పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 25 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలను ఉదయం స్వస్తివాచనం, పుణ్యాహవాచనంతో ఘనంగా ప్రారంభించారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించగా భక్తులు లేకుండానే జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఏకాంత సేవలో నిరాడంబరంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
జయంతి ఉత్సవాల్లో మొదటిరోజైన ఇవాళ తిరువెంకటపతి అలంకార సేవలో ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ కనువిందు చేశారు యాదాద్రి నరసింహుడు. అంతకుముందు స్వస్తివాచనంతో జయంతి ఉత్సవాలను శాస్త్రోత్తంగా ప్రారంభించిన అర్చకులు, స్వామివారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చన ముందు స్వస్తి వచనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం నిర్వహించారు. ఉత్సవాలలో ఆలయ ఈఓ గీతారెడ్డి, ఆలయ ఛైర్మన్ నరసింహ మూర్తి ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.
యాదాద్రి అనుబంధ ఆలయం పాత గుట్టలో ఉత్సవాలు మొదలయ్యాయి. పాత గుట్టలో యాదాద్రి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, అర్చకులు కొడకండ్ల మాధవాచార్యులు, ఆలయ ఏఈఓ దొర్భాల భాస్కర్ శర్మ ఆధ్వర్యంలోని అర్చక బృందం కైంకర్యాలు నిర్వహించారు. రెండోరోజైన రేపు కాళీయమర్థని అవతారం, రామావతారం, లక్షకుంకుమార్చన నిర్వహించనున్నారు. జయంతి ఉత్సవాల్లో చివరి రోజైన 25న సహస్ర ఘటాభిషేకంతో ఉత్సవాలను పరిసమాప్తి పలకనున్నారు ఆలయ అర్చకులు.