యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను కలెక్టర్ అనితారామచంద్రన్ పర్యవేక్షించారు. కొండ కింద చేపడుతున్న వలయ రహదారి పనులను అధికారులతో కలసి పరిశీలించారు. వైకుంఠ ద్వారం నుంచి మొదటి ఘాట్ రోడ్ వరకు చేపట్టనున్న విస్తరణ ప్రణాళికలను పరిశీలించారు. రోడ్డు విస్తరణలో ఇల్లు, స్థలాలు, ఫ్లై ఓవర్ నిర్మాణ ప్రణాళికలు తదితర అంశాలు అధికారులతో చర్చించారు.
రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతున్న వారికి 100 గజాల స్థలం కేటాయించే యోచనలో ఉన్నామని.. అందుకుగాను 12 నుంచి 15 ఎకరాల స్థలం అవసరం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. వైటీడీఏ పరిధిలో ఇళ్లస్థలాలు ఇవ్వాలని నిర్వాసితులు అడిగారు. వైటీడీఏ ఒప్పుకుంటే అక్కడే స్థల సేకరణ చేస్తామని, లేదంటే తామే రెండు, మూడు చోట్ల స్థలం ఎంపిక చేయాలని కలెక్టర్ సూచించారు.
ఆలయ అభివృద్ధి పనులను యాడ అధికారులు పరీశిలించారు. ఈఎన్సీ రవీందర్ రావు, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఈఓ గీతరెడ్డి, యాడ అధికారులతో కలసి ఆలయ పనులను నిశితంగా పరిశీలించారు. ప్రధానాలయ సాలహారాల్లో చేపడుతున్న విగ్రహాల పొందిక పనులను.. కొండ పైన జరుగుతున్న పుష్కరిణి, కొండ కింద చేపడుతున్న రోడ్డు మరమ్మతు పనుల వివరాలను అధికారులను ఆడిగితెలుసుకున్నారు.