ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఇంటి నుంచి పని అనగానే గంటల తరబడి కంప్యూటర్‌కే అతుక్కుపోతున్నారు చాలామంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా గ్యాప్ లేకుండా పనిచేయడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఇలా నిరంతరాయంగా కూర్చొని పనిచేయడం వల్ల మానసిక సమస్యలే కాదు.. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు, రోగాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
ఎలాగో ఇంటి నుంచే పనిచేస్తున్నాం కదా అని ఆలస్యంగా నిద్రలేవడం, గబగబా తయారై కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఆదరాబాదరాగా ఏదో ఒకటి తినడం, ఇంకొందరైతే ఓ వేళా పాళా లేకుండా ఎప్పుడు చూసినా ఏదో ఒక చిరుతిండి నములుతూ ఉండడం, నిరంతరాయంగా కంప్యూటర్ స్క్రీన్‌కే కళ్లప్పగించడం, మధ్యమధ్యలో కాసేపైనా విరామం తీసుకోకపోవడం.. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్‌లో చాలామంది చేస్తోన్న పొరపాట్లివి. ఫలితంగా అటు మానసికంగా ఒత్తిడి ఎదురవడంతో పాటు శరీరానికి శ్రమ కరువై లేనిపోని అనారోగ్యాల బారిన పడుతున్నారు.
కంప్యూటర్ విజన్ సిండ్రోమ్
పనిలో పడిపోయి రోజంతా కంప్యూటర్‌కే కళ్లప్పగించేస్తే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం ఉంది. కళ్లు పొడిబారిపోవడం, కళ్లలో వాపు, ఎరుపెక్కడం, దురద, చూపు మందగించడం.. వంటివి ఈ సమస్య లక్షణాలు. ఇదే అలవాటు సుదీర్ఘకాలంగా కొనసాగిస్తే కంటి చూపుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
శరీరం వంగిపోతుంది!
శరీరానికి శ్రమ కలిగించకుండా, మధ్యమధ్యలో కాసేపైనా విరామం తీసుకోకుండా ఎక్కువ సమయం పాటు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల మెడ నొప్పి వేధిస్తుంది. అలాగే భుజాలు ముందుకు వంగినట్లుగా తయారై గూనిగా కనిపించే అవకాశం ఉంది. ఇది సుదీర్ఘకాలం పాటు కొనసాగితే మెడలు, భుజాలు, చేతులు, వెన్నెముక.. ఇలా ఒకదాని తర్వాత మరొక దానిపై ప్రతికూల ప్రభావం పడి శరీరాకృతి అదుపు తప్పుతుంది.
నిరంతరాయంగా టైప్ చేస్తున్నారా?
సుదీర్ఘకాలం పాటు కంప్యూటర్ ముందు కూర్చోవడమే కాదు.. నిరంతరాయంగా టైపింగ్ చేసినా చేతులు, మణికట్టు భాగాల్లోని కండరాలు, నరాలు డ్యామేజ్ అయి విపరీతమైన నొప్పి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇది శరీరంలోని ఇతర భాగాల ఆకృతిని కూడా దెబ్బతీస్తుంది.
జుట్టు రాలడం
‘డి’ విటమిన్‌ను లేలేత సూర్యకిరణాల నుంచి మన శరీరం గ్రహిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్లో నుంచి బయటికి కదలకుండా కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయడం వల్ల ఈ విటమిన్ లోపించి.. జుట్టు రాలిపోవడంతో కొత్త జుట్టు రావడానికి ఆటంకం ఏర్పడుతుంది. అలాగే విటమిన్ ‘డి’ లోపం వల్ల అలోపేసియా అనే సమస్య తలెత్తి అక్కడక్కడా జుట్టు పూర్తిగా ఊడిపోవడానికి కారణమవుతుంది.
కళ్ల కింద వలయాలు
ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్‌ను తదేకంగా చూడడం వల్ల కళ్లు అలసటకు గురవుతాయి. ఫలితంగా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.
నడుం నొప్పి
మన పనిలో భాగంగా మొబైల్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికాలను ఎక్కువ సమయం పాటు వినియోగించడం వల్ల మెడ, భుజాలు, ఇతర శారీరక భాగాలపై ఒత్తిడి పడుతుంది. అలాగే నడుం నొప్పి, కీళ్లు పట్టేయడం.. వంటి సమస్యలు కూడా అధికమవుతాయి.
ముఖంపై ముడతలు
వయసు పైబడే కొద్దీ చర్మం ముడతలు పడడం సహజం. అయితే మనం చేసే కొన్ని పొరపాట్లు, పాటించే అలవాట్ల వల్ల అవి ముందే వచ్చేస్తాయి. రోజంతా కంప్యూటర్‌పైనే పనిచేయడం, దాన్ని తదేకంగా చూడడం కూడా అందుకు ఓ కారణం. తద్వారా చిన్న వయసులోనే వయసు పైబడిన ఛాయలు మన ముఖంపై కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.
స్థూలకాయం
ఎక్కువ సమయం పాటు ఒకే చోట కూర్చోవడం, స్నాక్స్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం.. ఇవన్నీ దీర్ఘకాలం పాటు కొనసాగితే శరీరంలో కొవ్వు స్థాయులు పెరిగిపోతాయి. కాలక్రమేణా ఇది స్థూలకాయానికి దారితీస్తుంది. ఇంటి నుంచి పని చేసే వారిలో ఈ సమస్య అధికంగా ఉంటోంది. ఈ క్రమంలో పొట్ట, తొడలు, పిరుదులు, మడమలు.. తదితర భాగాల్లో దీని ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
చర్మం నిర్జీవంగా..!
ఎక్కువ సమయం పాటు ఇంట్లోనే కూర్చొని పనిచేయడం వల్ల మన శరీరానికి సూర్యరశ్మి తగలదు. తద్వారా ‘డి’, ‘బి-12’ విటమిన్లు లోపించి చర్మం పాలిపోయినట్లుగా, డల్‌గా, నిర్జీవంగా కనిపిస్తుంది.
ఒత్తిడి పెరిగిపోతుంది!
ఎక్కువ సమయం పాటు ఇతరులతో మాట్లాడకుండా ఒంటరిగా పనిచేసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. ఇది క్రమంగా రక్తపోటుకు దారితీస్తుంది. ఇక నిరంతరాయంగా పనిచేయడం వల్ల దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ఆస్కారం కూడా ఉంది.
ఇలా కాకూడదంటే ఏం చేయాలి?
శరీరానికి, మనసుకు ఎలాంటి శ్రమ కలిగించకుండా సుదీర్ఘకాలం పాటు ఇలా ఇంట్లో నుంచి పనిచేయడం వల్ల ఎన్నెన్ని అనారోగ్యాలు ఎదురవుతాయో తెలిసింది కదా! అయితే మరి, ఇవన్నీ తలెత్తకుండా శారీరక, మానసిక ఆరోగ్యం సొంతం చేసుకోవడానికి; ఉత్తమ పనితీరు కనబరచడానికి నిపుణులు కొన్ని సలహాలు అందిస్తున్నారు. అవేంటో చూద్దాం...* ఎక్కువ సమయం ఒకే చోట కూర్చొని పనిచేయడం కాకుండా ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ క్రమంలో వ్యాయామం చేయడం, మనసు పెట్టి తినడం, మధ్యమధ్యలో కాసేపు విరామాలు తీసుకోవడం.. ఇలాంటివన్నీ పాటించేలా ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం ఫాలో అయితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు.. అలాగే పనిలో నాణ్యత కూడా పెరుగుతుంది.
- ఆఫీస్‌లో పనిచేసేటప్పుడు సహోద్యోగులతో ముఖాముఖి చర్చలుంటాయి. కానీ ఇంటి నుంచి పనిచేసే క్రమంలో ఈ అవకాశం లేకపోవడంతో ఒత్తిడి పెరుగుతుంది. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా మధ్యమధ్యలో కొలీగ్స్‌తో చాట్ చేయడం, ఫోన్లో మాట్లాడడం వల్ల ఈ సమస్య ఉండదంటున్నారు నిపుణులు.
- ఎప్పుడు చూసినా పని పని అని కాకుండా ఇంటి ఆవరణలో లేదంటే బాగా గాలి ప్రసరించే ప్రదేశంలో రోజూ కాసేపు వ్యాయామం చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ క్రమంలో యోగాకూ ప్రాధాన్యమివ్వాలి. తద్వారా పనిచేసే క్రమంలో వేధించే మెడ నొప్పి, ఇతర శారీరక నొప్పులు తగ్గిపోతాయి. అలాగే మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
- పనిపై ఏకాగ్రత పెరిగేలా ఇంట్లోనే పని వాతావరణాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ క్రమంలో ఒక గదిని ఆఫీస్ క్యాబిన్‌గా మార్చుకోవాలి. ఆ అవకాశం లేని వారు తమకు నచ్చిన ప్రదేశంలో సిస్టమ్ సెటప్ చేసుకొని.. ఆ చుట్టూ ఇండోర్ ప్లాంట్స్ వంటి మనసుకు ఆహ్లాదాన్ని పంచే వస్తువులతో అలంకరించాలి.
- మధ్యమధ్యలో తీసుకునే విరామ సమయాన్ని మన మనసుకు నచ్చిన వాళ్లతో మాట్లాడడానికి, ప్రకృతితో గడపడానికి, చిన్నపాటి వ్యాయామాలు చేయడానికి కేటాయించడం వల్ల మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది. తద్వారా ఒత్తిడి తగ్గి పని మీద ఏకాగ్రత పెరుగుతుంది.
- పని మధ్యలో సహోద్యోగులతో ఆన్‌లైన్ మీటింగ్స్, ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకోవడం, ఉత్తమ పనితీరు కనబరిస్తే ప్రశంసించడం.. వంటి చిట్కాలు కూడా ఉద్యోగులు నాణ్యమైన పనితీరు కనబరిచేందుకు దోహదం చేస్తాయి. అలాగే కొలీగ్స్ మధ్య సత్సంబంధాలు నెలకొనేందుకు తోడ్పడతాయి.
సో.. ఇవండీ.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే క్రమంలో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలు, జాగ్రత్తలు! మరి, మనమూ వీటిని దృష్టిలో ఉంచుకొని చక్కగా ఇంటి నుంచే పనిచేద్దాం.. నాణ్యమైన పనితీరును కనబరుద్దాం..!
ఇదీ చూడండి: అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత