Belly Fat Effects On Health In Telugu : ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, నిద్రలేమి.. కారణమేదైనా చిన్న వయసులోనే అందరినీ వేధిస్తున్న సమస్య పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం. ఇది ఆనారోగ్యానికి కారణం అవుతుంది. అలాగే చూడడానికి కూడా అందవిహీనంగా కనిపించేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో పెరిగిన పొట్టను తగ్గించుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి? పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదలైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కిల్లర్ ఫ్యాట్‌తో కష్టమే
Causes of belly fat : వయసు పెరిగే కొద్దీ పొట్ట కూడా పెరగడం అనేది సర్వసాధారణం. ఇది పురుషుల కంటే స్త్రీలకు పెద్ద సమస్యగానే పరిణమిస్తుందని చెప్పొచ్చు. శరీరంలో మిగతా భాగాల్లో ఏర్పడిన కొవ్వు వల్ల గుండె జబ్బులు, షుగర్‌తో పాటు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే జీవనశైలిలో మార్పులతో పాటు కొన్ని రకాల వ్యాయామాలు తప్పనిసరి. వయసు పెరిగే కొద్దీ కిల్లర్ ఫ్యాట్‌గా పిలుచుకునే కొవ్వు నడుము చుట్టూ చేరుతుంది. ఈ అదనంగా చేరే కొవ్వు ఆరోగ్యానికి చాలా హానికరమని పలు అధ్యయనాల్లో నిరూపితమైంది.
Belly fat health problems : సాధారణంగా వయసు పెరిగే కొద్దీ జీవక్రియలు నెమ్మదిగా మందగిస్తూ ఉంటాయి. దీని వల్ల శరీరంలో కొవ్వు మోతాదు క్రమంగా పెరుగుతూ వస్తుంది. స్త్రీలలో మెనోపాజ్ అనంతరం చేతులు, కాళ్లు, తొడల వద్ద కొవ్వు తగ్గి.. పొట్ట వద్ద పేరుకుపోవడం మొదలువుతుంది. కొందరిలో ఈ పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు వంశపారంపర్యంగా రావచ్చు. మరికొందరిలో రుతుక్రమం ఆగిన తర్వాత కలిగే హార్మోన్ల మార్పు కూడా పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోవడానికి కారణం అవుతుంది.
Effects Of Waist Size on Your Health : 'పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. సెంట్రల్ ఒబీసిటీ వల్ల మధుమేహం, రక్తపోటు, కొవ్వుల శాతం అధికంగా ఉండటం, నిద్రలో గురక రావడం లాంటి సమస్యలు వస్తాయి. మనం వేసుకున్న బట్టలు చాలా టైట్ అవుతున్నా, వాటి వల్ల ఉబ్బరంగా, ఆయాసంగా అనిపించినా బరువు పెరిగామని గ్రహించాలి. సెంట్రల్ ఒబీసిటీ తగ్గాలంటే తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. తరచూ శారీరక కసరత్తులు చేస్తూ ఉండాలి. మధుమేహం లేదా ఇతర వ్యాధులతో బాధపడేవారు సంబంధిత మందులను సమయానికి వేసుకోవాలి. అలాగే తరచూ హెల్త్ చెకప్ చేయించుకోవాలి' అని ప్రముఖ డాక్టర్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ టి. లక్ష్మీకాంత్ తెలిపారు.
వీటికి బైబై చెప్పేయండి
Fat Control Diet : చక్కెర ఎక్కువ తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరిగే అవకాశం ఉంది. కనుక పొట్ట చుట్టూ కొవ్వును పెంచే మిఠాయిలు, తీపి వంటకాలకు సాధ్యమైంత వరకు దూరంగా ఉండటం మంచిది. పరోటాలు, పూరీలు, దోసెలు లాంటి వాటిని కాకుండా మరింత ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. అల్పాహారాన్ని ఎప్పుడూ మానకూడదు. ఒత్తిడి కడుపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. నిర్విరామంగా కదలకుండా పనిచేస్తే పొట్ట భాగంలో కొవ్వు పెరిగే అవకాశం ఉంది. కనుక మధ్యలో విరామం తీసుకోవడం, వీలైతే నడవడం మంచిది. సాధ్యమైనంత వరకు టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. అలాగే బెల్లం టీ కూడా అతిగా తాగకూడదు. పొట్ట తగ్గాలంటే వేపుళ్లకు దూరంగా ఉండాలి.
భోజనంలో ఇవి తప్పనిసరి
Fat Control Exercise : సెంట్రల్ ఒబీసిటీ తగ్గాలంటే మంచి డైట్‌ను పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ ఫ్యాట్‌ను తగ్గించేందుకు కండరాలను పెంచడం అత్యుత్తమమైనదిగా నిపుణులు చెబుతున్నారు. మజిల్స్ పెంచుకోవడం ద్వారా ఎక్కువ క్యాలరీలను కరిగించుకోవచ్చు. నడుము చుట్టుకొలత సుమారు 35 అంగుళాలు ఉంటే అదుపులోనే ఉన్నట్లు లెక్క. ఆ సైజుకు మించితే అనారోగ్యకరమైన కొవ్వు పేరుకున్నట్లుగా భావించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించేందుకు గుడ్లు, గ్రీన్ టీ, సిట్రస్ పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు మొదలైనవి ఎంతగానో సాయపడతాయి. మంచి ఆహారాన్ని తీసుకుంటూ, వ్యాయామం చేసినా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గకపోతే బేరియాటిక్ సర్జరీ చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.