యాదాద్రి భువనగిరి జిల్లా పిట్టలగూడెం గ్రామంలో సుమారు 40 కుటుంబాలు ఉంటాయి. అక్కడ 10 మాత్రమే పక్కా గృహాలు కాగా... 30 కుటుంబాలు కర్రలను ఊతంగా చేసుకుని పూరిగుడిసెలో నివసిస్తున్నారు. కొన్ని కుటుంబాలకు స్నానపు గదులు కూడా చీర పరదాలే కావడం విచారకరం. కేవలం ఎన్నికల వేళ తప్ప తమ గోడు వినే నాథుడే కరవయ్యారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలినడకే దిక్కు:
పిట్టలగూడెం పంచాయతీ అయిన నెమిల గ్రామానికి వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు నడవాల్సిందే. ఆ దారి అంత దారుణంగా ఉంటుంది. అత్యవసర వైద్యానికి రాత్రివేళ వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సిందే. ఇటీవల ఓ మహిళకు పురిటి నొప్పులు వస్తే... 108 వాహనం పిట్టలగూడెంకు రాని పరిస్థితి. కాలినడకన వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలోనే ప్రసవం అయింది. పైగా పూరిగుడిసెలు కావడంతో ఎప్పుడు ఏ సమస్య వస్తోందని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వర్షం వస్తే ఇక అంతే సంగతులు. మురికి కాలువల సదుపాయం లేదు. వీధి దీపాలు ఏర్పాటు అరకొరగానే ఉంది. తమ సమస్యలను పరిష్కరించాలని పాలకులను గ్రామస్థులు వేడుకుంటున్నారు.
స్పందించండి
విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలంటే దూది వెంకటపురం, నెమిల గ్రామాలకు కాలినడకన పోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని గ్రామానికి రోడ్డు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీ చూడండి : 'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'