యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి చెరువు కట్టకు ప్రమాదం పొంచివుంది. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం చేరవేయగా, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చెరువు కట్టను పరిశీలించారు. తాతానగర్ సమీపంలో చెరువు కట్ట కుంగిపోవటం వల్ల కట్ట నుంచి మట్టి కిందకు జారుతోంది. ఇది గమనించిన అధికారులు యుద్ధప్రాతిపదికన చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టారు.
భువనగిరి మండలం వడపర్తి నుంచి వచ్చే కాలువ ద్వారా భారీగా నీరు చేరటం వల్ల చెరువు జలకళను సంతరించుకుంది. నిండు కుండగా మారిన చెరువు నుంచి ఏ క్షణానైనా ప్రమాదం పొంచి ఉండటం వల్ల రెండు చోట్ల అధికారులు గండి పెట్టారు. నీటిని దిగువకు వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాలైన తాతానగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ పరిసర ప్రాంత ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. చెరువుకు గండి పెట్టిన రెండు చోట్లా స్థానికులు అటు వైపు వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షించారు.