యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని శివాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కల్యాణ తంతును వీక్షించడానికి భక్తులను అనుమతించలేదు. కేవలం ఆలయ అధికారులు మాత్రమే పాల్గొన్నారు. మొదట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు, అనంతరం సీతారాముల ఉత్సవమూర్తులను కల్యాణ మండపంలో అధిష్టింపజేసి సీతారాములను సుందరంగా అలంకరించారు. పెళ్లికొడుకు, పెళ్లికూతురు వేషధారణలో, వజ్రవైఢూర్యాలతో సీతారాములు మెరిసిపోయారు.
సరిగ్గా ఉదయం 11.30 గంటలకు మొదలైన సీతారాముల కల్యాణ తంతు దాదాపు రెండు గంటలపాటు కొనసాగింది. కల్యాణ ఘడియ సమీపించగానే సీతమ్మవారి మెడలో శ్రీరాముడు మాంగళ్యధారణ గావించారు. లోకకల్యాణం కోసం శ్రీరాముడు సీతమ్మను పెళ్లాడి ఆదర్శ దంపతులుగా వర్ధిల్లారని వేదపండితులు ప్రవచించారు. కల్యాణ తంతు అనంతరం ఆలయ అధికారులు భక్తులకు ప్రసాద వితరణ, తలంబ్రాలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: కర్ఫ్యూ దృష్ట్యా యాదాద్రీశుని పూజా వేళల్లో మార్పు