యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రం అత్యంత వైభవంగా రూపుదిద్దుకుంటోంది. స్వామివారి సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం వసతుల కల్పన కోసం యాడా శ్రమిస్తోంది. యాదాద్రి ఆలయ ఉద్ఘాటనకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రసాదాల తయారీల కోసం నిర్మిస్తున్న పనులు తుదిదశకు చేరుకున్నాయి. లడ్డూ తయారీ, బూంది, పులిహోర తదితర ప్రసాదాలను మానవుల ప్రమేయం లేకుండా నేరుగా యంత్రాలతో తయారు చేయనున్నారు.
తిరుపతి తరహాలో...
ప్రసాదాల తయారీకి అవసరమైన యంత్రాలను సమకూర్చుతోంది. ఆ పనులు దాదాపు పూర్తైనట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. త్వరలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు గుత్తేదారు సంస్థ సంసిద్ధమవుతోంది. ప్రస్తుతం యాదాద్రి దేవస్థానం సిబ్బంది రోజుకు పదివేల లడ్డూలు, 2వేల పులిహోర ప్యాకెట్లు తయారు చేయిస్తున్నారు. ఆలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. అందుకే రూ.5కోట్లతో కొత్త యంత్రాలను సమకూర్చారు. యంత్రాలతో రోజుకు లక్ష లడ్డూలు, 50వేల పులిహోర ప్యాకెట్లు తయారు చేస్తామని ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. యాదాద్రి ఉద్యోగులకు ఏడాదిపాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇదే తరహాలో ప్రసాదాలు తయారు చేస్తున్నారని వివరించారు.
శరవేగంగా దర్శన వరుసల పనులు
ప్రధానాలయంలో దర్శన వరుసల ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా ఇత్తడి వరుసల పనులు పూర్తి చేస్తామని యాడా ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి తెలిపారు. ఇటీవల యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్ సూచనలను అనుసరించి పలు మార్పులు చేస్తున్నామని... వాటిని త్వరలోనే పూర్తిచేస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి: రెండోసారి కరోనాను జయించిన 104 ఏళ్ల బామ్మ