దేశంలో జనాభా పెరుగుతున్న కొద్ది, రోజు వారి ఆహార పదార్థాల వినియోగమూ అంతే స్థాయిలో పెరుగుతోంది. ఇదే ఆసరాగా కల్తీ మాయగాళ్లు.. అన్ని పదార్థాలను విషమయం చేస్తున్నారు. ఎవరూ ఊహించని పద్ధతుల్లో ఆహార పదార్థాలు కల్తీ చేస్తూ... ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. పసివాళ్లకు పట్టే పాల నుంచి నీళ్లు, పండ్లు, కూరగాయలు, తేనే, వంట నూనె సహా... లెక్కలేనన్ని పదార్థాలు ఉన్నాయి. పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనా... విక్రయిస్తున్న ప్రజలను ఈ వార్తలు కంగారు పెట్టిస్తున్నాయి. కల్తీ పదార్థాలు తీసుకోవడం వల్ల ప్రజల్లో తక్షణం ఎటువంటి చెడు ప్రభావాలు కనిపించకపోయినా దీర్ఘకాలంలో మాత్రం తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు.
68.7% పాలు కల్తీయే
దేశంలో విక్రయిస్తున్న పాలు, పాల సంబంధ ఉత్పత్తుల్లో 68.7% నిర్దేశిత ప్రమాణాలకు తగ్గట్టు లేవవు సాక్షాత్తూ భారత రక్షిత ఆహార ప్రమాణాల సంస్థే వెల్లడించింది. ఇందుకు ప్యాకేజింగ్ సమయంలో రసాయనాలు వాడడం, పాలను నింపే క్యాన్లను డిటర్జెంట్లతో కడగడం వల్ల కలుషితాలు చేరుతున్నాయి. పాలు చిక్కగా కనబడడం కోసం, ఎక్కువ కాలం విరిగిపోకుండా ఉండేందుకు యూరియా, గంజి పౌడరు, గ్లూకోజ్, ఫార్మాలిన్ వంటి రసాయనాలను కలుపుతున్నారు మరికొందరు కేటుగాళ్లు.
ఆ పాలతో కేన్సర్ వ్యాధి
పాలు పితికేటప్పడు శుభ్రత పాటించకపోవడం.. అపరిశుభ్ర పాత్రల్లో పాలు నింపడం కలుషితమవుతున్నాయి. పట్టణ, నగర ప్రాంతాల్లో పాలకు విపరీత డిమాండ్ ఉన్న చోట డెయిరీ ఫామ్ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పాల దిగుబడి పెంచేందుకు నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజక్షన్ ఇస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల 2సార్లు ఆ హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తూ అధికపాల ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల గేదెలు సాధారణం కంటే 3రెట్లు పాలు ఇస్తుంటాయి. కానీ ఆ ఇంజక్షన్ల రసాయన అవశేషాలు పాలల్లో చేరడంతో పాటు... పశువులపై దీర్ఘ కాలంలో తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. ఎక్కువపాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంలో దాణా, వాటికి అందించే నీటిలో వివిధ రసాయన పదార్థాలను కలపడంతో.. అవ్వన్నీ పాలల్లోకి చేరుతున్నాయి. ఇలాంటి వాటిని నివారించకపోతే 2025 నాటికి దేశంలోని 87%మంది కేన్సర్ వంటి తీవ్ర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
నీటిలోనూ కల్తీయే
పెరిగిపోతున్న పారిశ్రామికీకరణతో ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు కూడా అందడం లేదు. ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న పరిశ్రమలు.. పెద్ద ఎత్తున నీటిని వినియోగిస్తుండగా.. వాటిలో ఎన్నో రసాయ అవశేషాలు కలుస్తుంటాయి. వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో శుద్ధి చేసి, తొలగించాల్సి ఉంటుంది. కానీ... భారీగా ఖర్చు పెట్టాల్సి రావడంతో అక్రమంగా నదులు, కాలువలు, స్థానిక చెరువుల్లోకి విడిచిపెడుతున్నారు. బోరుబావుల్లోకి పరిశ్రమ వ్యర్థ నీటిని విడిచిపెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పండ్లలోనూ రసాయనాలు
దేశంలో శుద్ధి చేసిన తాగు నీరు చాలా తక్కువ మందికే అందుతోంది. నదులు, చెరవుల్లోని ప్రమాదకర భార ఖనిజాల వల్ల.. ఈ నీటితో సాగు చేస్తున్న కూరగాయలు, పండ్లల్లోకి రసాయనాలు ప్రవేశిస్తున్నాయి. అదనంగా.. పండ్ల విక్రయాలు జరిపే చోట పండ్లపైకి రసాయ అవశేషాలు చేరుతున్నాయి. ఎక్కువకాలం నిల్వ చేసేందుకు, త్వరగా పక్వానికి వచ్చేలా చేసేందుకు ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తుంటారు.
తేనె కహానీ..
ఇటీవల వెలుగులోకి వచ్చిన తేనె కల్తీ వార్తలు అందరినీ కలవరపెడుతున్నాయి. ఆరోగ్యానికి మంచిదని రోజు తేనె తీసుకునే వాళ్లు చాలా మంది ఉంటుండగా.. కరోనా సమయంలో అది మరింత పెరిగింది. కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన శాస్త్రీయ, పర్యావరణ సంస్థ- సీఎస్‌ఈ చేసిన పరిశోధనలో తేనె కల్తీ చేస్తున్నారనే విషయం బయటపడింది.
ప్రముఖ సంస్థలు కూడా..
దేశంలో తేనె నమూనాలను మొదటిగా గుజరాత్‌లోని డెయిరీ డెవల్‌పమెంట్ బోర్డు -ఎన్‌డీడీబీ కి చెందిన సెంటర్ ఫర్ ఎనాలసిస్ అండ్ లర్నింగ్ ఇన్ లైవ్స్‌స్టాక్ అండ్ ఫుడ్ - సీఏఎల్‌ఎఫ్ లో పరీక్షించారు. ఈ ప్రాథమిక పరీక్షల్లో సానుకూల ఫలితాలే రాగా.. జర్మనీలోని అత్యధునిక న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిసోనెన్స్ పరీక్షల్లో తేనె కల్తీ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో అనామక సంస్థలే కాక ప్రముఖ సంస్థలూ ఉన్నాయని తెలిపింది.
నూనెనూ వదలట్లేదు..
నిత్యం వంటల్లో వాడే నూనెనూ మరీ ప్రమాదకరంగా కల్తీ చేస్తుంటారు. చనిపోయిన జంతు కళేబరాల నుంచి నూనె తీసి మంచినూనెలో కలిపి విక్రయిస్తుంటారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో దొంగమార్గంలో మార్కెట్లోకి ప్రవేశపెట్టి.. జేబులు నింపుకుంటారు. ఇలా చేయడం వల్ల తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే అత్యాశాపరుల వల్ల ప్రజల ఆరోగ్యాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇక వీటితో పాటే... కారం, పసుపు, వెల్లుల్లి పేస్టు ఇలా ఎన్నోనిత్యం వంటల్లో వాడే ఆహార పదార్ధాలు కల్తీ బారిన పడుతున్నాయి.
- ఇదీ చూడండి : కరోనాకు తోడైన కల్తీ.. ప్రమాదకరంగా ఆహారం