తెలంగాణలోని బీబీనగర్‌లో ఏర్పాటు చేస్తున్న ఎయిమ్స్ నిర్మాణంలో ఏడాది జాప్యం జరిగేలా కన్పిస్తోందని పార్లమెంటు అంచనాల కమిటీ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. ‘‘2018 డిసెంబరు 17న ఆమోదముద్ర వేసిన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2022 సెప్టెంబరు నాటికి పూర్తిచేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. రూ.1,028 కోట్ల అంచనా వ్యయానికిగానూ, ఇప్పటివరకూ రూ.28.16 కోట్లు విడుదలయింది. ప్రీఇన్వెస్ట్‌మెంట్ పనులు పురోగతిలో ఉన్నాయి.
ప్రధాన నిర్మాణ పనులు చేపట్టడానికి నిర్వహణ ఏజెన్సీని నియమించారు. నిర్మాణ నమూనా కోసం కన్సల్టెంట్ నియామకం కూడా జరిగింది. పనుల కోసం గుత్తేదారులను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచారు. వీటన్నింటి దృష్ట్యా 2023 నవంబరు నాటికి ఇది పూర్తయ్యే అవకాశం ఉందని’’ కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 201 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసిందని, ప్రస్తుతం ఇక్కడ ఎంబీబీఎస్ తరగతులు, ఓపీ సేవలు ప్రారంభమయ్యాయని తెలిపింది.
తెలంగాణకు రూ.2,99,811 కోట్లు అందించాం..
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణకు గత 8 బడ్జెట్‌లలో కేంద్రం నుంచి 2 లక్షల 99 వేల 811 కోట్ల వనరులు వెళ్లినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌదరి తెలిపారు. రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఈమేరకు సమాధానమిచ్చారు. 2014-15 నుంచి 2021-22 మధ్యకాలంలో పన్నుల్లో వాటా కింద లక్ష 8 వేల 968 కోట్ల రూపాయలు, కేంద్ర సాయం కింద లక్ష 84 వేల 490 కోట్లు... రుణాలు, అడ్వాన్సుల కింద 6 వేల 352 కోట్లు తెలంగాణకు అందించినట్లు వెల్లడించారు. 2014-15లో 14 వేల 942 కోట్లు, 2015-16లో 21 వేల 554 కోట్లు, 2016-17లో 24 వేల 905 కోట్లు, 2017-18 లో 41 వేల 57 కోట్లు, 2018-19 లో 47 వేల 435 కోట్లు, 2019-20 లో 48 వేల 602 కోట్లు, 2020-21 లో 62 వేల 875 కోట్లు, 2021-22లో 38 వేల 437 కోట్లు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చినట్లు కేంద్రమంత్రి సమాధానంలో వివరించారు.
రైతులకు పరిహారం గురించి వివరాలు ఇవ్వలేదు...
రైతు ఉద్యమంలో చనిపోయిన 750 మంది కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటనకు సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం నుంచి కోరినా ఇంతవరకూ రాలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. తెలంగాణ పరిహారం ప్రకటించిన విషయం గురించి కేంద్ర ప్రభుత్వానికి అవగాహన ఉందా? ఉంటే చెప్పాలంటూ మంగళవారం లోక్‌సభలో తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
ఇదీ చూడండి: AIIMS Bibinagar Medical services: పేదల పెన్నిధిగా ఎయిమ్స్.. చౌకగా వైద్యపరీక్షలు!