యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన కొండపైన, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఆలయం, శివాలయం, బాలాలయం, పరిసరాల్లో పందులు తిరుగుతూ పరిసరాలను అపరిశుభ్రంగా మారుస్తున్నాయి. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించినప్పుడు వరాహాల సంచారం చూసి యాదాద్రిలో వాటిని లేకుండా చూడాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు.
దీనివల్ల కొండపైకి వరాహాలు వెళ్లకుండా చుట్టూ లక్షల రూపాయలు వ్యయం చేసి తాత్కాలికంగా కందకం తీశారు. కానీ అధికారుల పర్యవేక్షణ లేక ఇటీవల మళ్లీ పందులు తిరుగుతున్నాయి. ఆలయ పరిసరాల్లోకి వరాహాలు వచ్చినప్పుడు సంప్రోక్షణ చేసిన తర్వాత స్వామివారికి పూజలు చేయాల్సి ఉంటుందని అర్చకులు చెబుతున్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు భక్తులు, స్థానికులు విజ్ఞప్తి చేశారు.