ఆహారమే ఔషధం. ఆహార నియమాలు పాటిస్తే చాలావరకు సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు. ఉప్పు తగ్గిస్తే రక్తపోటు, పిండి పదార్థాలు తగ్గిస్తే మధుమేహం నియంత్రణలో ఉంటాయని తెలుసు. కొన్ని జాగ్రత్తలతో నొప్పులనూ.. ముఖ్యంగా కీళ్లనొప్పులను తగ్గించుకోవచ్చన్నది నిపుణుల సూచన.
* ఒమేగా- 3 కొవ్వు ఆమ్లాల వంటి పాలీ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికే కాదు. వాపు నివారణకూ తోడ్పడతాయి. కీళ్లవాతం బాధితుల్లో నొప్పి తగ్గటానికి అవి ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయి. సాల్మన్ రకం చేపలు, అవిసె గింజలు, ఆలివ్ నూనె వంటి వాటిల్లో ఇలాంటి కొవ్వు ఆమ్లాలు దండిగా ఉంటాయి.
* ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల మాదిరిగానే క్యాబేజీ, చిన్న క్యాబేజీ (బ్రసెల్స్ స్ప్రౌట్స్), గోబీ పువ్వు వంటి కూరగాయలూ వాపును తగ్గిస్తాయి. వీటిల్లో వాపును నివారించే గుణాలతో పాటు విటమిన్ సి కూడా ఎక్కువే. ఇదీ కీళ్లవాతం తగ్గటానికి దోహదం చేస్తుంది.
* వాపును ప్రేరేపించే పదార్థాలకు దూరంగా ఉండటమూ అలవరచుకోవాలి. మాంసంలో ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ. ఇవి వాపును ప్రేరేపిస్తాయి. వీలైనంత వరకు మాంసం తగ్గించటం మంచిది. చిక్కుళ్లు, పప్పులు, వేరుశనగలు, టమోటాలు, బంగాళాదుంపల్లో లెక్టిన్లు ఎక్కువ. వాపును ప్రేరేపించే వీటిని మితంగా తీసుకోవటం మేలు. శీతల పానీయాలు, పండ్ల రసాలు, మిఠాయిల వంటివి వాపు ఎక్కువయ్యేలా చేస్తాయి. అందుకే వీటికి దూరంగా ఉండటం ఉత్తమం.
* ఆహార నియమాలకు వ్యాయామం తోడైతే మరింత మేలు చేస్తుంది. కీళ్లు అరిగిపోయినవారు, ఊబకాయం గలవారు వీటిని పాటిస్తే కీళ్లపై ఒత్తిడి తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల కీళ్ల మీద అంతగా భారం పడని ఈత వంటి వ్యాయామాలతో పాటు ఆహార నియమాలు పాటిస్తుంటే నొప్పులతో ఇబ్బందులు లేకుండా హాయిగా జీవనం సాగించవచ్చు.
ఇవీ చదవండి: