ఈ వేసవిలో భానుడు భగభగమంటూ నిప్పులు కక్కుతున్నాడు. మరోవైపు కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో చాలా మంది 'వర్క్ ఫ్రమ్ హోంకు' పరిమితమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఎక్కువగా ఉండే బద్దకం, బలహీనత, నిద్రమత్తు వంటి సమస్యలను అధిగమించడానికి.. శరీరాన్ని ఎప్పటికప్పుడు డీ హైడ్రేట్ (నిర్జలీకరణ) కాకుండా చూసుకోవాలి. అందుకు మీరు తగినంత నీరు తీసుకుంటున్నారా? పనిలో పడిపోయి రోజు మొత్తంలో మీ శరీరానికి అవసరమైన నీరు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారా? అయితే ఈ 8 చిట్కాలు పాటించండి చాలు. డీ హైడ్రేషన్ ఎప్పటికీ మీ దరిచేరదు. రోజంతా చురుగ్గా పని చేసుకోవచ్చు.
అవసరాలను అర్థం చేసుకోండి..
మీ శరీరానికి కావాల్సిన ద్రవాల అవసరాలను మొదట అర్థం చేసుకోవాలి. ఒక రోజులో ఎంత శాతం నీరు తీసుకోవాలన్న విషయంపై కొన్నేళ్లుగా చాలామంది పలు సూచనలు చేస్తున్నారు. అయితే, మీరు చేసే పని, ఉంటున్న ప్రాంతం, ఆరోగ్య పరిస్థితులు వంటి వివిధ అంశాలు.. మీకు ఎంత మేరకు నీరు అవసరమో నిర్ణయిస్తాయి. ఒకవేళ మీరు వేడి వాతావరణంలో నివసిస్తూ, క్రమం తప్పకుండా పని చేస్తుంటే ఎక్కువ శాతం నీరు తీసుకోవడం ఎంతో అవసరం.
లక్ష్యాన్ని నిర్దేశించుకోండి..
రోజూ శరీరానికి సరిపడా నీరు తాగే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల మిమ్మల్ని మీరు ప్రేరేపించుకుంటూ.. కొద్ది రోజులకు అధిక స్థాయిలో నీరు తీసుకోగలుగుతారు. టార్గెట్ నిర్దేశించుకుంటే ఆచరణలో పెట్టాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలరు.
రిమైండర్ ఉపయోగించండి
ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ యుగంలో.. రిమైండర్లు పెట్టుకోవడం ఎంతో తేలిక. ప్రతి 30 నిమిషాలకు లేదా గంటకు ఒకసారి నీరు తాగాలనే విషయం గుర్తొచ్చేలా.. మీ గడియారం, స్మార్ట్‌వాచ్‌ల్లో టైమర్‌ను సెట్ చేసుకోవాలి. అందుకు సంబంధించిన ఎన్నో అప్లికేషన్లు ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.
పానీయాలు వద్దు...
దాహాన్ని తీర్చుకోవడానికి చాలామంది శీతల పానీయాలను సేవిస్తుంటారు. వాటి స్థానంలో నీరు తాగడం వల్ల కేలరీలు తగ్గడమే కాకుండా, ఆరోగ్యంగా కూడా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు.
వాటర్ బాటిల్ ఉంటే..
మీకంటూ ప్రత్యేకంగా ఓ వాటర్ బాటిల్‌ను ఉపయోగించడం ఎంతో ఉత్తమమైన పని. ఇల్లు, ఆఫీసు, ప్రయాణాలు ఇలా ఎక్కడికెళ్లినా బాటిల్‌ను వెంటబెట్టుకోండి. మీ కళ్ల ముందు అది ఉన్నంతసేపూ ఓ రిమైండర్‌గా ఉపయోగపడుతుంది.
భోజనానికి ముందు...
భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు తాగడం.. మీ శరీరంలో నీటి విలువ స్థాయి పెరిగేందుకు మరో మార్గం. కొన్ని సార్లు మన శరీరం దాహానికి, ఆకలికి మధ్య సతమతమవుతుంది. ఫలితంగా అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలను తీసుకుంటారు. కాబట్టి, తినే ముందు నీరు సేవించడం వల్ల మీరు ఆకలితో ఉన్నారా? లేక దాహం వేస్తోందా? అన్నది తెలుసుకోవచ్చు.
రుచికరమైన నీరు..
ఒక వేళ నీళ్లు రుచిగా లేవనే కారణంగా మీరు తక్కువగా తీసుకుంటుంటే.. అందుకూ చక్కటి పరిష్కారం ఉంది. మార్కెట్లో దొరికే ఫ్రూట్ ఫ్లేవర్స్‌ను నీటిలో కలుపుకోవచ్చు. ఇవి పెద్దగా ఖరీదు కూడా ఉండవు. అయితే వీటిలో కృత్రిమంగా తయారయ్యే ఫ్లేవర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఇవి ఆరోగ్యానికి హానికరం.
ఆ ఆహారం తీసుకోవాలి...
డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకోవాలంటే.. నీటిశాతం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే చాలు. పుచ్చకాయలు, స్ట్రాబెర్రీ, దోసకాయ, టొమాటో, క్యాబేజీ వంటి వివిధ రకాల పండ్లు, కూరగాయల్లో పుష్కలంగా నీరు లభిస్తుంది.
ఈ చిట్కాలన్నీ పాటిస్తే డీ హైడ్రేషన్ బారి నుంచి బయటపడటమే కాక, ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారు. పొడి చర్మం, శరీర దుర్వాసన వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.