కరోనా కల్లోలిత కాలమిది. మనిషీ మనిషీ దగ్గరగా మెలిగితే వైరస్ వ్యాపిస్తోంది. ఆరడుగులు... అంతకు మించి దూరం పాటిస్తే మహమ్మారితో ఎలాంటి నష్టమూ కలగదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నిబంధన అమలుతో సానుకూల ఫలితాలూ కనిపిస్తున్నాయి.
అయితే జీవిత భాగస్వామితోనూ కలిసి ఉండకూడదా? వైరస్ విజృంభిస్తున్న తరుణంలో శృంగారంలో పాల్గొనవచ్చా... కూడదా? ఒకవేళ పాల్గొంటే వైరస్ సోకుతుందా? అలా సోకకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సందేహాలు ఎందరినో పీడిస్తున్నాయి. వీటికి సమాధానాలుగా వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఎలాంటి జాగ్రత్తలు చెబుతున్నారు? ఏం సూచిస్తున్నారో చూద్దాం.. తెలుసుకోవడం ముఖ్యం
- తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, ఊపిరి వదిలినప్పుడు... నోరు, ముక్కు నుంచి బయటకు వచ్చే తుంపర్ల ద్వారానే కరోనా వ్యాపిస్తుంది.
- కరోనా శృంగారం వల్ల వచ్చే వ్యాధి కాదు. ఒకవేళ భాగస్వామికి వైరస్ లక్షణాలుంటే... శృంగారం జరిపేటప్పుడు వారితో సాన్నిహిత్యంగా మెలగడం, ముద్దులు పెట్టుకోవడం వల్ల మీకూ కరోనా వ్యాపిస్తుంది.
- కరోనా సోకినవారి లైంగిక స్రావాల్లో వైరస్ ఆనవాళ్లు లేవని కొన్ని పరీక్షల్లో తేలింది. మరి కొందరు పరిశోధకులు నిర్వహించిన పరీక్షల్లో ఉన్నట్లు వెల్లడైంది. శృంగార సమయంలో వెలువడే వీర్యం, యోని స్రావాల వల్ల కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదనే విషయంలో స్పష్టత లేదు.
- లాలాజలం వల్ల, తుంపర్ల ద్వారానే వైరస్ వ్యాపిస్తుంది కాబట్టి ముద్దులు వద్దే వద్దు.
ఏం చేయవచ్చు... ఏం చేయకూడదు
- జీవిత భాగస్వామితో తప్ప ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ శృంగారంలో పాల్గొన కూడదు.
- వేరేప్రాంతాల్లో ఉండి వచ్చినవారు కాకుండా.. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్న వారై... ఇద్దరిలోనూ కరోనా లక్షణాలు లేకపోతే నిరభ్యంతరంగా శృంగారంలో పాల్గొనవచ్చు.
- జీవిత భాగస్వామికి కరోనా సోకి... దగ్గు, జ్వరంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటే శృంగారంలో పాల్గొనకూడదు. ఆ సమయంలో మీకూ కరోనా సోకే అవకాశాలు పెరుగుతాయి. దానికి తోడు భాగస్వామి మరింత అలసటకు గురై పరిస్థితి విషమించొచ్చు. కరోనా లక్షణాలు తగ్గే వరకూ ఇద్దరూ విడిగా వేర్వేరు పడక గదుల్లో నిద్రపోవడం మేలు.
- చేతులను శుభ్రంగా ఉంచుకుంటూ... భౌతిక దూరాన్ని పాటిస్తూ... వైరస్ సోకకుండా పూర్తి జాగ్రత్త వహిస్తున్న జీవిత భాగస్వామితోనే శృంగారం సురక్షితం. ప్రస్తుతం ఇళ్లలో ఒకరి నుంచి ఒకరికి వైరస్ సంక్రమించడం 3 నుంచి 10 శాతం వరకూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఇందులో ముద్దులు పెట్టుకోవడం, శృంగారంలో పాల్గొనడం ద్వారా వైరస్ ఎంత మేర వ్యాపిస్తుందో లెక్కల్లేవు.
- ఇంట్లో రెండు స్నానాల గదులు ఉంటే... కరోనా సోకిన భాగస్వామికి ఒకదాన్ని ప్రత్యేకంగా కేటాయించాలి. దాన్ని మిగతా కుటుంబ సభ్యులు వాడకూడదు. ఇద్దరూ ఆరడుగుల దూరం పాటిస్తూ.. ఇంటి లోపల పరిసరాల్లో వైరస్ నివారణ ద్రవాలను పిచికారీ చేసుకోవాలి. 14 రోజుల పాటూ ఇద్దరూ విడిగానే ఉండాలి.
- కలయిక సమయంలో కండోమ్‌లను వాడటం మేలని నిపుణుల సూచన.