపోయినా.. మెదడులో హఠాత్తుగా తలెత్తే అతిపెద్ద ఉపద్రవమే... పక్షవాతం!

గుండె పోటు, క్యాన్సర్ల తర్వాత ప్రాణాలను కబళిస్తున్న మూడో అతి పెద్ద సమస్య పక్షవాతమే. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వికలాంగులుగా మారుస్తున్న అతి పెద్ద సమస్య ఇది.

పక్షవాతం.. స్ట్రోక్‌.. బ్రెయిన్‌ ఎటాక్‌.. మెదడులో ఇది సృష్టించే సునామీ మామూలుగా ఉండదు! మన శరీరం మొత్తాన్ని నడిపించే మెదడులో కల్లోలం రేపుతుందీ ఉపద్రవం. దీంతో శరీరంలో సగ భాగం చచ్చుబడిపోవచ్చు. మెదడులో ఏ భాగం దెబ్బతింటే ఆయా ప్రాంతం నియంత్రణలో ఉండే అవయవాలు పట్టుతప్పిపోతాయి. ఉదాహరణకు మెదడులో చేతిని నియంత్రించే భాగం దెబ్బతింటే చేయి పడిపోవచ్చు. చూపునకు సంబంధించిన భాగం దెబ్బతింటే చూపు.. జ్ఞాపకశక్తికి సంబంధించిన భాగం దెబ్బతింటే జ్ఞాపకశక్తి కోల్పోవచ్చు. నిజానికి ఇది ఉన్నట్టుండి ముంచుకొచ్చే ఉపద్రవంలాగే అనిపిస్తుందిగానీ కొన్ని చిన్నచిన్న విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే ఇంత పెద్ద ఉపద్రవాన్నీ తేలికగానే నివారించుకోవచ్చు. అందుకు దీనిపై అవగాహన పెంచుకోవటం అవసరం.

పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ముప్పులు రెండు రకాలు. వీటిలో మొదటివి- నివారించుకోవటానికి, మార్చుకోవటానికి వీలైనవి. రెండోది- మనం మార్చుకోవటానికి వీల్లేని రకాలు.

మనం మార్చుకోగలిగినవి

  • హైబీపీ, పొగతాగే అలవాటు, మధుమేహం, మద్యం ఎక్కువగా తీసుకునే అలవాటు, ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటం, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం, బొజ్జ ఉండటం, గుండె వైఫల్యం, గుండె లయలో తేడాలుండటం.. ఇవన్నీ పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ముప్పులే. అయితే తగు జాగ్రత్తలతో వీటన్నింటినీ మనం మార్చుకోవవచ్చు.
  • ఉప్పు ఎక్కువగా తింటుండటం, శారీరక శ్రమ లేకపోవటం, మాదక ద్రవ్యాలు తీసుకోవటం, గర్భనిరోక మాత్రలు వాడుతుండటం, నిద్రలో అప్పుడప్పుడు శ్వాస ఆడని సమస్యలుండటం, ఒంట్లో నీరు బాగా తగ్గిపోవటం (డీహైడ్రేషన్‌) వంటివీ పక్షవాతానికి కారణమవుతాయి. ఇలాంటి ముప్పు కారకాల విషయంలో మనం ముందే జాగ్రత్తగా ఉండటం అవసరం.

మార్చుకోలేనివి

వయసు పెరుగుతున్న కొద్దీ పక్షవాతం రిస్కూ పెరుగుతుంటుంది. పక్షవాతం రిస్కు పురుషుల్లో ఎక్కువ, బరువు తక్కువగా పుట్టిన వారిలోఎక్కువ. ఇవేకాకుండా జన్యుపరమైన అంశాలూ ముఖ్యపాత్ర పోషిస్తాయి. జన్యు అంశాల్లో ప్రోటీన్‌ సి, ఎస్‌లు లోపించటం, ఎంటీహెచ్‌ఎఫ్‌ఆర్‌ జన్యువులో లోపం వంటివి రక్తంలో హోమోసిస్టీన్‌ మోతాదు పెరగటానికి దోహదం చేస్తాయి. ఇవి అంతిమంగా పక్షవాతానికి దారి తీస్తాయి.

పక్షవాతం ప్రధానంగా రెండు రకాలుగా రావచ్చు.

పూడిక: మెదడులోని రక్తనాళాల్లో ఎక్కడన్నా పూడిక ఏర్పడి, రక్తసరఫరా నిలిచిపోవటంతో మెదడులోని కొంత ప్రాంతానికి రక్తసరఫరా అందదు. ఫలితంగా అక్కడ మెదడు భాగం చచ్చుబడిపోవటం ఆరంభిస్తుంది. ఇదే పక్షవాతం. దీన్ని 'ఇస్ఖీమిక్‌ స్ట్రోక్‌' అంటారు. అలా రక్తసరఫరా నిలిచిపోయిన మెదడు క్రమేపీ 4-6 గంటల్లో చచ్చుబడిపోవటం ఆరంభిస్తుంది. ఈలోపే ఆ పూడిక తొలగించి రక్తసరఫరా పునరుద్ధరించగలిగితే ఆ ప్రభావితమైన మెదడు భాగం చాలా వరకూ దెబ్బతినకుండా చూసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి సందర్భంలో సత్వరమే.. 4 గంటల లోపే పూడికను కరిగించే 'టీపీఏ' మందును ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇస్తే పెద్ద ఉపయోగం ఉండదు.

చిట్లటం: రక్తపోటు పెరిగిపోవటం వల్లగానీ, లేకపోతే రక్తనాళాల గోడల్లో ఇతరత్రా సమస్యలు తలెత్తటం వల్లగానీ మెదడులోని రక్తనాళం ఎక్కడైనా చిట్లిపోవటం వల్ల అక్కడ రక్తం గడ్డకడుతుంది. దీంతో ఆ ప్రాంతంలోని నాడీకణాల పనితీరు దెబ్బతినిపోతుంది. ఇది పక్షవాతానికి దారి తీస్తుంది. దీన్ని 'హెమరేజిక్‌ స్ట్రోక్‌' అంటారు ఈ తరహా పక్షవాతంలో- గడ్డను కరిగించే మందులు ఇవ్వరు, ఇవ్వకూడదు కూడా. వీరికి ఇతరత్రా మందులతో చికిత్స చెయ్యాల్సి ఉంటుంది, చిట్లి గడ్డకట్టిన రక్తం ముద్ద సైజు మరీ పెద్దగా ఉంటే దాన్ని ఆపరేషన్‌ చేసి కూడా తొలగించాల్సి రావచ్చు.

చికిత్స ఏమిటి?

పక్షవాతం లక్షణాలు కనబడగానే ప్రతి నిమిషం ప్రధానమే. ఎంత త్వరగా ఆసుపత్రికి వెళితే ఫలితం అంత బాగుంటుంది. ఆసుపత్రికి వెళ్లగానే వెంటనే మెదడు 'సీటీ స్కాన్‌' తీసి చూస్తారు. రక్తనాళాల్లో పూడిక వల్లే రక్తసరఫరా నిలిచిపోయి పక్షవాతం వచ్చినట్లు తేలితే ఆ పూడిక కరిగిపోయేందుకు వెంటనే 'టిష్యూ ప్లాస్మినోజెన్‌ యాక్టివేటర్‌(టీపీఏ)' ఇంజక్షన్‌ మొదలుపెట్టేస్తారు. దీన్ని మూడు గంటల్లోపు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగున్నర గంటల వరకూ కూడా ఇవ్వొచ్చు. ముఖ్యమైన విషయం ఏమంటే- 'టీపీఏ' అన్నది మరణాన్ని నివారించలేదు. సాధారణంగా పక్షవాతం బారినపడ్డవారిలో మూడింట ఒకరు మరణించే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరణాలు 48-72 గంటల్లో ఎక్కువ. అందుకే ఈ సమయంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు అత్యవసర చికిత్స అవసరమవుతుంటుంది.

మెదడులో కొంత భాగం దెబ్బతింటుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో అవసరమైతే మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా చేయాల్సి రావొచ్చు. మెదడుకు రక్తసరఫరా తగ్గితే అందులోకి నీరు వచ్చి చేరుతుంది. దీంతో మెదడు పెద్దగా అవుతుంది. అందువల్ల దీన్ని తగ్గించటానికీ మందులు ఇస్తారు. ఇలా సకాలంలో 'టీపీఏ' ఇవ్వటంతో పాటు పరిస్థితిని బట్టి ఉపశమన చికిత్స కూడా అవసరమవుతుంది. పక్షవాతం లక్షణాలు కనబడిన 3 గంటలలోపు 'టీపీఏ' చికిత్స మొదలుపెట్టేస్తే కోలుకునే వేగం బాగా పెరుగుతుంది. ఒకవేళ నాలుగు గంటల తర్వాత ఆసుపత్రికి వస్తే- సీటీ స్కాన్‌లో పూడిక వచ్చినట్లు చూస్తూనే వెంటనే వారిని యాంజియోగ్రామ్‌కు తీసుకువెళ్లి.. దానిలో తీగగొట్టం ద్వారా నేరుగా పూడిక వచ్చినచోట, రక్తం గడ్డకట్టిన ప్రాంతంలోనే మందును వదులులుతారు. దానితో అది చాలా వరకూ కరిగిపోతుంది. ఒకవేళ అది విఫలమైతే 'ఎంఈఆర్‌సీఐ' లేదా 'పెనంబ్రా' వంటి సున్నిత పరికరాలతో ఆ గడ్డను బయటకు తీస్తారు. దీంతో మెదడులో మళ్లీ రక్తసరఫరా ఆరంభమవుతుంది. దీన్ని పక్షవాతం వచ్చిన 6-8 గంటల వరకూ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మెదడులో రక్తనాళం చిట్లటం వల్ల సమస్య తలెత్తితే- మెదడులో ఒత్తిడి పెరగకుండా చూసేందుకు, ఆ చిట్లిన రక్తనాళాన్ని మూసివేసి తిరిగి రక్తసరఫరా పునరుద్ధరించేందుకు చాలాసందర్భాల్లో అత్యవసరంగా సర్జరీ అవసరమవుతుంది.

Brian problems with paralysis
చికిత్సకు ముందు.. ఆ తర్వాత

మళ్లీ ముప్పు

పక్షవాతం మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉన్న ప్రమాదకర సమస్య. కాబట్టి అది మళ్లీ రాకుండా నివారణ కోసం హైపర్‌టెన్షన్‌, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌ వంటి వాటిని కచ్చితంగా నియంత్రణలో పెట్టుకోవాలి. పొగ అలవాటు మానెయ్యాలి. రోజూ తక్కువ డోసులో ఆస్పిరిన్‌ మాత్ర తీసుకుంటే మళ్లీ పక్షవాతం వచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది. ఎక్కువసార్లు పక్షవాతం వస్తే శారీరకంగా కొంత భాగం చచ్చుబడటమే కాదు, మానసికంగా విషయ గ్రహణ సమస్యలూ తలెత్తుతాయి. జ్ఞాపకశక్తి తగ్గిపోవటం, నిర్ణయాలు తీసుకోలేకపోతుండటం, సమస్యలను సరిగా అర్థం చేసుకోలేకపోతుండటం.. వీటివల్ల రోజువారీ పనులు కూడాకష్టంగా మారతాయి. క్రమేపీ ఇది జ్ఞాపకశక్తి లోపానికి (వాస్క్యులర్‌ డిమెన్షియా)నకు దారి తీస్తుంది. కాబట్టి ఈ పరిస్థితి రాకుండా నివారించుకునే ప్రయత్నం చేయటం, మళ్లీ మళ్లీ పక్షవాతం రాకుండా వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ పూర్తి జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం. పక్షవాతం బారినపడ్డ అందరికీ గుండె పరీక్షలు చేయటం తప్పనిసరి. ఎందుకంటే వీరిలో అప్పటికే గుండె సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది.

ఇవే హెచ్చరికలు..

  • ఉన్నట్టుండి ముఖం, చెయ్యి, కాలు మొద్దుబారుతున్నట్లు, ముఖ్యంగా ఒంట్లో ఒకవైపు బలహీనపడుతున్నట్టు, పట్టు తప్పుతున్నట్టు అనిపించినా...
  • ఉన్నట్టుండి మాట తడబడుతున్నట్టుగా, అంతా అయోమయంగా, అర్థం చేసుకోవటం కష్టంగా అనిపిస్తున్నా...
  • ఉన్నట్టుండి ఒక కన్ను లేదా రెండు కళ్లలో చూపు తగ్గినట్లనిపిస్తున్నా... ఉన్నట్టుండి నడక కష్టంగా తయారైనా, తల తిరుగుతున్నట్లు బ్యాలెన్స్‌ తప్పి పడిపోతున్నట్టు అనిపిస్తున్నా...
  • ఉన్నట్టుండి ప్రత్యేకించి కారణమేదీ లేకుండానే తీవ్రమైన తలనొప్పి ఆరంభమైనా..

అది పక్షవాతమేమో అని అనుమానించి తక్షణం వైద్యులను సంప్రదించటం అత్యవసరం

అనుకోని వైకల్యం

పక్షవాతం బారినపడ్డవారు సకాలంలో, సరైన చికిత్సతో ఆర్నెల్లలోపు చాలా వరకూ కోలుకుంటారు. ఆ తర్వాతా కోలుకోవటం నెమ్మదించినా అది కొనసాగుతూనే ఉంటుంది. పూర్తిగా కోలుకోవటానికి రెండేళ్లు పట్టొచ్చు. అరుదుగా కొందరు 5, 10 ఏళ్ల తర్వాతా కోలుకుంటారు. అయితే పక్షవాతం వల్ల చాలామందిలో.. మాట, నడక, చూపు, జ్ఞాపకాలు, ఆలోచనలు.. ఇలా ఏదో ఒక దాన్లో కొద్దిపాటి వైకల్యం మిగిలిపోవచ్చు. దెబ్బతిన్న అవయవాలతో పూర్తి సామర్థ్యంతో పనిచేయటం తక్కువ. ఎంతోకొంత లోపం కనబడుతూనే ఉంటుంది. ఈ దుష్ప్రభావాలను బాగా తగ్గించుకునేందుకు పునరావాస చికిత్స అత్యంత కీలకం. దీనిలో శరీరం బలహీనంగా ఉందా? మాట్లాడలేకపోతున్నారా? కదల్లేకపోతున్నారా? ఇలా ప్రత్యేక అంశాల మీద దృష్టిపెట్టి.. వాటిని పునరుద్ధరించేందుకు ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ వంటివి ప్రత్యేకంగా ఇస్తారు.

మినీ స్ట్రోక్స్‌

పక్షవాతం చాలా వరకూ మెదడులోని పెద్ద రక్తనాళాలు చిట్లడం లేదా వాటిల్లో పూడికలేర్పడి, రక్తం గడ్డకట్టటం వల్లనే వస్తుంది. అయితే ఇలాగే సన్నగా ఉండే సూక్ష్మ రక్తనాళాల్లో కూడా రక్తం గడ్డకట్టొచ్చు. ఇలా జరిగితే స్వల్ప పక్షవాతం (మైనర్‌/మినీ స్ట్రోక్‌) వస్తుంది.ఇలా స్వల్ప పక్షవాతం వచ్చినపుడు పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. కానీ ఇలాంటి చిన్నచిన్న స్ట్రోక్స్‌ ఒకదాని తర్వాత మరోటి వరుసగా వస్తుంటే- విషయ గ్రహణ శక్తి (కాగ్నిటివ్‌) గణనీయంగా తగ్గిపోతుంది. మెదడు సామర్థ్యం క్రమంగా సన్నగిల్లుతుంది. వరుసగా మైనర్‌ స్ట్రోక్స్‌ బారినపడ్డవారిలో నెమ్మదిగా ఆలోచనా ప్రక్రియ, జ్ఞాపకశక్తి, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతాయి.

నివారణను మించింది లేదు

పక్షవాతం బారినపడ్డ వారిలో 30శాతం మంది మాత్రమే తిరిగి ఉద్యోగాలు చేయటం, మామూలు జీవనం గడపగలుగుతారు. 30శాతం మంది పనులు చేయలేకపోవటమో, ఇతరుల మీద ఆధారపడటమో కనిపిస్తుంది. 10శాతం మంది పూర్తిగా మంచానికే అతుక్కుపోవొచ్చు. మిగతా 30శాతం మంది చనిపోయే అవకాశం ఉంటుంది. ఇదంతా ఎంత త్వరగా చికిత్స తీసుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి తొలి మూడు గంటల్లోపు ఇచ్చే ఇంజక్షన్‌ అన్నది పక్షవాతం దుష్ప్రభావాల నుంచి త్వరగా కోలుకునేట్లు చేసేదేగానీ.. మరణాలను నివారించగలిగింది కాదు. కాబట్టి అసలు పక్షవాతం బారినపడకుండా చూసుకోవటం అత్యవసరం. దీనికి హైబీపీ, కొలెస్ట్రాల్‌, మధుమేహాలను కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం, నిత్యవ్యాయామం, పొగమానెయ్యటం, గుండె జబ్బులుంటే వాటికి చికిత్స తీసుకోవటం.. చాలా చాలా అవసరం.

  • ఒంట్లో నీటి శాతం తగ్గినా (డీహైడ్రేషన్‌) పక్షవాతం రావొచ్చు. ముఖ్యంగా వృద్ధులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విరేచనాలు అవుతున్నప్పుడు ఒంట్లో నీరు తగ్గకుండా చూసుకోవాలి. ఎండాకాలంలో పక్షవాతం బారినపడేవారి సంఖ్య ఎక్కువ.

వైద్య నిపుణులు- డాక్టర్​ జై దీప్​ చౌదరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.