యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ, ఐదుదోనల తండా ప్రజలకు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ నిత్యావసర సరకులు అందజేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో సరకులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన జాతీయ రహదారి నుంచి రాచకొండ కోట వరకు ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను ఆవిష్కరించారు. 2016లో నూతన కమిషనరేట్ ఏర్పడ్డాక సంస్థాన్ నారాయణపురం మండలాన్ని కమిషనరేట్లో చేర్చడం వల్ల వందల సంవత్సరాల చరిత్ర కలిగిన రాచకొండ ప్రాంతం గుర్తింపు వల్ల రాచకొండ కమిషనరేట్ అని పేరు వచ్చిందని సీపీ తెలిపారు.
తాము ఈ రాచకొండను దత్తత తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని ఆయన వెల్లడించారు. టెలికాం సిగ్నల్ వ్యవస్థ, మెగా హెల్త్ క్యాంప్, చిన్నారులకు పుస్తకాల పంపిణీ, కడిల బాయి తండాలో రోడ్లు వేయించామన్నారు. ఈ లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో 500 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. ఇన్ఫోసిస్ వారి సౌజన్యంతో రాచకొండకి వచ్చే మార్గాలలో సుమారు 30 సంవత్సరాలు ఉండేవిధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని సీపీ మహేష్ భగవత్ సూచించారు.
ఇవీ చూడండి: మేమున్నామని... ఆకలి తీరుస్తామని...