CM KCR about Bhoodan Pochampally: ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) తొలిసారిగా నిర్వహించిన ‘ఉత్తమ పర్యాటక గ్రామం’ (బెస్ట్ టూరిజం విలేజ్) పోటీలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పురస్కారాన్ని పొందడం రాష్ట్రానికే గర్వకారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ పురస్కారం తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల నుంచి వెళ్లిన 170 ప్రతిపాదనల్లో.. మన దేశం నుంచి మూడు గ్రామాలవి ఉన్నాయని, అందులో భూదాన్ పోచంపల్లి ఎంపికై అరుదైన ఘనత సాధించిందని తెలిపారు. యూఎన్‌డబ్ల్యూటీవో ప్రదానం చేసిన గుర్తింపు పత్రాన్ని మంగళవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేసి పోచంపల్లి శాలువాతో సత్కరించారు. మంత్రితో పాటు పర్యాటక సంస్థ ఎండీ మనోహర్, ఇతర అధికారులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
సాంప్రదాయ, చేనేత, వ్యవసాయ అనుబంధ రంగాలను నమ్ముకునే భూదాన్ పోచంపల్లి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. 1951లో ఆచార్య వినోబాభావే చేపట్టిన పాదయాత్ర ద్వారా దేశంలో ఒక కొత్త శకానికికి ఈ గ్రామం నాంది పలికింది. ఇక్కడి భూదాత వెదిరె రామచంద్రారెడ్డి వినోబాభావే పిలుపు మేరకు హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేశారు. అనంతరం ఈ కార్యక్రమాలను విస్తృతం చేస్తూ సుమారు 44 లక్షల ఎకరాల భూమిని దాతల నుంచి స్వీకరించి భూమిలేని పేదలకు పంచిపెట్టారు. ఈ గ్రామం భూదానోద్యమంతో భూదాన్ పోచంపల్లిగా మారింది. గ్రామంలో ఓ మ్యూజియం కూడా ఉంది. పర్యాటక శాఖ దీన్ని నిర్వహిస్తుంది. తమ గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావటం పట్ల అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా తమ గ్రామానికి మంచి గుర్తింపుతో పాటు పర్యాటకులు కూడా పెరిగే అవకాశం ఉంటుందని పోచంపల్లి వాసులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: Bhoodan pochampally: ఖండాంతరాలు దాటిన ఖ్యాతి.. ఉత్తమ పర్యాటక పురస్కారం అందుకున్న పోచంపల్లి