Best Tips for Cracked Heels in Telugu : వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు.. ప్రతి ఒక్కరినీ చర్మ సంబంధింత సమస్యలు ఇబ్బందిపెడతాయి. ఇలాంటి వాటిల్లో పాదాల పగుళ్లు ఒకటి. ఈ సమస్య చాలా మందిలో తీవ్రంగా ఉంటుంది. ఇవి చూడటానికి బాగుండకపోవడం ఒకెత్తయితే.. కొందరికి నడుస్తుంటేనే నొప్పిగా ఉంటాయి. చివరకు.. రాత్రి పడుకునేముందు బెడ్ షీట్స్ కప్పుకొంటున్నా.. ఇబ్బందిపెడతాయి. ఈ సమస్యతో బాధపడుతున్న మహిళలు.. నలుగురిలోకి వెళ్లాలన్నా ఇబ్బందిగా ఫీలవుతుంటారు.
పాదాలను సరిగ్గా క్లీన్ చేయకపోవడం, చర్మంపై తేమ త్వరగా ఆరిపోవడం, శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం వంటికారణాలతోపాటు ఊబకాయం కూడా ఈ సమస్యకు కారణమవుతుంది. ముఖ్యంగా.. మట్టిలో ఎక్కువగా తిరిగే వారిని ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. ఇప్పటికే ఈ సమస్య ఉన్నవారు.. చలికాలంలో మరింత ఇబ్బంది పడతారు. మరి.. ఈ సమస్య నుంచి సహజ నివారణ చిట్కాల(Best Tips) ద్వారానే ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం.
చలికాలంలో అలర్జీ ఎందుకు మరింత ఎక్కువవుతుందో తెలుసా?
- పాదాల పగుళ్లకి ముఖ్య కారణం.. పాదాలపై మురికి చేరడంతోపాటు పొడి బారడమే.
- కాబట్టి.. రోజూ పాదాలను శుభ్రంగా కడిగి, మృదువైన వస్త్రంతో తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి.
- ఓ టబ్‌లో పాదాలు మునిగేంత వరకు గోరు వెచ్చని నీళ్లు నింపి, రెండు చెంచాల తేనె వేసి, పాదాలను అందులో ఉంచాలి.
- పది నిమిషాల తర్వాత పగిలిన ప్రాంతాన్ని మృదువుగా రుద్దాలి. ఇది సహజసిద్ధ మాయిశ్చరైజర్‌లా పని చేయడమే కాదు, బ్యాక్టీరియానూ దూరం చేస్తుంది.
- గోరు వెచ్చని నీళ్లలో గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్ కలిపి అందులో పాదాలను ఉంచి.. చక్కగా క్లీన్ చేస్తే పగుళ్లు మాయమవుతాయి.
- అరటిపండును గుజ్జులా చేసుకొని.. పాదాలపై పగుళ్లు ఉన్న చోట రాసినా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది.
- పాదాల పగుళ్లు తగ్గించుకోవడానికి.. నువ్వుల నూనెలో కాస్త గ్లిజరిన్ కలిపి పాదాలకు మసాజ్ చేయాలి. ఇలా నిత్యం చేయడం ద్వారా మీ పాదాలు కోమలంగా తయారవుతాయి.
- కొబ్బరి నూనెలో హారతి కర్పూరం, పసుపు కలిపి పాదాలకు అప్లై చేసినా బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది. తరచూ ఇలా చేయడం ద్వారా పాదాలు పగుళ్లు తగ్గడమే కాకుండా చాలా మృదువుగా మారతాయి.
- పెరుగు, వెనిగర్ మిశ్రమంతో పాదాలకు, మడమలకు తరచూ మసాజ్ చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
- అదేవిధంగా హ్యాండ్ క్రీమ్, నిమ్మరసం కలిపి పాదాలకు రాసినా పగుళ్లు తగ్గుతాయి.
- రోజ్ వాటర్‌లో గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు మర్దన చేసినా కూడా పగుళ్లు ఈజీగా తగ్గిపోతాయి.
- ఇలా పైన పేర్కొన్న చిట్కాల్లో ఏదో ఒకటి క్రమం తప్పకుండా పాటిస్తే కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం మీకు కనిపిస్తుంది.
మొటిమల సమస్య - ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి!
చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? - ఈ టిప్‌తో మీ జుట్టు నిగనిగలాడిపోద్ది!