Ayurvedic Items must have in travelling : సుదూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు.. అన్ని వస్తువులూ ఉన్నాయో లేదో అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారు. లగేజీ గట్టిగా సర్దేస్తారు. కానీ.. అక్కడ ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే పరిస్థితి ఏంటి? అనే ఆలోచన రానేరాదు. ఎందుకంటే.. ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాం కదా అనుకుంటారు. కానీ.. పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు. ఊరు మారితే.. తాగే నీళ్లు మారితేనే కొందరికి జలుబు చేస్తుంది. అలాంటిది.. సుదీర్ఘంగా ప్రయాణం చేస్తున్నప్పుడు పలు సమస్యలు ఎదురుకావొచ్చు.
చాలా మంది ఉద్యోగ పని మీదనో, తీర్థయాత్రలకు వెళ్లడం కోసమో.. టూర్ కోసమే.. ప్రయాణాలను చేస్తుంటారు. ఇలా దూర ప్రాంతాలకు చేసే ప్రయాణంలో అలసట వేధిస్తుంది. ఇంకా కదలకుండా కూర్చోవడం వల్ల.. ఆహారం జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇంకొంత మందికి కడుపులో వికారంగా ఉండటం.. వాంతులు వచ్చినట్టుగా అనిపించడం వంటివి ఉంటాయి. ఇలాంటి కారణాలతో జర్నీ మూడ్ అంతా ఆఫ్ అయిపోతుంది.
అయితే.. ఏ సమస్య వస్తుందో తెలియదు కాబట్టి.. ఇంగ్లీష్ మందులు తీసుకెళ్లలేం. అందుకే.. కొన్ని ఆయుర్వేద వస్తువులకు మీ బ్యాగులో చోటిస్తే చాలు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా.. జాలీగా మీ ప్రయాణం కొనసాగించవచ్చు. మరి ఆ వస్తువులు ఏంటి..? వాటి వల్ల కలిగే ఉపయోగాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అజీర్తి తగ్గడానికి : త్రిఫల, అల్లం
త్రిఫల చూర్ణం మూడు పండ్లను కలిపి తయారు చేస్తారు. అవి ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ. త్రిఫల చూర్ణం.. తరచూ వేధించే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఇవ్వడమే కాకుండా.. అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. ఈ చూర్ణంలో యాంటీ ఏజింగ్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. మీ ప్రయాణంలో వికారంగా అనిపించినప్పుడు.. కొంచెం అల్లం తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
హ్యాంగోవర్‌కు ఆయుర్వేదంతో చెక్!
మెరుగైన రోగనిరోధక శక్తిని పెంచే అశ్వగంధ, తులసి
ఆయుర్వేదంలో అశ్వగంధకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒత్తిడి వల్ల కలిగే నిద్రలేమి సమస్యలకు, కండరాల నొప్పుల నివారణకు అశ్వగంధ మంచి ఔషధమని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడం ద్వారా రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అశ్వగంధను "ఇండియన్ జిన్సెంగ్" అని పిలుస్తారు. అశ్వగంధ మంచి నిద్రను, కండరాలకు శక్తిని అందిస్తుంది. తులసి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు, వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.
ఒత్తిడికి మందు.. బ్రహ్మి
దూర ప్రయాణాల వల్ల మానసిక ఒత్తిడి కలుగుతుంది. ఆయుర్వేద మూలికైన బ్రహ్మి.. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒత్తిడిని కలిగించే సంబంధం ఉన్న హార్మోన్‌లను నియంత్రించి, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఇది మెదడు చురుగ్గా పనిచేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ బ్రహ్మి ఆకుల్లో బాకోసైడ్లు అనే బయో కెమికల్స్ ఉంటాయి. మెదడు కణజాలాలను తిరిగి నిర్మించడంలో సహాయపడుతుంది. వీటిని వెంట తీసుకెళ్లడం ద్వారా.. ప్రయాణంలో ఎదురయ్యే అవాంతరాలను తేలిగ్గా అధిగమించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.