yadadri temple news: దాదాపు ఆరేళ్లుగా బాలాలయానికే పరిమితమైన యాదాద్రి పంచనారసింహుల దర్శనాలు, ఆర్జిత పూజలు ఇక పునర్నిర్మితమైన ప్రధానాలయంలో కొనసాగనున్నాయి. ఈ నెల 28న సీఎం కేసీఆర్ సమక్షంలో జరగనున్న మహాకుంభ సంప్రోక్షణ పర్వానికి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్లాట్ ఫారాలను సిద్ధం చేస్తున్నారు.
yadadri temple : భక్తులు ప్రధానాలయంలోకి వెళ్లేందుకు దర్శన వరుసల సముదాయం(క్యూలైన్ కాంప్లెక్స్) నాలుగు అంతస్తులో రూపుదిద్దుకుంటోంది. కొండపై ఆలయ పరిసరాలలో రెండు కనుమదారులను కలుపుతూ నిర్మితమవుతోన్న భారీ స్వాగత తోరణం పనులను అధికారులు వేగవంతం చేశారు. యాదాద్రిని మహాపుణ్యక్షేత్రంగా రూపొందించినవారి కృషికి దర్పణంగా భారీ శిలాఫలకం ఏర్పాటును చేయనున్నారు. ఆలయానికి ఉత్తర దిశలో శిలాఫలకం ఏర్పాటు చేయాలని యాడా అధికారులు నిర్ణయించారు. అందుకనుగుణంగా పనులు వేగవంతం చేశారు.
yadadri temple reopening : ఆలయ ఉద్ఘాటనలో అత్యంత కీలకమైన మహాకుంభ సంప్రోక్షణ పర్వంలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. అందుకనుగుణంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సునీత పరిశీలించారు. సీఎంతో పాటు వచ్చే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులకు కల్పించాల్సిన వసతులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవ నిర్వహణ ఏర్పాట్లను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి ఈరోజు పరిశీలించనున్నారు. అందులో భాగంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఆలయ నిర్వాహకులతో సమావేశం నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: Yadadri Daily Schedule: యాదాద్రిలో రోజువారిగా నిర్వహించే పూజాకార్యక్రమాల వివరాలు ఇవే..