సాధారణంగా కుంకుమ పువ్వు అనగానే మనకు ముందుగా గర్భిణులే గుర్తుకొస్తారు. కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగితే పిల్లలు అందంగా, మంచి రంగుతో పుడతారని చాలామంది నమ్మకం. మరికొంతమంది.. కుంకుమ పువ్వు తింటే పిల్లలు ఎరుపురంగులో పుడతారని అంటారు. అంతేకాకుండా మగపిల్లలు పుట్టాలంటే ఏమైనా మార్గాలున్నాయా అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి ప్రశ్నలకు నిపుణులు డా.సమరం సమాధానాలిచ్చారు. వాటిని ఓ సారి తెలుసుకుందాం.
కుంకుమ పువ్వు తింటే పిల్లలు ఎర్రరంగులో పుడతారా?
డా.సమరం: మనం తినే ఆహారం బట్టి పిల్లల రంగులో ఎలాంటి మార్పు రాదు. కేవలం భార్యాభర్తల జీన్స్పైనే పిల్లల రంగు ఆధారపడి ఉంటుంది. కశ్మీర్ నుంచి తెచ్చిన కుంకుమ పువ్వు తిన్నంత మాత్రాన పిల్లలు ఎరుపు రంగులో పుట్టరు.
మగ పిల్లలు పుట్టాలంటే ఏమైనా మార్గాలున్నాయా?
డా.సమరం: అలాంటి మార్గాలు ఏం లేవు. మగవారి వీర్యంలో ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్ వీర్య కణాలు ఉంటాయి. మహిళ అండంతో ఎక్స్ క్రోమోజోమ్ కలిసినప్పుడు మాత్రమే మగ పిల్లవాడు పుడతాడు.
పిండం నిర్మాణంలో జీన్స్ మార్పిడితో మగ పిల్లవాడిని ఆడ పిల్లగా మార్చవచ్చా?
డా.సమరం: ప్రస్తుతం జెనిటిక్ ఇంజినీరింగ్ వచ్చింది. దానితో మగ పిల్లవాడిని ఆడపిల్లగా మార్పు చేయవచ్చు. కానీ అది పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకు సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇది జరగవచ్చు.
లూప్ వాడితే పూర్తిగా గర్భం రాకుండా ఉంటుందా?
డా.సమరం: లూప్ అంటేనే గర్భం రాకుండా ఉండడానికి వాడతారు. పెళ్లి కాకుండానే ఎవరైనా లూప్ వేయించుకోవచ్చు. అయితే లూప్ తీసిన వెంటనే మళ్లీ గర్భం వస్తుంది.
పెళ్లి కాని వారు గర్భ నిరోధక మాత్రలు వాడవచ్చా?
డా. సమరం: పెళ్లి కాని వారు గర్భ నిరోధక మాత్రలు వాడవచ్చు. దాని వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మాత్రలు వాడడం మానేసిన రెండు నెలలకే గర్భం వస్తుంది. చాలా మంది పెళ్లి కాని అమ్మాయిలు.. నెలసరి సమస్యలు తగ్గడానికి వాడే మాత్రల్లో కూడా గర్భ నిరోధక మాత్రల మెడికల్ కాంబినేషన్ ఉంటుంది. కాబట్టి గర్భ నిరోధక మాత్రలను నిరభ్యంతరంగా వాడొచ్చు.