యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం గర్భాలయంలోకి వాన నీరు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ‘ఈనాడు’లో ‘యాదాద్రి గర్భాలయంలోకి వర్షపు నీరు’ అనే శీర్షికన శనివారం వార్త ప్రచురితమైంది. స్పందించిన సాంకేతిక కమిటీ సభ్యుడు కొండల్‌రావు, ఈవో గీతారెడ్డి, ఆలయ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి, స్థపతి వేలు, వైటీడీఏ అధికారులు శనివారం ప్రధానాలయంలోని ముఖమండపాన్ని పరిశీలించారు. పైకప్పు ఎక్కి చూశారు. అద్దాల మండపంలోకి నీరెలా వచ్చింది? తిరుమాడ వీధుల్లోకి వాన నీరు ఎలా చేరింది? అనే కోణంలో అధికారులతో చర్చించారు.
వర్షపు నీరు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమాలోచనలు జరిపారు. యాదాద్రి ప్రధానాలయం, తిరుమాడ వీధుల పనులనూ పరిశీలించారు. ఆలయం లోపలికి నీరు రావడానికి గల కారణాలు గుర్తించారా? అని ఈ సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కొండల్‌రావును ప్రశ్నించగా ఆయన సమాధానమివ్వలేదు. అంతలోనే ఆలయ ఈవో గీతారెడ్డి కలుగజేసుకుని ‘అన్ని విషయాలూ నేను చెబుతానంటూ’ అక్కణ్నుంచి వెళ్లిపోయారు.
‘అద్దాల మండపం పైకప్పు ఇటీవలే వేశాం. రాళ్ల మధ్య వేసిన జిగురు పదార్థం గట్టిపడటానికి రెండు నెలల సమయం పడుతుంది. ఈలోపే వర్షం కురవడంతో పైకప్పు ఉరిసి నీరు మండపంలోకి చేరింది. రెండు రోజుల్లో మరో సాంకేతిక బృందం వస్తుంది. వాళ్లు కూడా పరిశీలించి పైకప్పు నుంచి నీళ్లు కారడంపై నివేదిక ఇస్తారు. దానికి అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని ఆలయ ఈవో వెల్లడించారు.
- ఇవీ చూడండి: దేశంలో కరోనా తీవ్రతపై ప్రధాని మోదీ సమీక్ష